కరీంనగర్‌కల్చరల్: కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత డా.నలిమెల భాస్కర్ రచించిన మాటల మూటలు, ప్రణయ హృదయాలు, చెలిమెలు, ఆరు బెంగాలీ కథలు, తెలుగు క్రియా పదకోశం, తెలంగాణ పలుకుబడి, కుండి పుస్తకాలను సప్తతి మహోత్సవం సందర్భంగా ఆదివారం సాహితీ సోపతి ఆధ్వర్యంలో ఫిలింభవన్‌లో ఆవిష్కరించారు. మాటల మూటలు పుస్తకాన్ని ప్రముఖ కవి, సీనియర్ పాత్రికేయులు నగునూరి శేఖర్, ప్రణయ హృదయాలు పుస్తకాన్ని ప్రముఖ కవి, విమర్శకులు అన్నాడి గజేంద్రరెడ్డి ఆవిష్కరించారు.
చెలిమెలు పుస్తకాన్ని ప్రముఖ కవి, రచయిత కాలమిస్ట్ అన్నవరం దేవేందర్, ఆరు బెంగాలీ కథలను రచయిత, కవి, గాయకులు గాజోజు నాగభూషణం, తెలుగు క్రియా పదకోశాన్ని కవి, రచయిత విమర్శకులు బూర్ల వెంకటేశ్వర్లు, తెలంగాణ పలుకుబడిని కవి కందుకూరి అంజయ్య, అనువాద నవల కుండిని కవి, విమర్శకులు కూకట్ల తిరుపతి ఆవిష్కరించారు. సీనియర్ ఫిజీషియన్ డాక్టర్ డి.రఘురామన్, జూకంటి జగన్నాథం, పొన్నం రవిచంద్ర, పెద్దింటి అశోక్‌కుమార్, రంగినేని మోహన్‌రావు, పీఎస్ రవీంద్ర, మాడిశెట్టి గోపాల్, డా.వాసరవేణి పరశురాం, మనోహర్‌రెడ్డి, మోత్కుల నారాయణ, బూరె దేవానందం, మద్దికుంట లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం
కరీంనగర్‌టౌన్: బీజేపీ 45వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం కరీంనగర్‌లో ఘనంగా నిర్వహించారు. మాజీ మేయర్ సునీల్‌రావు తన క్యాంపు కార్యాలయంలో బీజేపీ జెండా ఆవిష్కరించి, డాక్టర్ శ్యామప్రసాద్, పండిట్ దీన్‌దయాళ్ చిత్రపటాలకు పూలమాల వేశారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. విద్యానగర్‌లోని మోదీచౌక్ జెండా గద్దె వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించారు.
నరహరి లక్ష్మారెడ్డి, జాడి బాల్‌రెడ్డి, కోమాల ఆంజనేయులు, గుండారపు సంపత్, రెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రేకుర్తి 18వ డివిజన్‌లో పశ్చిమ జోన్ కన్వీనర్ జాడి బాల్‌రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ జెండా ఆవిష్కరించారు. నాయకులు పొన్నాల రాములు, గోదరి నరేశ్, ఎర్రోళ్ల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. 59వ డివిజన్ సుష్మా స్వరాజ్ చౌరస్తాలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. నాయకులు పబ్బాల్ల ఆంజనేయులు, దయ్యాల కరుణాకర్, సంజీవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
విజయవంతం చేయాలి
కరీంనగర్: ట్రైకార్‌లో 2019–21లో రుణాలు మంజూరై చెక్కులు సిద్ధంచేసి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు పడని లబ్ధిదారులు సోమవారం హైదరాబాద్‌లోని గిరిజన సంక్షేమ భవన్ ఎదుట జరిగే నిరసన కార్యక్రమానికి తరలివచ్చి విజయవంతం చేయాలని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బోడ మోహన్‌నాయక్, జి.బీమాసాహెబ్ పిలుపునిచ్చారు. జిల్లా కార్యాలయంలో వారు మాట్లాడుతూ, రాజీవ్ యువ వికాసం పేరుతో రాష్ట్రప్రభుత్వం హడావిడిగా పథకాన్ని ప్రారంభించడం వల్ల ట్రైకార్ సంస్థ పూర్తిగా నిర్వీర్యమవుతుందనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. దాదాపు 30 వేల మంది గిరిజన యువతీయువకులకు రుణాలు మంజూరు చేసి వారి ఖాతాల్లో డబ్బులు వేయకుండా రద్దు చేయాలనే కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ట్రైకార్ లబ్ధిదారులు తరలిరావాలని కోరారు. సమావేశంలో గిరిజన సంఘం నాయకులు పాల్గొన్నారు.
పవర్‌కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: విద్యుత్ మరమ్మతు పనులు చేపడుతున్నందున సోమవారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు టౌన్ 2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు. ఉదయం 8.30 నుంచి 10.30 గంటల వరకు 11 కేవీ రామచంద్రాపూర్ ఫీడర్ పరిధిలోని ఆర్‌సీపీ బైపాస్‌రోడ్, లేక్ పోలీస్‌స్టేషన్, సప్తగిరికాలనీ, సాయిబాబా ఆలయం రోడ్, అంజనాద్రి ఆలయం, శ్రీనగర్‌కాలనీ, ఏఓస్ కాలనీ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని పేర్కొన్నారు.

సప్తసాహితీ పుస్తకాల ఆవిష్కరణ