‘‘పాత కరీంనగర్.. ఉద్యమాల ఖిల్లా. తెలంగాణ ఉద్యమానికి సమరశంఖం పూరించిన జిల్లా.. ఇక్కడే పార్టీ పునాదులు నిర్మితమయ్యాయి, ఇక్కడ నుంచే తెలంగాణ గళం ఢిల్లీకి వినిపించింది. రెండుసార్లు గులాబీ పార్టీ అధికారంలోకి రావడంలో కరీంనగర్ పాత్ర మరువలేనిది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 12 చొప్పున అసెంబ్లీ సీట్లు గెలుచుకున్నాం. ఈసారి 13 స్థానాలు గెలిచి చరిత్ర సృష్టించాలి. జిల్లాలో పార్టీ గ్రాఫ్ బాగుంది. అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే నెంబర్‌వన్‌గా ఉన్నాం. చేసిన పని ప్రజలకు వివరించండి. ఉద్యమస్ఫూర్తితో ముందుకుపోదాం. ఎన్నికల జైత్రయాత్ర కరీంనగర్ నుంచే మొదలుపెడదాం. అన్ని స్థానాల్లో బీఆర్‌ఎస్ జెండా ఎగరాలన్నది సీఎం అభిలాష. ఇది పెద్ద కష్టమేమీ కాదు’’
– బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారకరామారావు ఉమ్మడి జిల్లా నేతలతో హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో చేసిన దిశానిర్దేశం
సాక్షిప్రతినిధి, కరీంనగర్: అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. దాదాపుగా చివరి అసెంబ్లీ సమావేశాలు కావడంతో మంత్రి గంగుల కమలాకర్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులకు హైదరాబాద్‌లో విందు ఏర్పాటు చేశారు. కొంతకాలంగా చొప్పదండి, రామగుండం ప్రాంతాల్లో నేతలు తిరుగుబాటుకు సిద్ధమవుతున్న వేళ ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. పాత కరీంనగర్ జిల్లాకే చెందిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
పార్టీ స్థితిగతులకు సంబంధించిన పూర్తి సమాచారం తన వద్ద ఉందని... ఎప్పటికపుడు తనకు పార్టీ గ్రాఫ్‌పై నివేదికలు అందుతున్నాయని మంత్రి కేటీఆర్ వారితో అన్నట్లు సమాచారం. విశ్వసనియ సమాచారం ప్రకారం.. ఇంతకాలం ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ‘‘మూడు గంటల కరెంటు’’ వ్యాఖ్యలతో విశ్వసనీయత కోల్పోయిందని... బీసీ బంధు, గృహలక్ష్మి, మైనార్టీ బంధు, విద్యాకానుక వంటి పథకాలతో ప్రజల్లో పార్టీ గ్రాఫ్ మరింత పెరిగిందని వివరించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నచోట అందరికీ సానుకూలంగానే ఉందని ప్రశంసించినట్లు తెలిసింది. ఉత్తర తెలంగాణకు గుండెకాయ అయిన పాత కరీంనగర్ జిల్లాలో ఈసారి ఎలాగైనా 13 స్థానాలు గెలవాలని.. ఎంతమాత్రం నిర్లక్ష్యం చేయొద్దని స్పష్టం చేశారు.
నియోజకవర్గాలకు ఇన్‌చార్జీలు..
హైదరాబాద్‌లో మంగళవారం మరో కీలక సమావేశం జరిగింది. ప్రతికూల అంశాలు పార్టీ విజయావకాశాలను ఏమాత్రం ప్రభావం చూపకుండా ఉండాలని పార్టీ నిర్ణయించింది. పార్టీలో మెరుగైనగ్రాఫ్ ఉన్న నాయకులను ఇతర నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్జీలుగా నియమించారు. కరీంనగర్‌లో బలమైన అభ్యర్థిగా ఉన్న గంగుల కమలాకర్ (62శాతం గ్రాఫ్)కు అదనంగా చొప్పదండి నియోజకవర్గం అప్పగించారు.
మానకొండూరు బాధ్యతలను ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌కు ఇచ్చారు. కీలకమైన హుస్నాబాద్ అసెంబ్లీకి మంత్రి హరీశ్‌రావు ఇన్‌చార్జిగా వ్యవహరించనున్నారు. పెద్దపల్లి జిల్లాలో ముగ్గురు అభ్యర్థుల బాధ్యతలను ఎమ్మెల్సీ భానుప్రసాద్‌కు అప్పగించారు. జగిత్యాల జిల్లా బాధ్యతలను మంత్రి ఈశ్వర్, ఎమ్మెల్సీ రమణ చూస్తారని తెలిసింది.
పెద్దపల్లి జిల్లాపై స్పెషల్ ఫోకస్..
2018 అసెంబ్లీ ఎన్నికల్లో పాత జిల్లాలోని కరీంనగర్‌లో ఐదు (తర్వాతి కాలంలో హుజూరాబాద్ బీజేపీ వశమైంది), సిరిసిల్లలో రెండు, జగిత్యాలలో మూడుస్థానాలను బీఆర్‌ఎస్ క్లీన్‌స్వీప్ చేసింది. కానీ...పెద్దపల్లిలో మాత్రం సీన్ రివర్స్ అయింది. అక్కడ మూడుస్థానాలకు ఒకటే గులాబీ పార్టీ గెలుచుకుంది.
మంథనిలో శ్రీధర్‌బాబు (కాంగ్రెస్), రామగుండంలో కోరుకంటి చందర్ (ఏఐఎఫ్‌బీ)లు విజయం సాధించారు. వెంటనే కోరుకంటి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు కూడా పెద్దపల్లి జిల్లాలో మూడుస్థానాల్లో కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డిపై రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతుందన్న సమాచారంతో.. ఆ లోటును పూడ్చేందుకు ఎమ్మెల్సీ భానుప్రసాద్‌కు పార్టీ పెద్దపల్లి బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment