
సన్నబియ్యం.. పప్పుచారు
● లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన కలెక్టర్ పమేలా సత్పతి, మానకొండూర్ ఎమ్మెల్యే సత్యనారాయణ
శంకరపట్నం: సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో కలెక్టర్ పమేలా సత్పతి, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, అదనపు కలెక్టర్లు లక్ష్మి కిరణ్, ప్రఫుల్ దేశాయ్ భోజనం చేశారు. శంకరపట్నం మండలం వంకాయగూడెం గ్రామంలోని దళిత సామాజికవర్గానికి చెందిన చలిగంటి గణేశ్–మమత ఇంట్లో గురువారం సన్నబియ్యం అన్నం, పప్పుచారుతో భోజనం చేశారు. గణేశ్ ఇంటికి కలెక్టర్, ఎమ్మెల్యే రావడంతో గ్రామస్తులు తరలివచ్చారు. సన్నబియ్యంతో భోజనం చేస్తున్నారా? ఎలా ఉందని కలెక్టర్ మహిళలను ఆరా తీశారు. అన్నం రుచిగా ఉందని వివరించారు. భోజనం వడ్డించిన గణేశ్– మమత దంపతులను సత్కరించారు. అక్కడే ప్రభుత్వ పాఠశాల యూని ఫాంతో కనిపించిన గణేశ్ కూతురు అక్షయనందనను కలెక్టర్ పలకరించారు. ఏ క్లాసు, ఎలా చదువుతున్నావని ఆరా తీశారు. బాగా చదువుకుని, మంచిపేరు తీసుకురావాలని సూచించారు.