తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాలి
తాడ్వాయి(ఎల్లారెడ్డి): గ్రామాలలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం తాడ్వాయి మండల కేంద్రాన్ని సందర్శించారు. అధికారులు గ్రామాలలో తిరుగుతూ తాగునీటి సమస్యలు ఉన్న గ్రామాలను గుర్తించి సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. మండల పరిషత్ కార్యాలయాన్ని తనిఖీ చేసి సమగ్ర కుటుంబసర్వేకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాలలో పెండింగ్‌లో ఉన్న ఇంటి పన్నులను 100 శాతం వసూలు చేయాలని సూచించారు. అనంతరం తాడ్వాయి శివారులోని నర్సరీని పరిశీలించారు. ప్రతిరోజు మొక్కలకు నీటిని పోసి మొక్కలు ఏపుగా పెరిగేలా చూడాలన్నారు. మండల ప్రత్యేక అధికారి రాజారాం, ఎంపీడీవో సయ్యద్ సాజిద్, ఎంపీవో సవితారెడ్డి, గ్రామ కార్యదర్శులు, ఉపాధిహామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment