
రోడ్డు దాటుతుండగా కారు ఢీ
● చికిత్స పొందుతూ రైతు మృతి
బోయినపల్లి(చొప్పదండి): పంట చేనుకు నీరు పెట్టి ఇంటికొస్తూ రోడ్డు దాటుతున్న రైతును కారు ఢీకొట్టగా.. తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందాడు. గ్రామస్తులు, ఎస్సై పృధ్వీధర్‌గౌడ్ వివరాల ప్రకారం.. నీలోజిపల్లి గ్రామానికి చెందిన హన్మాండ్లు(60) అనే రైతుకు మూడెకరాల భూమి ఉంది. మిడ్ మానేరు కట్ట పరిసరాల్లో ఉన్న భూమిలో కూరగాయలు, ఇతర పంటలు సాగు చేస్తున్నాడు. ఆదివారం ఉదయం పంట చేన్లో నీరు పెట్టడానికి వెళ్లి తిరిగి ఇంటికొస్తున్నాడు. రోడ్డు దాటే క్రమంలో వేములవాడ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న కారు హన్మాండ్లును ఢీకొంది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబీకులు కరీంనగర్ ఆసుసత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడు. హన్మాండ్లుకు భార్య అమృతవ్వ, కుమారులు మధూకర్, నాగరాజు ఉన్నారు.
ట్రాక్టర్ దొంగతనం కేసులో ఇద్దరి అరెస్టు
మంథని: పుట్టపాక గ్రామానికి చెందిన మిట్ట రాజశేఖర్‌కు చెందిన ట్రాక్టర్, రోటవేటర్ జనవరి 24న చోరీకి గురి కాగా.. ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు సీఐ రాజు తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. గ్రామంలో రోడ్డు పక్కన తన షెడ్డులో నిలిపి ఉంచిన ట్రాక్టర్, రోటవేటర్ దొంగతనానికి గురైంది. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. అదే గ్రామానికి చెందిన ముప్పిడి రమేశ్ ఆర్థిక ఇబ్బందులతో ఏదైనా ట్రాక్టర్‌ను దొంగతనం చేయాలని ఆలోచించుకున్నాడు. ఈ క్రమంలో మున్సిపాలిటీలోని గంగాపురికి చెందిన ట్రాక్టర్ మెకానిక్ ప్రసాద్‌ను సంప్రదించాడు. రమేశ్ ట్రాక్టర్, రోటవేటర్ దొంగతనం చేసి మెకానిక్ వద్దకు తీసుకెళ్లి దాచిపెట్టాడు. శనివారం ట్రాక్టర్‌ను అమ్మడానికి ప్రయత్నించగా.. వారిని పట్టుకున్నారు. ట్రాక్టర్, రెండు టైర్లు, రోటవేటర్, ట్రాక్టర్ టాప్‌ను స్వాధీనపర్చుకున్నట్లు సీఐ తెలిపారు.

రోడ్డు దాటుతుండగా కారు ఢీ