
రారండోయ్.. వేడుక చూద్దాం
● నేడే ఇల్లందకుంట శ్రీ సీతారాముల కల్యాణోత్సవం ● పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రి పొన్నం ప్రభాకర్ ● హాజరుకానున్న కేంద్ర మంత్రి సంజయ్, ప్రముఖులు
ఇల్లందకుంట(హుజూరాబాద్): శ్రీ సీతారాముల కల్యాణ వేడుకకు అంతా సిద్ధమైంది. ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామ నవమి సందర్భంగా కల్యాణోత్సవానికి ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. కల్యాణ వేదికను రంగురంగుల పూలతో ముస్తాబు చేశారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు కల్యాణ తంతు నిర్వహించనుండగా.. ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. జమ్మికుంట రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహా అన్నదానం నిర్వహించనున్నారు. శనివారం ధర్మపురి, కొండగట్టు దేవస్థానాల తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ ఆవరణలో, కల్యాణమండపం వద్ద చలువ పందిళ్లు వేశారు. చల్లనినీరు, మజ్జిగ, కూలర్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. కల్యా ణం వీక్షించేలా ఎల్‌ఈడీ స్క్రీన్లు సిద్ధం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. నలుగురు ఏసీపీలు, 10మంది సీఐలు, 15 మంది ఎస్సైలు, ఇతర సిబ్బంది కలిపి 200 మంది పోలీసులు బందోబస్తు విధులు నిర్వహించనున్నారు.

రారండోయ్.. వేడుక చూద్దాం