ముందే తెలుసుకోవచ్చు
పలు యాప్‌లను తీసుకువచ్చిన కేంద్రం
వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం
రైతులకు ఉపయుక్తం
కరీంనగర్ అర్బన్: పిడుగులు, వర్షాలే ప్రధానంగా రైతులకు తీరని నష్టం కలిగిస్తాయి. ఎప్పుడు ఎక్కడ పిడుగులు పడతాయో.. ఎప్పుడు వర్షం కురుస్తుందో తెలియని పరిస్థితి. వీటివల్ల మనుషులు, మూగజీవాలు మరణించిన ఘటనలు అనేకం. గతంలో ఇల్లందకుంట మండలంలోని సీతంపేట గ్రామానికి చెందిన గొర్రెల కాపరి బక్కతట్ల రాజయ్య పిడుగుపాటుకు గురై, మృతిచెందాడు. ఏటా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అన్నదాతలకు అండగా నిలిచేందుకు కేంద్రం పలు యాప్‌లను భారత వాతావరణ శాఖ ద్వారా తీసుకువచ్చింది. ఇంటర్‌నెట్ ద్వారా వాటిని డౌన్‌లోడ్ చేసుకుంటే పిడుగు, వర్షం ఎప్పుడు పడుతుందో ఇట్టే తెలిసిపోతుంది. తదనుగుణంగా రైతన్న వ్యవహరిస్తే చాలు. యాప్‌లతో మరో ఐదు రోజుల వరకు వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసుకునే వీలు కల్పించింది.
రెయిన్ అలారం..
గూగుల్ ప్లే స్టోర్ నుంచి రెయిన్ అలారం అని ఇంగ్లిష్‌లో టైప్ చేస్తే ఈ యాప్ కనిపిస్తుంది. కేవలం ఒక నిమిషంలో డౌన్‌లోడ్ అవుతుంది. వినియోగదారుడు అందించిన వివరాల మేరకు అతను ఉన్న ప్రాంతానికి సమీపంలోని 20 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ వర్షం పడే సూచనలున్నాయో సమగ్ర సమాచారం క్షణాల మీద అందిస్తుంది. దీంతో వర్షం ముప్పు తెలుసుకొని, ముందే జాగ్రత్తపడే అవకాశం ఉంటుంది.
దామినీ యాప్..
సాధారణంగా వర్షాకాలంతోపాటు ఏప్రిల్, మే నెలల్లో పిడుగులు పడటం సహజం. వ్యవసాయ పనుల హడావుడిలో ఉండే రైతులు పిడుగు పడే సమయంలో దగ్గరలోని ఎత్తయిన చెట్ల కిందకో, మరోచోటుకో వెళ్తుంటారు. అవి అంత సురక్షితం కావని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో రైతులను అప్రమత్తం చేసేదే దామినీ యాప్. దీన్ని కూడా గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇది సమీపంలోని 20 కిలోమీటర్ల దూరంలో 5 నుంచి 20 నిమిషాల్లో ఎక్కడ పిడుగు పడుతుందో అప్రమత్తం చేస్తుంది. దీనివల్ల సురక్షిత ప్రాంతాలకు వెళ్లొచ్చు.
మేఘదూత్ యాప్..
పంట చేలకు ఎరువులు అందించాల్సిన సమయంలో లేదా వరి కోతల సందర్భంలో రైతులకు నష్టం చేసేవి వర్షాలే. దాన్ని తప్పించేందుకు భారత వాతావరణ శాఖ మేఘదూత్ యాప్‌కు రూపకల్పన చేసింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుంటే తాజా సమాచారాన్ని అందిస్తుంది. రాబోయే 5 రోజుల్లో వాతావరణ మార్పులు, వర్ష సూచనలు సహా ఆకాశం మేఘావృతమవుతుందా లేదా గాలులు ఏ మేరకు ఎక్కడి నుంచి ఎక్కడకు ఏ దిఽశగా వీస్తాయో తెలుపుతుంది.
విడివిడిగా డౌన్‌లోడ్ చేసుకోవాలి..
ప్లే స్టోర్ నుంచి మూడు యాప్‌లను విడివిడిగా డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రతీ యాప్‌కు వినియోగదారుడి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే సరైన సమాచారాన్ని సకాలంలో అందిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment