రంగంలోకి నార్కోటిక్ బ్యూరో
వ్యసనపరుల గుర్తింపు ముమ్మరం
ప్రతీ మెడికల్ కాలేజీలో డి అడిక్షన్ సెంటర్
ఒక్కో కేంద్రంలో పది పడకల కేటాయింపు
ఆరంభ స్థాయికి ఇక్కడే వైద్యం .. ముదిరితే రాజధానికి
కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, రామగుండంలో సేవలు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: మత్తు ఒక వ్యసనం. అది ఏ రూపంలోనైనా ఉండొచ్చు. గంజాయి, మద్యం, కల్తీకల్లు, హషీశ్, వైట్‌నర్ లాంటి ద్రావణాలు మత్తు కలిగిస్తూ మనుషుల విక్షణ హరించివేస్తున్నాయి. వీటికి బానిసైన వారు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. విచక్షణ కోల్పోయి నేరాలకు పాల్పడుతున్నారు. జనారణ్యంలో తిరిగే మానవ బాంబుల్లా తయారవుతున్నారు. అంతేకాదు.. డబ్బు కోసం కుటుంబ సభ్యులను పీడించడం, వేధించడం.. చివరకు చంపడానికి కూడా వెనుకాడడం లేదు. అందుకే, ఇలాంటి వారిని గుర్తించి వీలైనంత వరకు మార్పు తెచ్చేలా రాష్ట్ర యాంటీ నార్కోటిక్ బ్యూరో(టీజీ ఏఎన్‌బీ) నడుం బిగించింది. అందుకే, మత్తుకు బానిసైన వారిని గుర్తించి చికిత్స అందించే దిశగా ఏర్పాట్లు చేసింది. ఇందు కోసం ప్రతీప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఒక డి–అడిక్షన్ సెంటర్ ఏర్టాఉ చేసింది. చికిత్స చేసేందుకు 10 బెడ్లు సిద్ధం చేసింది.
ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారంటే..
మత్తుకు బానిసైన వారిలో పరివర్తన తెచ్చేలా వైద్య చికిత్స అందించేందుకు డి–అడిక్షన్ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందుకోసం ప్రతీప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రత్యేక విభాగం, పదేసి పడకలు సిద్ధం చేసింది. కరీంనగర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, జగిత్యాల గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, గోదావరిఖని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, రాజన్న సిరిసిల్లలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌లో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చింది. వాస్తవానికి ఈ ఏర్పాట్లు గతేడాది సెప్టెంబరులోనే మొదలయ్యాయి. కానీ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక డ్రగ్స్ మహమ్మారిని తరిమేయాలన్న లక్ష్యంతో వ్యసనపరులను గుర్తించి చికిత్స అందించాలని నిర్ణయించింది. తద్వారా వ్యసనపరుల సంఖ్యను వీలైనంతగా తగ్గించాలని లక్ష్యంగా నిర్దేశించింది.
గ్రామస్థాయి నుంచి గుర్తింపు..
మత్తుకు బానిసైన వారికి తప్పకుండా వైద్య చికిత్స అందించాలని గత జూన్ 6న అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. వీరితోపాటు పోలీసులు కూడా క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇందుకోసం సినిమా హాళ్లతోపాటు, స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లోనూ డ్రగ్స్‌పై ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. గంజాయి వినియోగం పట్టణాల నుంచి గ్రామస్థాయికి పాకింది. అందుకే, వ్యసనపరులను గుర్తించేందుకు ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, పీహెచ్‌సీ, మెప్మా సిబ్బంది, అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్లు(ఏఈవో), పంచాయతీ సిబ్బంది, అధికారులు, వార్డు సభ్యులను ఇందులో భాగస్వాములను చేస్తోంది. పాఠశాలల సిబ్బంది, విద్యార్థి నాయకులు, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు కూడా వ్యసనపరులను గుర్తించి మెడికల్ కాలేజీలకు తీసుకువెళ్తారు. మత్తుకు బానిసైన వారికి అక్కడ మానసికంగా కౌన్సెలింగ్ ఇస్తారు. వైద్య చికిత్స చేస్తారు. వ్యసనం బాగా ముదిరిన కేసులను హైదరాబాద్‌కు తరలిస్తారు.
వ్యసనపరులకు వైద్యం..
మత్తు పదార్థాలకు బానిసలైన వారికి వైద్యచికిత్స అందించేందుకు ప్రభుత్వం ఒక్కో మెడికల్ కాలేజీలో పది పడకలు కేటాయించింది. గంజాయికి బానిసలైన వారిని గుర్తించి ఆస్పత్రికి తీసుకొస్తే సైకియాట్రిస్ట్‌తో చికిత్స చేయిస్తారు. మందులు అందజేస్తారు. వ్యసనపరులు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇప్పిస్తారు. మానసిక సమస్యలు అధికంగా ఉంటే హైదరాబాద్‌కు రెఫర్ చేస్తారు. – డాక్టర్ వీరారెడ్డి, సూపరింటెండెంట్, జీజీహెచ్, కరీంనగర్
Comments
Please login to add a commentAdd a comment