మహిళలు..
మనీరాణులు!
● మండల మహిళా సమాఖ్యలకు 47 బస్సులు ● బస్సుల కొనుగోలుకు రూ.14.10 కోట్లు మంజూరు ● ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా జగిత్యాలకే 15 వాహనాలు ● ఏడేళ్లపాటు సమాఖ్యలకు ప్రతీనెల రూ.77వేలు చెల్లించనున్న ఆర్టీసీ ● ఈ ఆదాయంతో సోలార్ ప్లాంట్లు, ఇతర ప్రత్యామ్నాయ వ్యాపారాలు ● ప్రభుత్వ నిర్ణయంతో ఆత్మవిశ్వాసం పెరిగిందంటున్న మహిళలు
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
మహిళలు.. మహారాణులు.. అన్నమాట అక్షరాల నిజం కానుంది. అతివలను కోటీశ్వరులను చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంలో మరో ముందుడుగు పడింది. ప్రభుత్వం ప్రోత్సహిస్తే.. మరింతగా ఎదుగుతామని ధీమాగా ఉన్నారు. ప్రభుత్వం అందజేసిన ఆర్టీసీ బస్సుల ద్వారా సమకూరే ఆదాయంతో మరిన్ని కొత్త స్టార్టప్‌లు, వ్యాపారాలు మొదలుపెడతామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 20కి పైగా మండల మహిళా సమాఖ్యలకు బస్సులను అందజేసింది. ఇందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినవే ఐదు సమాఖ్యలు ఉండటం గమనార్హం. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం శ్రీ చైతన్య సమాఖ్య, కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఉదయలక్ష్మి సమాఖ్య, సైదాపూర్ మండలం సంతోషిమాత సమాఖ్య, పెద్దపల్లి జిల్లా ముత్తారానికి చెందిన రుద్రమ సమాఖ్య, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన అభ్యుదయ సమాఖ్యలు తొలివిడతలో బస్సులు పొందాయి.
ఉమ్మడి జిల్లాకు 47 బస్సులు..
వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా 150 మండల మహిళాసమాఖ్యలకు ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు ఇచ్చేందుకు ఎంపిక చేసింది. అందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు 47 బస్సులు కేటాయించింది. పెద్దపల్లి జిల్లాలో 9, రాజన్న సిరిసిల్లలో 9, కరీంనగర్ 14, జగిత్యాల 15 సమాఖ్యలు ఉన్నాయి. నేషనల్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్ (ఎన్.ఆర్.ఎల్.ఎం) పథకంలో భాగంగా కేంద్రం మహిళా సమాఖ్యలకు ఆర్థిక సాయం చేయనుంది. ఈ మేరకు రూ.30 లక్షలు ఈపథకం ద్వారా, మహిళా సమాఖ్య నిధుల నుంచి మరో రూ.6 లక్షలు కలిపి మొత్తం రూ.36 లక్షలు వెచ్చించి ఆర్టీసీ (పల్లె వెలుగు) బస్సులు కొంటారు. 47 బస్సులకు కలిపి రూ.14.10 కోట్ల వరకు నిధులను ప్రభుత్వం మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ బస్సుల ఆర్సీ బుక్‌లో మహిళా సమాఖ్య పేరు మీదే రిజిస్ట్రేషన్ చూపిస్తారు. సమాఖ్యలతో జరిగిన ఒప్పంద మేరకు నిర్వహణ అంతా ఆర్టీసీ చూసుకుంటుంది. ఏడేళ్లపాటు నెలనెలా రూ. 77,220 చొప్పున మొత్తం రూ.64 లక్షలవరకు ఆయా సమాఖ్యలకు ఆర్టీసీ చెల్లిస్తుంది. ఇది ఇటు ఆర్టీసీకి, అటు మహిళా సమాఖ్యలకు లాభదాయకంగా ఉండనుంది.
Comments
Please login to add a commentAdd a comment