జగిత్యాల: భూ నిర్వాసితుల నష్ట పరిహారానికి సంబంధించి వడ్డీకి టీడీఎస్ (ట్యాక్స్ డిడెక్టెడ్ ఎట్ సోర్స్) కట్ అవుతుంది. ఈ విషయంలో ఓ ప్రైవేటు ప్రాక్టీషనర్ ద్వారా ఆర్డీవో కార్యాలయం అధికారులు అవకతవకలకు పాల్పడినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి వచ్చిన ఐటీ అధికారులు జిల్లాకేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో గురువారం విచారణ చేపట్టారు. జిల్లామీదుగా వెళ్లే రైల్వేలైన్ కోసం భూసేకరణ చేపట్టారు. 2006లో సుమారు 300 మంది రైతులు భూమి కోల్పోయారు. వారికి పరిహారం కింద ప్రభుత్వం కొంతమేర చెల్లించింది. పరిహారం తక్కువగా ఉందంటూ రైతులు అప్పట్లోనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పరిహారం పెంచుతూ వడ్డీతో సహా పూర్తిస్థాయిలో చెల్లించాలని 2019లో సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు రెవెన్యూ అధికారులు పెంచిన పరిహారంతోపాటు వడ్డీ కలిపి డిపాజిట్ చేశారు. అయితే ఆ వడ్డీకి సంబంధించిన టీడీఎస్ విషయంలో అధికారులు ఓ ప్రైవేటు ప్రాక్టీషనర్‌తో చేతులు కలిపి అవకతవకలకు పాల్పడినట్లు తెలుస్తోంది. కొంతమంది రైతులకు పాన్‌కార్డు లేకపోవడంతో వచ్చిన వడ్డీలో 20 శాతం, పాన్‌కార్డు ఉన్న వారికి 10 శాతం టీడీఎస్ కట్ చేశారు. 20 శాతం కట్ అయిన రైతుల టీడీఎస్‌లో ప్రైవేటు ట్యాక్స్ ప్రాక్టిషనర్‌తో కలిసి ఇతరుల పాన్‌కార్డులు ఉపయోగించి స్వాహా చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు ఐటీ అధికారులు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు విచారణ చేపట్టారు. కార్యాలయంలో ఉన్న అన్ని ఫైల్స్ పరిశీలించారు. జగిత్యాలలోని సంబంధిత ప్రైవేటు ప్రాక్టిషనర్‌ను పిలిపించి విచారించారు. ఇందులో సుమారు రూ.50 లక్షల వరకు అవకతవకలకు పాల్పడినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గతంలో భూనిర్వాసితుల టీడీఎస్ చెల్లింపుల విషయంలో ఐటీ అధికారులు విచారణ చేపడుతున్నట్లు ఆర్డీవో మధుసూదన్ తెలిపారు.
ఆర్డీవో కార్యాలయంలో అధికారుల విచారణ
ఉదయం నుంచి రాత్రి వరకూ కొనసాగిన తనిఖీలు