
అంతర్ జిల్లా దొంగ అరెస్ట్
● 28.6 తులాల బంగారం స్వాధీనం
● నిందితుడిపై 25 చోరీ కేసులు
జగిత్యాలక్రైం: జగిత్యాలలో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఎస్పీ కార్యాలయంలో వివరాలు వెల్ల డించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రాగంపేటకు చెందిన రాగుల రామమ్మ, కొంరయ్య కుమారుడు రాగుల అజయ్‌కుమార్ అలియాస్ బక్కశెట్టి కొంరయ్య ప్రస్తుతం మంచిర్యాల జిల్లాకేంద్రంలోని తిలక్‌నగర్‌లో ఉంటున్నాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు పట్టించుకోకపోవడంతో హైదరాబాద్ పారిపోయి ఓ లారీ ట్రాన్స్‌పోర్ట్‌లో పనికి కుదిరాడు. ఈ క్రమంలోనే దొంగతనాలకు అలవాటుపడ్డాడు. ఇలా సుమారు 25 దొంగతనం కేసుల్లో పట్టుబడ్డాడు. జగిత్యాలపై పట్టు ఉండడంతో ఇక్కడకు చేరుకుని మార్చి 28న అరవింద్‌నగర్‌లో, మార్చి 16న హన్మాన్‌వాడలో, జనవరి 18న పురాణిపేటలో, ఫిబ్రవరి 16న గణేష్‌నగర్‌లో, ఫిబ్రవరి 23న పద్మనగర్‌లో, మార్చి 7న గోవిందుపల్లెలో, మార్చి 18న కృష్ణానగర్‌లో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడి బంగారు అభరణాలను ఎత్తుకెళ్లాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న జగిత్యాల పోలీసులు నిందితుడి కదలికలపై నిఘా వేశారు. ఈ నేపథ్యంలోనే పట్టణ పోలీసులు గురువారం కొత్త బస్టాండ్ చౌరస్తాలో వాహనాల తనిఖీ చేస్తుండగా కొంరయ్య అనుమానాస్పదంగా కనిపించాడు. అతడిని పట్టుకుని విచారణ చేపట్టగా అసలు నిజం ఒప్పుకున్నాడు. అతడి నుంచి 28.6 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో కృషి చేసిన పోలీసులను రివార్డుతో అభినందించారు. కార్యక్రమంలో డీఎస్పీ రఘుచందర్, పట్టణ సీఐ వేణుగోపాల్, ఎస్సైలు కిరణ్, గీత, కానిస్టేబుళ్లు జీవన్, విశాల్, సంతోష్, మల్లేషం, గంగాధర్, రమేశ్ పాల్గొన్నారు.

అంతర్ జిల్లా దొంగ అరెస్ట్