మొక్కలు ఎండిపోకుండా చూడాలి
గాంధారి: నర్సరీల్లోని మొక్కలు ఎండిపోకుండా షేడ్ నెట్స్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన పేట్‌సంగెం గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలోని వైకుంఠధామం, కంపోస్ట్ షెడ్, నర్సరీలను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ కంపోస్టు ఎరువులను తయారు చేయాలని ఆదేశించారు. వేసవిలో మారుమూల గ్రామాలు, తండాల్లో తాగు నీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం జెడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పదో తరగతి విద్యార్థులకు ప్రశ్నలు సంధించి వారి సామర్థ్యాలను పరీక్షించారు. అర్థం కాని విషయాలుంటే టీచర్లను అడిగి తెలుసుకోవాలని విద్యార్థులకు సూచించారు. పదో తరగతి తరువాత ఐఐఐటీల్లో చేరాలని సూచించారు. విద్యార్థులను పదో తరగతి పరీక్షలకు సన్నద్ధం చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. మధ్యాహ్న భోజనాన్ని, వంటశాలను పరిశీలించారు. నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఏజెన్సీ నిర్వాహకులను ఆదేశించారు. ఆయనవెంట డీఆర్‌డీవో సురేందర్, డీపీవో శ్రీనివాస్‌రావు, మండల ప్రత్యేకాధికారి లక్ష్మీప్రసన్న, డీఎల్పీవో సురేందర్, తహసీల్దార్ సతీష్ రెడ్డి, ఎంపీడీవో రాజేశ్వర్, ఎంపీవో లక్ష్మీనారాయణ తదితరులున్నారు.
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Comments
Please login to add a commentAdd a comment