
గుండెపోటుతో యువకుడి మృతి
కోనరావుపేట: వెంకట్రావుపేట గ్రామానికి చెందిన ప్రశాంత్ అనే యువకుడు గుండెపోటుతో మృతిచెందాడు. కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ప్రశాంత్‌కు శనివారం ఫిట్స్ రావడంతో అంబులెన్స్‌లో సిరిసిల్లలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతున్న ప్రశాంత్ గుండెపోటుకు గురై మృతిచెందాడు. మృతదేహాన్ని గ్రామానికి తరలించి ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి భార్య రాణి, కుమారుడు అద్విత్, అమ్మమ్మ ఎల్లవ్వ ఉన్నారు.
కత్తి పోటుకు గురైన బాలుడు..
సిరిసిల్లక్రైం: శాంతినగర్ భూవివాదంలో మంగళవారం ముగ్గురు కత్తి పోట్లకు గురైన విషయం తెలిసిందే. జిల్లా కేంద్రంలో ఇంటి సమీపంలో రెండున్నర ఫీట్ల భూమి తగాదాలో వెంకటేశ్ కుటుంబానికి, అతడి అన్న కొడుకు పథ్వీ మధ్య కొద్ది రోజులుగా వివాదముంది. మంగళవారం పృథ్వీ, అతడి స్నేహితుడు వెంకటేశ్ ఇంటికెళ్లారు. వెంకటేశ్, అతడి భార్య, కొడుకు శివనేత్ర(3)పై కత్తితో దాడి చేశారు. శివనేత్ర పొట్టలో తగిలిన కత్తి పోటుతో పేగులు బయట పడ్డాయి. చికిత్స కోసం హైదరాబాద్ తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. గాయపడ్డ వెంకటేశ్, అతడి భార్య కోలుకుంటున్నారని పోలీసులు తెలిపారు.
బీజేపీ నాయకుల ఇళ్లపై కాంగ్రెస్ దాడి
● ఫ్లెక్సీ ఏర్పాటుతో ముదిరిన వివాదం
● పోలీసులుండగానే ఘటన
● గొల్లపల్లిలో ఉద్రిక్తత
● నలుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
గొల్లపల్లి: బీజేపీ నాయకుల ఇళ్లపై కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు దాడులు చేయడం కలకలం సృష్టించింది. ఇది మండల కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని రామాలయం గుట్టపై కాంగ్రెస్ నాయకులు కట్టుకున్న ఫ్లెక్సీని గుర్తుతెలియని వ్యక్తులు చించేశారు. దీనికి బీజేపీ మండల అధ్యక్షుడు కట్ట మహేశ్, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు సంగెం కల్యాణ్ కారణమని పేర్కొంటూ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముస్కు నిషాంత్‌రెడ్డి, నేరెళ్ల మహేశ్, ఓర్సు విజయ్, నల్ల విక్రంరెడ్డి, మరో 30 మంది దాడికి పాల్పడ్డారు. దీంతో బాధితులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చినా వారి ఎదుటనే మరోసారి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు సంఘెం కల్యాణ్ వీపులో గాయాలయ్యాయి. ఇంటి అద్దాలు, ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. కుటుంబ సభ్యులపైనా దాడికి పాల్పడి కట్ట మహేశ్, సంగెం కల్యాణ్‌ను చంపుతామని బెదిరించారు. తనను కులం పేరుతో దూషించి చంపుతామని బెదిరించారని కల్యాణ్ ఫిర్యాదు మేరకు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముస్కు నిషాంత్‌రెడ్డి, నేరెల్ల మహేశ్‌గౌడ్, ఓర్సు విజయ్, నల్ల విక్రంరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై సతీశ్ తెలిపారు.

గుండెపోటుతో యువకుడి మృతి

గుండెపోటుతో యువకుడి మృతి