
కేసీఆర్ రాసిందే ‘బండి’ చదివేది!
● సుడా చైర్మన్ నరేందర్‌రెడ్డి
కరీంనగర్ కార్పొరేషన్: కేసీఆర్ రాసి పంపిన స్క్రిప్ట్‌ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చదువుతున్నారని సుడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి విమర్శించారు. సోమవారం నగరంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అర్థ్ధరహితమన్నారు. గతంలో సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దీక్ష చేస్తే అవసరం లేకున్నా.. పోలీసులతో హంగామా సృష్టించి కేసీఆర్ అరెస్ట్ చేయించారన్నారు. మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగంగా సంజయ్‌కి మైలేజీ రావడానికి అరెస్ట్ నాటకమాడిన కేసీఆర్, మరోసారి సంజయ్‌ని బీజేపీ అధ్యక్షుడిగా చేసేందుకు ప్రయత్నిస్తున్నరని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్‌లను 42 శాతానికి పెంచుతూ చట్టంచేసి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పట్ల చిత్తశుద్ధిని ప్రదర్శించిందన్నారు. సంజయ్‌కి ఏ మాత్రం బీసీల పట్ల చిత్తశుద్ధి ఉన్నా.. కేంద్రం ఆమోదించేలా చూడాలన్నారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఎండీ తాజ్, కొరివి అరుణ్‌కుమార్, శ్రవణ్‌నాయక్, చర్ల పద్మ, జీడి రమేశ్, సాయిరాం, గుండేటి శ్రీనివాస్‌రెడ్డి, మాసం ఖాన్, బషీర్ , భారి, వాసు, శ్రీధర్, కీర్తికుమార్ పాల్గొన్నారు.