● నేటి నుంచి క్షేత్రస్థాయిలో వార్డు అధికారుల విచారణ
కరీంనగర్ కార్పొరేషన్: నగరవాసులు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్‌కార్డు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఎట్టకేలకు మొదలైంది. నగర పాలకసంస్థకు చెందిన వార్డు అధికారులు కొత్త రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన దరఖాస్తుల ఆధారంగా క్షేత్రస్థాయిలో ఎంపిక ప్రక్రియను చేపడుతున్నారు. గురువారం నుంచి రేషన్‌దుకాణాల వారీగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై విచారణ చేపట్టనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూపొందించిన ప్రత్యేక ఆప్ ద్వారా సమాచారాన్ని అప్‌లోడ్ చేయనున్నారు. సంవత్సరాలుగా కొత్తగా రేషన్‌కార్డులు ఇవ్వకపోవడం, రేషన్‌కార్డులో కుటుంబసభ్యులను చేర్చడం, తొలగించడం లేకపోవడంతో ప్రజలకు ఎదురుచూపులు తప్పడం లేదు. గతంలో కొత్త రేషన్‌కార్డులతో పాటు, సవరణల కోసం ప్రభుత్వం దరఖాస్తులు తీసుకోవడం తెలిసిందే. వచ్చిన దరఖాస్తులను ఆయా రేషన్‌దుకాణాల వారీగా జాబితాగా రూపొందించారు. ఆ జాబితా ఆధారంగా వార్డు అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టనున్నారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా వివరాలు సేకరించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చేపట్టనున్నారు.
పకడ్బందీగా చేపట్టాలి
రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పగడ్బందీగా నిర్వహించాలని నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయి ఆదేశించారు. బుధవారం నగరపాలకసంస్థ సమావేశ మందిరంలో వార్డు అధికారులతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన యాప్, మార్గదర్శకాలకు అనుగుణంగా విచారణ చేపట్టాలన్నారు. ముఖ్యంగా వార్షిక ఆదాయ ధ్రువీకరణపత్రాన్ని పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. నిబంధనల ప్రకారం వి చారణ చేసి వివరాలు అప్‌లోడ్ చేయాలన్నారు.