అక్రమ వడ్డీ వ్యాపారులపై కొరడా
కామారెడ్డి క్రైం: అక్రమ వడ్డీ వ్యాపారులపై పోలీసులు కొరడా ఝుళిపించారు. బుధవారం జిల్లాలో ఏకకాలంలో 69 చోట్ల దాడులు చేసి 16 కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. జిల్లాలో ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు మోసపూరిత మాటలతో ప్రజల వ్యవసాయ భూములు, ప్లాట్లు, ఆస్తులకు సంబంధించిన దస్తావేజులు తాకట్టు పెట్టుకుంటూ అధిక వడ్డీ రేట్లకు అప్పులు ఇస్తున్నారు. డబ్బులు తిరిగి చెల్లించలేని పరిస్థితులను తీసుకువస్తూ అమాయకుల ఆస్తులను జప్తు చేసుకుంటున్నారు. ఇలాంటి బాధలతో చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ విషయం పోలీసుల దృష్టికి రావడంతో బుధవారం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్‌ల పరిధిలో దాడులు నిర్వహించామని ఎస్పీ తెలిపారు. ఈ దాడుల్లో 16 కేసులు నమోదు చేసి, విలువైన డాక్యుమెంట్‌లు స్వా ధీనం చేసుకున్నామని వెల్లడించారు. కామారెడ్డి సబ్ డివిజన్ పరిధిలో 42 దాడులు చేసి 8 కేసులు నమోదు చేశామని, ఎల్లారెడ్డి పరిధిలో 12 దాడులు చేసి 5 కేసులు, బాన్సువాడ పరిధిలో 15 చోట్ల దాడులు చేసి 3 కేసులు పెట్టామని వివరించారు. చట్ట వ్యతిరేక చర్యలకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.