
మూతపడుతున్న సొసైటీ ‘బంక్’లు
● రిటైల్ బంక్‌లతో పోటీ పడలేక చతికిల
● కొనుగోలు, అమ్మకం ధరల్లో వ్యత్యాసం
● భారీ నష్టాలు మూటగట్టుకుంటున్న వైనం
జగిత్యాలఅగ్రికల్చర్: ప్రాథమిక సహకార
సంఘాల ఆధ్వర్యంలో నడుస్తున్న డీజిల్, పెట్రోల్ బంక్‌లు ఆయా ఆయిల్ కంపెనీల రిటైల్ బంక్‌లతో పోటీ పడలేకపోతున్నాయి. సొసైటీ బంక్‌ల్లో సరైన నిర్వహణ లేక, నష్టాలబాట
పడుతున్నాయి. రకరకాల కారణాలతో
కొన్ని సొసైటీ బంక్‌లు మూతపడుతున్నాయి.
దీంతో, సహకార బంక్‌లన్నింటినీ రిటేల్ బంక్
విధానంలోకి మార్చుతున్నారు.
● సొసైటీల పరిధిలో 9 బంక్‌లు
జగిత్యాల జిల్లాలో 51 సొసైటీలు ఉండగా, అందులో 9 సొసైటీలు బంక్‌లను నిర్వహిస్తున్నాయి. రాయికల్, బీర్‌పూర్, నంచర్ల, యామాపూర్, సిర్‌పూర్, జగిత్యాల, భూషణ్‌రావుపేట, జైనా, పైడిమడుగు గ్రామాల్లో సొసైటీల ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్ బంక్‌లు ఏర్పాటు చేశారు. వీటి పరిధిలో సగటున ఏడాదికి 10.55 లక్షల లీటర్ల పెట్రోల్, 21.64 లక్షల లీటర్ల డీజిల్ అమ్మకాలు సాగించాయి. అయితే, జగిత్యాల, యామాపూర్ పెట్రోల్ బంక్‌లు మూతపడగా, పైడిమడుగు బంక్ ఇంకా ప్రారంభం కాలేదు. మిగతా ఆరు బంక్‌లు లాభ, నష్టాల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి.
● రెండురకాలుగా అమ్మకాలు
కేంద్ర ప్రభుత్వం రెండురకాలుగా పెట్రోల్, డీజిల్ అమ్మకాలు చేస్తుంది. రిటైల్ పంప్స్ పద్ధతిలో.. హెచ్‌పీ, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ చమురు సంస్థలు తమ ఏజెన్సీల ద్వారా పెట్రోల్, డీజిల్ విక్రయిస్తుంటాయి. కన్సూమర్ పద్ధతిలో.. ప్రాథమిక సహకార సంఘాలు, జైళ్లు, పోలీస్ శాఖ నిర్వహించే బంక్‌లు, పరస్పర సహకార సంఘంగా ఏర్పడి నిర్వహించే బంక్‌లు పెట్రోల్, డీజిల్ విక్రయిస్తుంటాయి. అయితే, కేంద్ర ప్రభుత్వం పరిధిలోని ఆయిల్ కంపెనీలు కన్సూమర్ బంకులకు టాక్స్ మినహాయించుకుని గతంలో కొంత తక్కువ ధరకు పెట్రోల్, డీజిల్ విక్రయించేవి. దీంతో సొసైటీ పరిధిలోని కన్సూమర్ బంకులు రూపాయి, అర్థ రూపాయి లాభం చూసుకుని, రిటైల్ పెట్రోల్ బంక్‌ల కంటే తక్కువ ధరకు పెట్రోల్, డీజిల్ అందించి సామాన్య ప్రజల మన్ననలు పొందేవి.
● కన్సూమర్ నుంచి రిటేల్ వైపు..
ఆయిల్ కంపెనీల నూతన విధానంతో డీజిల్, పెట్రోల్ కొనుగోలు, అమ్మకం ధరల మధ్య భారీ వ్యత్యాసం మొదలైంది. సెప్టెంబర్ 30, 2021కు ముందు కొనుగోలు రేటు, అమ్మకం రేటు మధ్య వ్యత్యాసం రూ.1–2 మాత్రమే ఉండేది. దీంతో సొసైటీలకు కొంత లాభం వచ్చేది. రిటైల్ బంక్‌లో ఏజెన్సీలకు కమీషన్ ఇస్తారు కానీ కన్సూమర్ బంకుల్లో కమీషన్ ఉండదు. కేవలం కొనుగోలు, అమ్మకం మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని మాత్రమే లాభంగా తీసుకుంటారు. దీంతో రిటైల్ బంక్‌ల కంటే అర్ధ రూపాయి, రూపాయి తక్కువ ధరకు సొసైటీ బంక్‌లో పెట్రోల్, డీజిల్ పోయించుకునేవారు. ఇప్పుడు, రేటు వ్యత్యాసం ఎక్కువగా ఉండటం, కమీషన్ రాకపోవడం వంటి కారణాలతో కన్సూమర్ పద్ధతిలో ఉన్న సొసైటీ బంక్‌లన్నీ రిటేల్ బంక్‌లవైపు దృష్టి పెట్టాయి. ఇప్పుడు అన్ని బంక్‌ల్లోనూ రేటు ఒకేలా ఉండటంతో జనాలు సొసైటీ బంక్‌లవైపు మళ్లడం లేదు. దీంతో, బంక్‌ల నిర్వహణ కష్టసాధ్యంగా మారింది.
● రూ.కోట్లలో పెట్టుబడి
డీజిల్, పెట్రోల్ బంక్‌ల ఏర్పాటుకు ఒక్కో సొసైటీ రూ.కోట్లలో పెట్టుబడి పెడుతుంది. స్థలం కొనుగోలు చేయడానికే కనీసం రూ.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. బంక్ సిబ్బంది జీతాలు, కరెంట్ బిల్లులు, నిర్వహణకే నెలకు కనీసం రూ.35 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. వీటివల్ల ఏదో లాభం వస్తుందనుకుంటే, నష్టాల పాలవడాన్ని సంఘ సీఈవోలు, చైర్మన్‌లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో డీజిల్ రేట్ల ధరల వ్యత్యాసంతో ఇప్పటికే ఒక్కో సొసైటీ రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల నష్టాలను మూటగట్టుకుంది.
నష్టపోకుండా ఉండేందుకే..
సొసైటీ బంక్ ద్వారా నష్టపోవాల్సి వస్తుంది. ధరల్లో వ్యత్యాసంతో కొద్ది నెలలుగా మా సొసైటీ పరిధిలోని డీజిల్ బంక్‌ను మూసేశాం. ఇప్పటివరకు కన్సూమర్ పద్ధతిలో ఉన్న బంక్‌ను రిటేల్ వైపు మార్చుతున్నాం. నేషనల్ హైవే రోడ్డు సమస్యతో కూడా తెరవడం ఇబ్బందిగా మారింది.
– పత్తిరెడ్డి మహిపాల్‌రెడ్డి,
సంఘం చైర్మన్, జగిత్యాల
చమురు సంస్థల నిబంధనలతో..
చమురు సంస్థలు మార్చిన నిబంధనలతో భారీ వ్యత్యాసం వల్ల బంక్‌లు ఏర్పాటు చేసిన సొసైటీలు నష్టపోవాల్సి వస్తుంది. ఎక్కువ ధరకు డీజల్, పెట్రోల్ కొని తక్కువ ధరకు సరఫరా చేయడం సాధ్యం కాదు. కాబట్టి సొసైటీ పరిధిలోని బంక్‌లన్నీ రిటేల్ వైపు మళ్లుతున్నాయి.
– సీహెచ్.మనోజ్‌కుమార్,
జిల్లా సహకార అధికారి, జగిత్యాల

మూతపడుతున్న సొసైటీ ‘బంక్’లు

మూతపడుతున్న సొసైటీ ‘బంక్’లు
Comments
Please login to add a commentAdd a comment