నాణ్యమైన విద్యకు కేరాఫ్ ‘కేవీ’
జ్యోతినగర్(రామగుండం): దేశ వ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాలు ఒకటో తరగతి నుంచే క్రియేటివ్ లెర్నింగ్‌కు ప్రాధాన్యమిస్తూ విద్యార్థులకు బోధన సాగిస్తున్నాయి. వినూత్న బోధన అందిస్తున్న కేంద్రీయ విద్యాలయాల్లో 2025–26 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు నోటిషికేషన్ విడుదలైంది. ఒకటో తరగతిలో ప్రవేశం పొందితే ఇంటర్మీడియెట్ వరకు విద్యను అభ్యసించవచ్చు. ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యతో పాటు ఫీజుల భారం ఉండదు. మొదట్లో కేవలం ఆర్మీ పిల్లలకు మాత్రమే అవకాశం ఉండేది. తర్వాత ఐదు కేటగిరీలుగా విభజించి ప్రవేశాలు కల్పిస్తున్నారు.
దరఖాస్తు విధానం
2025–26 విద్యా సంవత్సరానికిగానూ ఒకటో తరగతి ప్రవేశాలకు ఈనెల 7 నుంచి 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 31 నాటికి 6 నుంచి 8 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పిల్లలు అర్హులు. జనన, కుల ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి. దరఖాస్తులు పరిశీలించి లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తారు. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు లాటరి పద్ధతిలో సీట్ల కేటాయింపు ఉంటుంది. విద్యార్థుల ఎంపికకు సంబంధించి తొలి జాబితా ఈనెల 25న, రెండో జాబితా ఏప్రిల్ 2, మూడో జాబితా అదే నెల 7న ప్రదర్శించి ప్రక్రియ పూర్తి చేస్తారు.
ప్రాధాన్యత అంశాలు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, మాజీ సైనిక ఉద్యోగుల పిల్లలకు తొలి ప్రాధాన్యం ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థల ఉద్యోగుల పిల్లలకు ద్వితీయ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు తృతీయ, రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థల చిన్నారులకు నాలుగో ప్రాధాన్యత. విద్యా హక్కు చట్టం(ఆర్టీఐ)కింద 10 సీట్లు ఉంటాయి. ఇందుకు పాఠశాలకు ఐదు కిలోమీటర్ల పరిధిలోని వారు మాత్రమే అర్హులు.దరఖాస్తులో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రాధాన్య అంశాలను తప్పనిసరిగా పాటించాలి. నాలుగు కేటగిరీల్లో దరఖాస్తులు చేసేవారికి ఆయా ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి. ఆర్టీ కోటాలో సీటు పొందినప్పటికీ కేటగిరీని తప్పుగా ఎంచుకుంటే సీటు రాదు. సాధారణ ప్రజలు దరఖాస్తు చేసే క్రమంలో ఐదో కేటగిరీని ఎంచుకోవడం ఉత్తమం.
ఎంపిక విధానం
దరఖాస్తులను ఆన్‌లైన్‌లో పరిశీలించి విద్యాలయ సంఘటన్ ఎంపిక జాబితాను విద్యాలయాలకు పంపుతుంది. దీనిని సంబంధిత వెబ్‌సైట్‌లో ప్రదర్శిస్తారు. జాబితాలో ఉన్నవారు మాత్రమే ఒరిజినల్ ధ్రువీకరణ ప్రతాలతో విద్యాలయాల్లో సంప్రదించాలి.ఎన్టీపీసీ రామగుండం పీటీఎస్ కేవీలో ఒకటో తరగతికి 80 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
2025–26 విద్యాసంవత్సరం ప్రవేశాలకు ప్రక్రియ ప్రారంభం
నేటి నుంచి 21 వరకు దరఖాస్తులు
Comments
Please login to add a commentAdd a comment