గురుకుల పాఠశాల ఎదుట తల్లిదండ్రుల ఆందోళన
బాన్సువాడ రూరల్: బోర్లంక్యాంపులోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల ఎదుట ఆదివారం పలువురు తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ఇటీవల పాఠశాల నుంచి ఓ విద్యార్థినిని వరుసకు అన్న అయ్యే యువకుడు బలవంతంగా తీసుకెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో విద్యార్థినుల భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లిపోతామని హెచ్చరించారు. ప్రిన్సిపల్ రమాదేవి తల్లిదండ్రులను సముదాయించారు. పిల్లల చదువు, ఆరోగ్యం, భద్రత విషయంలో రాజీ పడబోమన్నారు. మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పొరపాటుకు తమను నిందించడం తగదన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని, తల్లిదండ్రులు సహకరించాలని కోరగా వారు శాంతించి ఆందోళన విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment