
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
చొప్పదండి: పట్టణంలోని బీసీ కాలనీలో నివాసముండే ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గాజుల కనకలక్ష్మి అనే మహిళ భర్త చనిపోవడంతో బీసీ కాలనీలోని ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఆమె కూతురు ఆర్నకొండకు చెందిన నెల్లి నాగమణి రోజులాగే శనివారం రాత్రి, ఆదివారం ఉదయం ఫోన్ చేసి తల్లితో మాట్లాడటానికి ప్రయత్నించగా.. ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అనుమానం వచ్చి ఇంటి పక్కన ఉన్నవారిని చూడుమని కోరగా.. ఇంటి లోపల గేటుకు తాళం ఉందని, పిలిస్తే పలకడం లేదని చెప్పారు. ఆర్నకొండ నుంచి వచ్చి చూడగా.. ఇంట్లో చనిపోయి ఉంది. కనకలక్ష్మి పుస్తెల తాడు తెగిపోయి ఉండగా.. రెండు తులాల బంగారు గొలుసు కనిపించలేదు. దీంతో గుర్తుతెలియని వ్యక్తులు బంగారు ఆభరణం కోసం హత్య చేసి చోరీ చేసినట్లు అనుమానముందని నాగమణి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కనకలక్ష్మికి మొదట మంద రాజయ్యతో వివాహం కాగా.. నాగరాజు అనే కుమారుడు జన్మించాడు. మంద రాజయ్య మృతిచెందడంతో.. నెల్లి రాజయ్యను వివాహం చేసుకుంది. వీరికి నాగమణి జన్మించింది. నెల్లి రాజయ్య కూడా మృతిచెందడంతో.. పదేళ్ల క్రితం ఆర్మీలో రిటైర్డ్ అయిన గాజుల చంద్రయ్యను పెళ్లి చేసుకుంది. చంద్రయ్యకు వివాహం జరిగి ముగ్గురు కుమారులు జన్మించిన తర్వాత ఆయన భార్య మృతిచెందడంతో కనకలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి పిల్లలు లేకపోవడంతో ఏడేళ్ల కిత్రం నాగమణి వివాహం చేశారు. రెండేళ్ల కిత్రం చంద్రయ్య కూడా మృతిచెందడంతో.. కనకలక్ష్మి బీసీ కాలనీలో ఒంటరిగా ఉంటోంది. అనుమానాస్పద మృతిపై ఎస్సై మామిడాల సురేందర్ కేసు నమోదు చేశారు.