కరీంనగర్: ‘ఎంత పని చేశావ్ నాన్న.. నాకు ఇక దిక్కెవరు అమ్మా.. నన్ను ఒంటరిని చేసి వెళ్లిపోయారా..’ అంటూ ఆ కూతురు గుండెలవిసేలా రోదించిన తీరు కంటతడి పెట్టించింది. కుటుంబ కలహాలు తల్లిదండ్రులను బలిగొనగా, వారి కూతురు అనాథగా మారింది. కరీంనగర్ టూటౌన్ పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మార్కండేయనగర్‌కాలనీకి చెందిన వేముల ప్రవీణ్(50), లావణ్య(42)కు 18 ఏళ్ల కిత్రం వివాహం జరిగింది.
వీరికి కూతురు కళ్యాణి సంతానం. ప్రవీణ్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తుండగా, లావణ్య టైలరింగ్ పనిచేసేది. వీరి కూతురు కరీంనగర్‌లోని ఓ పాఠశాలలో హాస్టల్‌లో ఉంటూ పదో తరగతి చదువుతోంది. ఇంట్లో దంపతులు ఇద్దరే ఉండేవారు. ఇంటి పై అంతస్తులో ప్రవీణ్ తల్లిదండ్రులు ఉంటున్నారు. కొన్నేళ్ల నుంచి ప్రవీణ్ దంపతులకు గొడవలు జరుగగా పెద్దలు సర్దిచెప్పారు.
శనివారం మరోసారి గొడవ తీవ్రరూపం దాల్చి ఆవేశానికి లోనైన ప్రవీణ్ భార్య తలపై సిమెంట్ ఇటుకతో బలంగా కొట్టడంతో మృతిచెందింది. ఈ క్రమంలో ఆదివారం వేకువజామున అతడు హాస్టల్‌కు వెళ్లి తన కూతురును చూసి వచ్చినట్లు తెలిసింది. అనంతరం సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్నేహితులు ప్రవీణ్‌కు పలుమార్లు ఫోన్ చేయగా, లిఫ్ట్ చేయకపోవడంతో వారు వచ్చి చూసేసరికి భార్యాభర్తలు చనిపోయి ఉన్నారు. టూటౌన్ సీఐ రాంచందర్‌రావు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
మెడికల్ కాలేజీకి ఇవ్వండి..
‘మా శవాలను మెడికల్ కాలేజీకి ఇవ్వండి. ఎలాంటి సంస్కారాలు చేయాల్సిన అవసరం లేదు. ఎవరూ ఇబ్బంది పడొద్దు. మనిషి పుట్టుక ఎంత సహజమో మరణం కూడా అంతే సహజం. కానీ విధిని బట్టి వేర్వేరు విధాలుగా వస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. స్వార్థం కోసం ఎదుటివారి మనోభావాలను దెబ్బతీయకండి. జరిగిన ఘటనకు ఎవరినీ తప్పుపట్టాల్సిన అవసరం లేదు’ అని ప్రవీణ్ తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment