పొత్తిళ్లలోని పిల్లలనూ వదలని కామాంధులు
వికృత చేష్టలతో చిదిమేస్తున్న వైనం
సుల్తానాబాద్ ఘటనతో ఉలిక్కిపడిన ఉమ్మడి జిల్లా
ఇటుక, రైస్‌మిల్లులు, భవన నిర్మాణ రంగంలో వలస కార్మికులే ఎక్కువ
విచ్చలవిడిగా గంజాయి, మద్యం వినియోగం
తరచూ ఇలాంటి సంఘటనలు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: నాకు ఆరేళ్లు.. అమ్మానాన్న ప్రేమగా చూసుకునేవారు. ఏడు నెలల చెల్లితో బాగా ఆడుకునేదాన్ని. సంతోషంగా గడుస్తున్న జీవితంలో ఒక్కసారిగా ఇలా.. ఎవరికి ఏం కీడు చేశాను? ఇంకా ఎంత మంది చిన్నారులు బలికావాలి? ఏ అమ్మాయికి ఇలాంటి అఘాయిత్యం జరగకుండా చూడండి. ఏం చేస్తే బాగుంటుందో.. ఆలోచించండి. బాలికలను కాపాడండి. నాలాంటి బాధితులు సమాజంలో ఎందరో ఉన్నారు. మీకు తెలిసింది కొందరే. కొన్ని రోజులు బాధపడి వదిలేసే విషయం కాదు. నా వయసు చూడండి.. నాకేం తెలుసని ఇలా చేశారు? నా బాల్యాన్ని ఎందుకు దూరం చేశారు? మీ కూతురిలా.. చెల్లిలా.. కనిపించడం లేదా? సీ్త్రని దేవతగా పూజించే ఈ దేశంలో ఇంత దారుణ పరిస్థితులా? నిర్భయ.. దిశ.. వరంగల్ చిన్నారి.. ఇప్పుడు నేను.. దీనికి ముగింపు ఎప్పుడో? – ‘హత్యా’చారానికి గురైన చిన్నారి ఆత్మఘోష
అప్పటివరకు అమ్మానాన్న ఒడిలో ఆడుకుంటున్న పిల్లలు అకస్మాత్తుగా మాయమై, విగతజీవులుగా మారితే.. అదిచూసిన కన్నోళ్ల పరిస్థితి ఏమిటి? ఆకాశంలో గద్దలు అకస్మాతుగా నేల మీదకు వచ్చి కోడిపిల్లలను తన్నుకుపోయినట్లుగా పొత్తిళ్లలో, తల్లి ఒడిలో నిద్రపోతున్న పసిపిల్లలను ఎత్తకుపోతున్నారు. మద్యం, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలకు అలవాటుపడినవారు సమాజానికి ము ప్పుగా, పిల్లల పాలిట యమకింకరులుగా త యారయ్యారు.
తాజాగా పెద్దపల్లి జిల్లా సుల్తానా బాద్ మండలంలోని కాట్నపల్లిలో గురువారం రాత్రి జరి గిన ఆరేళ్ల చిన్నారి అపహరణ, అత్యాచారం, ఆపై హత్య ఘటన భయానకవాతావరణం సృష్టించింది. ముక్కుపచ్చలారని చిన్నారిని మానవ మృగం చిదిమేసిన తీరుపై స్థానికులు భగ్గుమన్నారు. బడికి వెళ్లిన పిల్లలు క్షేమంగా ఇంటికి వస్తారన్న నమ్మకం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
‘వలస’ బతుకులు అగమ్యగోచరం
వలస కార్మికుల బతుకులు అగమ్యగోచరంగా మారాయి. పనికి తగ్గ వేతనం, పని ప్రదేశాల్లో కనీస వసతులు మృగ్యమయ్యాయి. దీనికితోడు ఎప్పుడు ఎవరి నుంచి ఆపద ముంచుకొస్తుందోనన్న భయం వెంటాడుతోంది. వలస కార్మికులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎంతమంది ఉన్నారు.. వారి భద్రతకు యాజమాన్యాలు తీసుకుంటున్న చర్యలేంటి.. పని ప్రదేశాల్లో వసతుల కల్పనపై పట్టించుకునేవారు కరువయ్యారు.
ఏ అండ లేకపోవడంతో లైగింక వేధింపులకు గురవుతున్నారు. కొన్ని సందర్భాల్లోనే కేసులు నమోదవుతుండగా, చాలావరకు పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కకుండానే వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని, సెటిల్ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. తాజాగా కాట్నపల్లి రైస్‌మిల్లులో పని చేయడానికి వచ్చిన కుటుంబాలకు వేర్వేరుగా వసతి గదులు, వాటికి తలుపులు లేకపోవడం వల్లే సంఘటన జరిగిందన్న చర్చ జరుగుతోంది.
మద్యం, గంజాయి మత్తులో..
మహిళలు, యువతులు, చిన్నారులపై వేధింపులు, అత్యాచార ఘటనలు ఎక్కువ శాతం మద్యం, గంజాయి మత్తులోనే చోటుచేసుకుంటున్నట్లు నేరాల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఏ గ్రామంలో చూసినా 24 గంటలు బెల్టుషాపుల్లో మద్యం లభిస్తుండంతోపాటు వలస కార్మికులు ఉన్న ప్రదేశాల్లో కొన్ని ముఠాలు గంజాయిని విచ్చలవిడిగా విక్రయిస్తున్నాయి.
గుడ్ టచ్, బ్యాడ్ టచ్ తెలియాలి..
పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఏంటో తెలియాలి. దీనిపై ప్రతీ పాఠశాలలో అవగాహన కల్పిస్తున్నారు. బాలికలతో ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు అనే విషయమై తల్లిదండ్రులు ఆరా తీస్తుండాలి. చుట్టుపక్కల ఉండేవారిపై ఓ కన్నేసి ఉంచాలి. లైంగిక దాడులు చిన్నారులపై దీర్ఘకాలిక మానసిక దుష్ప్రభావాలు చూపుతాయి. ఇలాంటి పని చేసినవారు వయసులో పెద్దవారు, బంధువు అని చూడకూడదు. ఒకవేళ వదిలేస్తే వారికి అడ్డూఅదుపు లేకుండా పోతుంది.
పెద్దపల్లి జిల్లాలో 10 వేల మంది కార్మికులు..
కార్మిక శాఖ లెక్కల ప్రకారం పెద్దపల్లి జిల్లాలో 10 వేల మంది వలస కార్మికులు ఉన్నారు. వీరిలో భవన నిర్మాణ కార్మికులు 6 వేల మంది వరకు, రైస్‌మిల్లుల్లో 2,500 మంది, ఇటుక బట్టీల్లో 1,500 మంది పని చేస్తున్నారు. యజమానులు దళారుల ద్వారా ఆయా రాష్ట్రాల వలస కూలీలకు అడ్వాన్స్ చెల్లించి, పనికి తీసుకువస్తున్నారు. డబ్బులకు ఆశపడి వచ్చిన కార్మికులు ఇక్కడి వాతావరణంలో పని చేయలేక, పని ఒత్తిడి, లైగింక వేధింపులతో ఇబ్బంది పడుతున్నారు.
పక్కలో నుంచి ఎత్తుకుపోయి సంపిండు..
మేము నెల కింద పని కోసం మిల్లుకు వచ్చాం. ఎప్పటిలాగే మా ఇద్దరు బిడ్డలతో కలిసి రేకుల కింద పడుకున్నం. వర్షం పడుతుండటంతో లోపలికి తీసుకుపోయిన. కరెంట్ పోవడంతో ఉక్కపోస్తోందని బయటకు వచ్చాం. పిల్లలను పడుకోబెట్టిన. రాత్రి 11 గంటలకు చూస్తే పాప కనబడలేదు. పక్కలో నుంచి ఎత్తుకపోయి సంపిండు. వాడిని విడిచిపెట్టొద్దు. – మృతురాలి తల్లి ఆవేదన
పరిచయస్తులే నిందితులు..
పోక్సో కేసులకు సంబంధించి బాధితుల్లో చాలామంది తమకు పరిచయస్తులు, బంధువుల చేతిలోనే లైంగికదాడులకు గురవుతున్నారు. కుటుంబ పరువు మంటగలుస్తుందని వారు బయటకు రావడం లేదు. ఇదే సమయంలో పరిచయం లేనివారు కూడా ఎక్కడినుంచో వచ్చి, అఘాయిత్యాలకు పాల్పడుతూ ప్రాణాలు తీసి, కన్నవారికి కడుపుకోత మిగులుస్తున్నారు. కాట్నపల్లి ఘటన నిందితుడు మృతురాలి తల్లిదండ్రులు పనిచేసే చోటే పని చేస్తుండటం గమనార్హం.
గతంలో జరిగిన కొన్ని సంఘటనలు..
2019లో ఎలిగేడు మండలం శివపల్లి పరిసరాల్లోని రైస్‌మిల్లులో వలస మహిళా కూలీపై అత్యాచారం జరిగింది.
2021 నవంబర్‌లో పెద్దపల్లిలోని రంగాపూర్ ఇటుక బట్టీల్లో వలస కూలీపై అత్యాచారం చేయగా, ఇద్దరు నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు.
2023 ఆగస్టులో అప్పన్నపేట వద్ద భవన నిర్మాణ పనులు చేసేందుకు వచ్చిన బాలిక రక్తస్రావంతో మృతిచెందింది. మొదట్లో సామూహిక అత్యాచారం చేశారని ప్రచారం జరిగింది. తర్వాత, క్రిమిసంహారక మందు తాగి, ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తేల్చారు.
ఉమ్మడి జిల్లాలో పోక్సో కేసులు..
కరీంనగర్ జిల్లాలో 2022లో 68, 2023లో 58, 2024లో 27 పోక్సో కేసులు నమోదయ్యాయి. రాజన్న సిరిసిల్లలో 2022లో 62, 2023లో 42, 2024లో 18, జగిత్యాల జిల్లాలో 2022లో 59, 2023లో 84, 2024లో 48, పెద్దపల్లి జిల్లాలో 2022లో 29, 2023లో 20, 2024లో 01 పోక్సో కేసులు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment