చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
బాల్కొండ: ముప్కాల్ మండల కేంద్రం శివారులోని చెరువులో సోమవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ముప్కాల్ ఎస్సై రజనీకాంత్ కేసు నమోదు చేసుకుని శవాన్ని చెరువులో నుంచి బయటకు తీయించారు. మృతుడి వయస్సు సుమారు 30–35ఏళ్లు ఉంటుందని, బూడిద కలర్ చొక్కా, గోధుమ కలర్ ప్యాంటు ధరించి ఉన్నాడని ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని ఎవరైనా గుర్తిస్తే ముప్కాల్ పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలన్నారు. మృతదేహాన్ని ఆర్మూర్ ప్రభుత్వాస్పత్రి మార్చురీలో ఉంచినట్లు తెలిపారు.
సగం కాలినస్థితిలో ఒకరి మృతదేహం..
ఇందల్వాయి: మండలంలోని చంద్రాయన్‌పల్లి శివారులోగల అటవీప్రాంతంలో సోమవారం ఓ వ్యక్తి మృతదేహం సగం కాలిన స్థితిలో లభ్యమైంది. మృతుడు జిల్లాకేంద్రానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. వివరాలు ఇలా.. జిల్లా కేంద్రంలోని నాగారం 300 క్వార్టర్స్‌లోని బీడీ కాలనీకి చెందిన సందీప్(28) ఈనెల 15న అదృశ్యమయ్యాడు. 5వ టౌన్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందల్వాయి పోలీసులకు సగం కాలిన స్థితిలో ఉన్న మృతదేహం లభించగా, దుస్తులు, ఇతర ఆనవాళ్ల ఆధారంగా సందీప్‌గా 5వ టౌన్ పోలీసులు గుర్తించారు. కేబుల్ ఆపరేటర్‌గా పని చేస్తున్న అతడిని అతని స్నేహితులే శనివారం ఆటోలో తీసుకెళ్లినట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించి విచారణ చేస్తున్నట్లు ఇందల్వాయి ఎస్సై మనోజ్ తెలిపారు. త్వరలో వివరాలు వెళ్లడిస్తామని ఐదో టౌన్ ఎస్సై గంగాధర్ తెలిపారు.
భిక్కనూరులో బైక్ చోరీ
భిక్కనూరు: మండల కేంద్రంలో ఇటీవల ఓ బైక్ చోరీకి గురైందని భిక్కనూరు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. మండల కేంద్రానికి చెందిన బండి సిద్దగిరి ఈనెల 14న తన ఇంటి ముందర బైక్ పెట్టి, ఇంట్లోకి వెళ్లాడు. గంటన్నర తర్వాత బయటకు వచ్చి చూడగా బైక్ కనిపించలేదు. ఈ విషయమై బాధితుడు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు.
నిజామాబాద్ రైల్వేస్టేషన్‌లో..
ఖలీల్‌వాడి: నిజామాబాద్ రైల్వేస్టేషన్ ఎదుట నిలిపిన ఓ బైక్ చోరీకి గురైనట్లు ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి సోమవారం తెలిపారు. నగరానికి చెందిన రాజ్‌కుమార్ అనే వ్యక్తి జనవరి 31న తన బైకును రైల్వేస్టేషన్ ముందు పార్క్ చేసి హైదరాబాద్ వెళ్లాడు. తిరిగి ఈనెల 2న అతడు వచ్చేసరికి రైల్వేస్టేషన్‌లో పార్క్ చేసిన బైక్ కనబడలేదు. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
జగదాంబ ఆలయంలో..
నిజామాబాద్ రూరల్: మండలంలోని గొల్లగొట్టతండాలోగల సేవాలాల్ జగదాంబ ఆలయంలో చోరీ జరిగినట్లు పోలీసులు తెలిపారు. గుర్తుతెలియని దుండగులు ఆదివారం అర్ధరాత్రి ఆలయంలోకి చొరబడి అమ్మవారి ముక్కుపుడుక, పుస్తెలు ఎత్తుకువెళ్లారని రూరల్ ఎస్సై–2 ఆనంద్ సాగర్ తెలిపారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
నమ్మకంగా ఉంటూనే దోచేశారు
ఖలీల్‌వాడీ: నగరంలోని ఓ వైద్యురాలి వద్ద ఇద్దరు వ్యక్తులు కొన్ని నెలలుగా పనులు చేస్తూ, నమ్మకంగా ఉంటూ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపిన వివరాలు ఇలా.. ఖలీల్‌వాడిలోని భాగ్య అనే వైద్యురాలి వద్ద రాజు, పవన్ అనే ఇద్దరు వ్యక్తులు కొన్ని నెలలుగా పనిచేస్తుండేవారు. నమ్మకంగా ఉండటంతో వైద్యురాలు వారికి ఇంటి తాళాలను ఇచ్చింది. ఈక్రమంలో ఇద్దరు కలిసి ఆరు నెలలుగా విడతల వారీగా 35 తులాల బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. విషయం తెలిసిన వైద్యురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
టీచర్‌పై పోక్సో కేసు
గాంధారి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న సాంఘికశాస్త్రం ఉపాధ్యాయుడు రమేష్‌పై సోమవారం పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. సదరు ఉపాధ్యాయుడు ఓ విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా విద్యార్థిని తల్లిదండ్రుల సెల్‌ఫోన్‌కు అసభ్యకర మెసేజ్‌లు పంపాడు. దీంతో విద్యార్థిని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
మేకను గావుపట్టిన వారిపై కేసు..
బాల్కొండ: మండల కేంద్రంలో ఈ నెల 12న మల్లన్న ఆలయ ఉత్సవాల్లో మేక పిల్లను గావుపట్టిన వారిపై బాల్కొండ పోలీస్ స్టేషన్‌లో సోమవారం కేసు నమోదైంది. జంతు సంరక్షణ సమితికి చెందిన గౌతమ్, శ్రీవిద్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment