TS Karimnagar Assembly Constituency: TS Election 2023: ఎవరి కుర్చీ పదిలం..!? తుదిజాబితా కోసం ఉత్కంఠ!
Sakshi News home page

TS Election 2023: ఎవరి కుర్చీ పదిలం..!? తుదిజాబితా కోసం ఉత్కంఠ!

Published Sun, Aug 20 2023 12:26 AM | Last Updated on Sun, Aug 20 2023 8:36 AM

- - Sakshi

కరీంనగర్‌: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ పార్టీలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్ల కేటాయింపు తలనొప్పిగా తయారైంది. సొంత పార్టీలో అసమ్మతి నేతలు వేర్వేరు కుంపట్లు పెట్టి సిట్టింగ్‌లకు సీట్లు ఇస్తే సహకరించేది లేదని, తమలో ఒకరికి ఇస్తే కలిసి పనిచేస్తామని అధిష్టానానికి సంకేతాలు పంపుతున్నారు. రోజుకో నియోజకవర్గంలో అసమ్మతివాదుల సంఖ్య పెరుగుతుండడం.. ఏకంగా పార్టీ కార్యాలయాలు ఓపెన్‌ చేయడం, శుభ, అశుభ కార్యక్రమాలకు వెళ్తూ ప్రజలతో మమేకమవుతుండడంతో క్షేత్రస్థాయి క్యాడర్‌ అయోమయానికి గురవుతోంది.

పార్టీ అధిష్టానం నుంచి రెండు, మూడు రోజుల్లో మొదటి విడత జాబితా వస్తుందంటూ వస్తున్న సంకేతాలతో ఉన్న సీటు ఉంటదా..? ఊడుతుందా..? అనే సందిగ్ధంలో ప్రస్తుత ఎమ్మెల్యేలు ఉన్నారు. ద్వితీయశ్రేణి నాయకులు మాత్రం టికెట్‌ తమకే అంటూ ఎవరి స్టైల్‌లో వారు నియోజకవర్గకేంద్రాలు, మండలాల్లో పర్యటిస్తున్నారు.

మరోవైపు పార్టీలో జరుగుతున్న తతంగంపై పార్టీ అధిష్టానం ఒకింత దృష్టి సారిస్తూనే అసమ్మతివాదులను బుజ్జగిస్తూ.. వివాదాలు లేకుండా చేసే ప్రయత్నంలో ఉంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సీట్ల కేటాయింపు విషయానికి వస్తే వేములవాడ, రామగుండం, మంథని, పెద్దపల్లి, చొప్పదండి తదితర నియోజకవర్గాలలో సొంత పార్టీ నుంచే తీవ్ర అసమ్మతిని ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇది సీట్ల కేటాయింపులో పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు.

జగిత్యాల జిల్లా..
► జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌కు టికెట్‌ కేటాయించే విషయంపై పార్టీలో కొంత అసమ్మతి నెలకొంది. టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేతలు ఓరుగంటి రమణారావు, పి.జితేందర్‌రావులు టికెట్‌ కోసం పార్టీ అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.
► కోరుట్ల ఎమ్మెల్యేగా ఉన్న విద్యాసాగర్‌రావు అభ్యర్థిత్వాన్ని వీలైతే మార్చి అతని కుమారుడు డాక్టర్‌ సంజయ్‌ని బరిలో దింపే అవకాశాలపై పార్టీ అధిష్టానం దృష్టి సారించింది.
► ధర్మపురి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ప్రస్తుత ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను పార్టీ అధిష్టానం తాను కోరుకుంటే తప్ప అభ్యర్థిత్వాన్ని మార్చబోదని సమాచారం. పెద్దపల్లి ఎంపీగా కొప్పుల ఈశ్వర్‌ అభ్యర్థిత్వాన్ని పార్టీ పరిశీలిస్తే ధర్మపురిలో ఎమ్మెల్యే అభ్యర్థి మారే అవకాశాలు ఉండనున్నాయి.

కరీంనగర్‌ జిల్లా..
► చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను మార్చాల్సిందేనంటూ ఆ నియోజకవర్గానికి చెందిన కొంతమంది ప్రజాప్రతినిధులు ఇటీవల కరీంనగర్‌లోని ఓ హోటల్‌లో సమావేశమై ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, మంత్రి గంగుల కమలాకర్‌ సమక్షంలోనే తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. వారి అసమ్మతిని చల్లార్చేందుకు మంత్రి గంగుల మంతనాలు జరుపుతున్నారు.

అక్కడి నుంచే టికెట్‌ ఆశిస్తున్న వారి సంఖ్య సొంత పార్టీలోనే రోజురోజుకూ పెరుగుతోంది. మాజీ ఆర్డీవో బైరం పద్మయ్య, కరీంనగర్‌ కార్పొరేటర్‌ కంసాల శ్రీనివాస్, కత్తెరపాక కొండయ్య, బండపల్లి యాదగిరి, గంట కళ్యాణిశ్రీనివాస్‌ పార్టీ అధిష్టానం వద్ద అభ్యర్థనలు పెట్టుకుని ప్రచారం చేసుకుంటున్నారు.
► మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు టికెట్‌ ఖాయమనే ప్రచారం జరుగుతున్నా మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, ఫుడ్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ ఓరుగంటి ఆనంద్‌ పార్టీ అధిస్టానం వద్ద ప్ర యత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం.
► హుజూరాబాద్‌ సీటు కేటాయింపు విషయంలో గతంలోనే జమ్మికుంటలో జరిగిన బహిరంగ సభలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో పాటు తదితరులు ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డికి టికెట్‌ ఖాయమని సంకేతాలు ఇచ్చారు. హుస్నాబాద్‌ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వొడితెల సతీష్‌బాబు సైతం హుజూరాబాద్‌ నుంచి పోటీ చేసే విషయంలో ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

హుస్నాబాద్‌ సీటును పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయిస్తే సతీష్‌బాబు హుజూరాబాద్‌కు రావడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. కానీ ఇటీవలే అక్క డి పార్టీ నేతలు పొనగంటి మల్లయ్య, తుమ్మేటి సమ్మిరెడ్డి అసమ్మతి రాగం వినిపిస్తున్నారు. అక్క డి నుంచే ఇటీవల పోటీ చేసి ఓడిపోయిన పర్యాటక సంస్థ అబివృద్ధి చైర్మన్‌ గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ సతీమణిని సైతం బరిలో దించే అవకాశాలను అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
► కరీంనగర్‌ ఎమ్మెల్యేగా ఉన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ మరోసారి టికెట్‌ దక్కించుకుని నాలుగో సారి ఎమ్మెల్యేగా గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. పార్టీలో అసమ్మతి ఏమీ లేకపోవడంతో టికెట్‌ ఖాయమనే ప్రచారం జరుగుతోంది.

పెద్దపల్లి జిల్లా..
► రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌కు టికెట్‌ ఇస్తే సహకరించేది లేదని ఏకంగా పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు ఫిర్యాదు చేయడంతోపాటు నియోజకవర్గకేంద్రంలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా అసమ్మతివాదులంతా ఏకమై పోటీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, మాజీ మేయర్‌ కొంకటి లక్ష‍్మి నారాయణ, బొగ్గుగని కార్మిక సంఘం నేత మిర్యాల రాజిరెడ్డి తదితరులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వేరుకుంపటి తయారు చేసి తమ పనిలో నిమగ్నమయ్యారు.

ఎమ్మెల్యేగా ఉన్న కోరుకంటి చందర్‌ ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడిగానూ కొనసాగుతున్నారు. తాజాగా బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్‌చార్జి కౌశిక హరిని శుక్రవారం హైదరాబాద్‌ తీసుకెళ్లి ప్రగతిభవన్‌లో పార్టీ అధిష్టానంతో మాట్లాడించడంతో హరి చేరిక ఖాయమైంది. ఈ పరిణామంతో రామగుండం రాజకీయం రసకందాయంలో పడింది. 
► మంథని నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధుకు టికెట్‌ కేటాయించవద్దని ఇటీవలే ఆ ప్రాంత మాజీ ప్రజాప్రతినిధులు నాగినేని జగన్‌మోహన్‌రావు, మైదం భారతివరప్రసాద్, బందం వసంతరెడ్డి తదితరులు తేల్చిచెప్పడంతో పార్టీ అధిష్టానం మంథనిపై ఫోకస్‌ పెట్టింది. కాటారం మాజీ జెడ్పీటీసీ చల్ల నారాయణరెడ్డి సైతం టికెట్‌ రేస్‌లో ఉన్నట్లు వినికిడి. జెడ్పీ చైర్మన్‌గా ఉన్న పుట్ట మధు మాజీ ఎమ్మెల్యే కావడం.. పార్టీలో బలమైన నాయకుడు కావడంతో టికెట్‌ ఆయనకే దక్కే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
► పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డికి మరోసారి టికెట్‌ కేటాయింపు వద్దని మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ఎల్‌.రాజయ్య నిరసన వ్యక్తం చేసి ఏకంగా పార్టీకి గుడ్‌బై చెప్పారు. వారంతా ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు. నల్ల మనోహర్‌రెడ్డి, బొద్దుల లక్ష్మణ్‌ సైతం పార్టీ అధిష్టానం వద్ద తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరినట్లు వినికిడి. నియోజకవర్గవ్యాప్తంగా ఎమ్మెల్యే తీరుపై సొంత పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా.. టికెట్‌ కేటాయింపు వ్యవహారం ఎటు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే.

సిరిసిల్ల జిల్లా..
► వేములవాడ ఎమ్మెల్యేగా ఉన్న చెన్నమనేని రమేశ్‌ అభ్యర్థిత్వం ఈసారి మార్పు తప్పదంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. పౌరసత్వ వివాదం తేలకపోవడం.. ప్రజలకు అందుబాటులో ఉండరనే ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్‌ పార్టీ నుంచి గతంలో బీఆర్‌ఎస్‌లో చేరిన చల్మెడ లక్ష్మీనరసింహారావుకు టికెట్‌ కేటాయింపు ఉంటుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.

ఈ మేరకు పార్టీ అధిష్టానం సూచనతోనే ఎన్నికల కార్యాలయం ఓపెన్‌ చేసి ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఆ ప్రాంతానికి చెందిన ఏనుగు మనోహర్‌రెడ్డి, ఎన్‌ఆర్‌ఐ డాక్టర్‌ గోలి మోహన్‌ కూడా పార్టీ అధిష్టానం వద్ద తన పేరు పరిశీలించాలని కోరుతున్నట్లు సమాచారం.
► సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్న పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు టికెట్‌ ఖాయం. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పేరిట జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తూ మరోసారి విజయఢంకా మోగించేందుకు తనదైన శైలిలో ప్రచారపర్వంలో దూసుకుపోతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement