చోరీ కేసులో ముగ్గురి రిమాండ్
బోధన్‌టౌన్(బోధన్): చోరీ కేసులో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పట్టణ సీఐ వెంకటనారాయణ తెలిపారు. బోధన్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రాజస్థాన్‌కు చెందిన బచ్చుసింగ్ బాగ్రియా కుటుంబంతో కలిసి బతుకు దెరువు కోసం 15 రోజుల క్రితం బోధన్‌కు వచ్చాడు. స్థానికంగా బొమ్మలు అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు. ఇటీవల బాగ్రియా తన వద్ద ఉన్న రూ. 40వేల నగదును సమీప బ్యాంక్‌లో డిపాజిట్ చేయడానికి వెళ్లాడు. బ్యాంక్ బంద్ ఉండటంతో అతడు తిరిగి తన ఇంటికి వెళుతుండగా మార్గమధ్యలో సాత్‌పూల్ కల్లుబట్టి వద్ద ముగ్గురు వ్యక్తులు కలిసి, కల్లుబట్టిలోకి తీసుకువెళ్లారు. కల్లు తాగిన అనంతరం బాగ్రియాను సదరు వ్యక్తులు బెదిరించి రూ. 40వేల నగదును తీసుకొని పారిపోయారు. మరుసటి రోజు బాగ్రియా పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా కొత్త బస్టాండ్ వద్ద ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో పట్టుకున్నారు. పట్టణానికి చెందిన షేక్ మహ్మద్, వసీం, సయ్యద్ సజ్జన్‌లను అదుపులోకి తీసుకొని విచారించగా బాగ్రియా వద్ద తామే డబ్బులు తీసుకున్నామని అంగీకరించారు. అనంతరం వారి వద్ద నుంచి రూ. 10,500 నగదును స్వాధీనం చేసుకొని, అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు సీఐ వెల్లడించారు.
పొక్లెయిన్, ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
సిరికొండ: మండలంలోని గడ్కోల్ గ్రామంలో కప్పలవాగులో నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న పొక్లెయిన్, రెండు ట్రాక్టర్లను సోమవారం పట్టుకున్నట్లు ఎస్సై రామ్ తెలిపారు. పొక్లెయిన్, ట్రాక్టర్లు తాళ్లపల్లి వెంకగౌడ్‌కు చెందినవని ఆయన తెలిపారు. వాహనాలను పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశామన్నారు. తదుపరి విచారణ కోసం వాహనాలను మైనింగ్ శాఖకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు.
మోపాల్ మండలంలో..
మోపాల్: మండలంలోని కాస్‌బాగ్‌తండాకు చెందిన హరిసింగ్ అనుమతులు లేకుండా ఆదివారం అర్ధరాత్రి ట్రాక్టర్‌లో ఇసుకను తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎస్సై యాదగిరి తెలిపారు. ట్రాక్టర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
పోతంగల్ మండలంలో..
రుద్రూర్: పోతంగల్ మండలం కారేగాం శివారులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టుకున్నట్టు ఎస్సై సందీప్ సోమవారం తెలిపారు. ట్రాక్టర్లను కోటగిరి పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.
వేర్వేరు కేసుల్లో ఇద్దరికి రెండు రోజుల జైలు
బోధన్‌టౌన్(బోధన్): వేర్వేరు కేసుల్లో ఇద్దరికి రెండు రోజులు జైలు శిక్షను బోధన్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ విధించినట్లు పట్టణ సీఐ నారాయణ సోమవారం తెలిపారు. ఇటీవల పట్టణానికి చెందిన షేక్ జలాల్ మద్యం తాగి వాహనం నడుపగా పోలీసులకు పట్టుబడ్డాడు. అలాగే మరోవ్యక్తి బహిరంగ ప్రదేశంలో మద్యం తాగుతుండగా అతడిని పోలీసులు పట్టుకున్నారు. అనంతరం ఇద్దరిని బోధన్ కోర్టులోని సెకండ్‌క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరుచగా జైలుశిక్ష విధించినట్లు సీఐ తెలిపారు.
చోరీ కేసులో ముగ్గురి రిమాండ్
Comments
Please login to add a commentAdd a comment