ఖలీల్‌వాడి: జానకంపేట రైల్వేస్టేషన్‌లో ఓ మహిళ మెడలోనుంచి రెండు తులాల బంగారు గొలుసును గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లినట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి ఆదివారం తెలిపారు. వివరాలు ఇలా.. హైదరాబాద్‌కు చెందిన కుమారిరెడ్డి రేణుక( 23) తన స్నేహితులతో కలిసి ఆదివారం ఉదయం బాసరకు వెళ్లింది. తిరిగి సాయంత్రం రైలులో ఆమె హైదరాబాద్ వెళుతుండగా జానకంపేట రైల్వేస్టేషన్‌లో క్రాసింగ్ ఉండటంతో ఆగింది. కొద్దిసేపటికి రైలు బ యలుదేరగా ప్లాట్‌ఫామ్‌పైన గుర్తు తెలియని ఒక వ్యక్తి తన వద్దకు వ చ్చి కిటికీలోంచి తన మెడలో ఉన్న రెండు తులాల బంగారు చైన్ ఎత్తుకెళ్లాడు. వెంటనే ఆమె నిజామాబాద్ రైల్వేస్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకొని, విచారణ చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.
మైలారం గ్రామంలో..
నస్రుల్లాబాద్(బాన్సువాడ): మండలంలోని మైలారం గ్రామంలో గల కొచ్చెరి మైసమ్మ ఆలయం వద్ద చైన్ స్నాచింగ్ జరిగింది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామానికి చెందిన లక్ష్మి తన బంధువుల శుభకార్యం నిమిత్తం ఆదివారం కొచ్చెరి మైసమ్మ ఆలయానికి వచ్చింది. తిరుగు ప్రయాణంలో ఆమె ఆలయం నుంచి వెళ్తుండగా వెనుకనుంచి బైక్‌పై గుర్తుతెలియని వ్యక్తి వచ్చి మెడలోని పుస్తెలతాడును ఎత్తుకెళ్లాడు. వెంటనే ఆమె పోలీసులను ఆశ్రయించగా, విషయం తెలుసుకున్న బాన్సువాడ రూరల్ సీఐ రాజేష్ నస్రుల్లాబాద్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి బాధితురాలితో మాట్లాడారు. వెంటనే దర్యాప్తు చేయాలని ఎస్సై లావణ్యను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment