కరీంనగర్: వచ్చే ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే రాజకీయ పార్టీలను భాగస్వామ్యం చేసి ఓటరు జాబితా రూపొందిస్తుండగా పోలింగ్ స్టేషన్ల జియోట్యాగింగ్‌కు చర్యలు చేపట్టింది. 2018 శాసనసభ ఎన్నికల్లోనే సదరు ప్రక్రియ చేపట్టగా మళ్లీ పరిశీలన చేపట్టారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపునకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఎలాంటి ఘటనలకు తావులేకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ నెట్‌వర్క్(ఏరోనెట్) విధానంలో బోగస్ ఓట్లను ఏరివేయగా నివాస ప్రాతిపదికన ఓటు హక్కు కల్పిస్తున్నారు.
నాలుగు నియోజకవర్గాల్లో..
జిల్లాలో కరీంనగర్, చొప్పదండి, మానకొండూరు, హుజూరాబాద్ నియోజకవర్గాలుండగా వీటి పరిధిలో 20మండలాలున్నాయి. జిల్లాలో 1,338 పోలింగ్ కేంద్రాలుండగా పోలింగ్ జియోట్యాగింగ్ పరిధిలోకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే కేంద్రాల మార్పు, పేర్ల మార్పు ప్రక్రియ పూర్తయింది. కరీంనగర్ నియోజకవర్గంలో 11 కేంద్రాలను మార్పు చేయగా, 19 పోలింగ్ కేంద్రాల పేర్లు మార్పు చేశారు.
చొప్పదండి 25 పోలింగ్ కేంద్రాల మార్పు, 18 పేర్లు మార్పుచేశారు. మానకొండూర్ 6 కేంద్రాల మార్పు, ఒకటి పేరు మార్పు, హుజూరాబాద్‌లో ఒకకేంద్రాన్ని మార్పు చేయగా 6 పేర్లు మార్చారు. ఆధునిక సాంకేతికతను వాడి టీఎస్ సీవోపీ ప్రత్యేక యాప్ ద్వారా గుగూల్ మ్యాపును అనుసరించి పోలింగ్ కేంద్రం చిత్రాలు సహా ఇతర విషయాల్ని పొందుపరుస్తున్నారు.
నియోజకవర్గాల వారీగా ఓటర్ల వివరాలిల..
నియోజకవర్గాల వారీగా కేంద్రాలు
జియోట్యాగ్‌తో ప్రయోజనం..
రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు, ఎన్నికల పర్యవేక్షకులు నేరుగా గూగుల్ మ్యాప్ ఆధారంగా ఆయా కేంద్రాలకు చేరుకోవచ్చు. ఎంత సమయంలో అక్కడికి చేరుకోవచ్చు. ఆయా కేంద్రాలకు మధ్య ఉన్న దూరం తదితర విషయాల్ని ఇట్టే తెలుసుకోవచ్చు. జిల్లాకేంద్రంతో పాటు హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానంగా ఇవి ఉండటంతో పర్యవేక్షణ మరింతగా పెరగనుంది. ఏవైనా గొడవలు జరిగినా వెనువెంటనే అక్కడికి చేరుకునేందుకు సులువవనుంది.
ఏరోనెట్‌తో బోగస్‌కు చెక్..
కుటుంబం మొత్తానికి ఒకేచోట ఓటుహక్కు కల్పించేందుకు ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ నెట్వర్క్ (ఎరోనెట్) విధానాన్ని అనుసరించారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో రూపొందించిన ఈ విధానం ద్వారా ఒక వ్యక్తికి ఎక్కడెక్కడ ఓటుహక్కు ఉందో తేలనుంది. సదరు వివరాలు ఆధారంగా అధికారులు విచారణ చేసి ఎక్కడ నివాసం ఉంటారో అక్కడనే ఓటుహక్కు కల్పిస్తారు. ముసాయిదా ఓటరు జాబితాను పోలింగ్ కేంద్రాల వారీగా బూత్‌లెవల్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తప్పులులేని ఓటరు జాబితా రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ప్రక్రియ తుది దశకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment