రెండు బైకులు ఢీ: ఇద్దరికి గాయాలు
ఇందల్వాయి: మండలంలోని చంద్రాయన్‌పల్లి గ్రామ శివారులోగల 44వ నంబరు జాతీయ రహదారిపై మంగళవారం మధ్యాహ్నం ఓ బైక్ ముందున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. స్థానికులు, అంబులెన్స్ సిబ్బంది తెలిపిన వివరాలు ఇలా.. చంద్రాయన్‌పల్లి విద్యుత్ సబ్ స్టేషన్‌లో ఆపరేటర్‌గా పని చేస్తున్న అశోక్ కామారెడ్డి నుంచి బైక్‌పై వస్తున్నాడు. కామారెడ్డికి చెందిన భరత్ అదేమార్గంలో కామారెడ్డి నుంచి నిజామాబాద్ వైపు బైక్‌పై వెళ్తుండగా వెనుక నుంచి అతడిని ఢీకొన్నాడు. ఈప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఇరువురిని టోల్‌ప్లాజా అంబులెన్స్‌లో నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు.
పేకాడుతున్న ఆరుగురి అరెస్టు
ఖలీల్‌వాడి: రెంజల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తాడ్‌బిలోలి గ్రామశివారులోగల పేకాట స్థావరంపై దాడి చేసినట్లు టాస్క్‌ఫోర్స్ సీఐ అంజయ్య, స్పెషల్ పార్టీ సిబ్బంది మంగళవారం తెలిపారు. పేకాడుతున్న ఆరుగురిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే వారి వద్ద నుంచి ఐదు బైక్‌లు, నాలుగు సెల్‌ఫోన్లు, రూ. 31,100 నగదును స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. తదుపరి చర్య నిమిత్తం రెంజల్ ఎస్సై సాయన్నకు అప్పగించినట్లు తెలిపారు.
అటవీ భూమిని చదును చేసిన ట్రాక్టర్లు స్వాధీనం
సిరికొండ: మండలంలోని తాటిపల్లి గ్రామ సమీపంలోగల అటవీభూమిని చదును చేసిన రెండు ట్రాక్టర్లను పట్టుకొని సీజ్ చేసినట్లు ఇన్‌చార్జి ఎఫ్‌ఆర్వో రవీంధర్ మంగళవారం తెలిపారు. ట్రాక్టర్లను స్వాధీనపర్చుకునే సమయంలో అటవీశాఖ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించిన మాలావత్ మదన్‌లాల్, సావిత్రి, నందిలాల్, మాలావత్ భూపతి అనే వ్యక్తులపై సిరికొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామన్నారు.
న్యాల్‌కల్‌లో ఒకరిపై దాడి
మోపాల్(నిజామాబాద్‌రూరల్): మండలంలోని న్యాల్‌కల్ గ్రామంలో సోమారపు గంగాధర్‌పై అదే గ్రామానికి చెందిన ముగ్గురు దాడి చేసి గాయపర్చిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన గంగాధర్‌కు రమణ రావు, లక్ష్మణ్, మరో వ్యక్తి ఆదివారం ఫోన్ చేసి పేకాట ఆడుదామని పిలిపించారు. అక్కడికి వెళ్లిన గంగాధర్ తాను పేకాట ఆడబోనని చెప్పడంతో తాగిన మైనంలో ముగ్గురు కలిసి దాడికి పాల్పడ్డారు. గంగాధర్‌కు తీవ్ర గాయాలు కావడంతో బాధితుడి ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
బైక్ చోరీ కేసులో నిందితుల అరెస్టు
భిక్కనూరు: బైక్ చోరీ నిందితులిద్దరిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి నాలుగు బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు భిక్కనూరు సీఐ సంపత్‌కుమార్, ఎస్సై ఆంజనేయులు మంగళవారం తెలిపారు. భిక్కనూరు టోల్‌ప్లాజా వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా కామారెడ్డిలోని రాజీవ్‌నగర్‌కు చెందిన సోదరులు షేక్ తోఫిక్, షేక్ ఆఫ్రోజ్‌లను అనుమానంతో పట్టుకుని విచారించారు. దీంతో వారు జంగంపల్లి గ్రామంలో, భిక్కనూరులో బైక్‌లను చోరీ చేసినట్టు అంగీకరించారు. అనంతరం వారి వద్ద నుంచి నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు వివరించారు.
ఐదుగురికి 14రోజుల రిమాండ్
ఖలీల్‌వాడి: పోలీసుల వాహనం అద్దాలు ధ్వంసం చేసిన కేసులో ఐదుగురు వ్యక్తులకు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించినట్లు మూడోటౌన్ ఎస్సై హరిబాబు మంగళవారం తెలిపారు. నగరంలోని శ్రద్ధానంజ్ గంజ్‌లో ఈనెల 15న సెక్యూరిటీ గార్డుపై కొందరు వ్యక్తులు దాడి చేస్తున్నారనే సమాచారం మేరకు పెట్రో కారులో పోలీసులు ఘటన స్థలానికి వెళ్లారు. ఈక్రమంలో కొంత మంది వ్యక్తులు పెట్రోకారు అద్దాలు పగలగొట్టారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి, ఐదుగురు వ్యక్తులను కోర్టు ముందు హాజరుపర్చగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఆయన తెలిపారు.
ఎస్సైని ఢీకొట్టిన కారు
ఖలీల్‌వాడి: నగరంలోని నాలుగో టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎస్సై–2 ఉదయ్‌కుమార్ మంగళవారం ఆర్‌ఆర్‌చౌరస్తా వద్ద వాహనాలు తనిఖీలు చేపట్టారు. ఈక్రమంలో ఓ కారును అపే సమయంలో ఎస్సైని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయనకు గాయాలు కాగా, వెంటనే సిబ్బంది, స్థానికులు ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. టౌన్ సీఐ శ్రీనివాస్‌రాజు, ఎస్సై శ్రీకాంత్ వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ప్రస్తుతం ఎస్సై ఆరోగ్యం కుదుటపడిందని వైద్యులు తెలిపారు.
రెండు బైకులు ఢీ: ఇద్దరికి గాయాలు
రెండు బైకులు ఢీ: ఇద్దరికి గాయాలు
Comments
Please login to add a commentAdd a comment