
కారు ఢీకొని యువకుడి మృతి
తిమ్మాపూర్: మండలం కొత్తపల్లి శివారులో కారు ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందారు. ఎస్సై వివేక్ కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్‌కు చెందిన దొప్ప సంతోష్ కుమార్ (32) హైదరాబాద్ మేడ్చల్ జిల్లాలో మొక్కజొన్న కంకులు విక్రయించి తిరిగి వెళ్లే క్రమంలో మండలంలోని కొత్తపల్లి గ్రామంవద్ద వాహనాన్ని నిలిపాడు. అనంతరం నీరు తాగుతూ మరో వ్యక్తికోసం వేచి చూస్తూనే క్రమంలో హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వస్తున్న కారు అదుపుతప్పి ఢీకొనడంతో సంతోష్ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
ఇంటర్‌లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో ఆత్మహత్య
పాలకుర్తి(రామగుండం): ఇంటర్మీడియెట్ పరీక్షలో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఘనశ్యాందాస్‌నగర్(జీడీనగర్) గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. సాపల్ల ఎల్లయ్య– గంగమ్మ దంపతుల కూతురు సాపల్ల శశిరేఖ(17) సిరిసిల్లలోని మోడల్ స్కూల్‌లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదివింది. ఇటీవల ఇంటర్ పరీక్షలు రాసింది. అయితే, శశిరేఖ తలి గంగమ్మ ఉదయమే పనికోసం పెద్దపల్లికి వెళ్లింది. తండ్రి ఎల్లయ్య కన్నాల బోడగుట్ట క్వారీలో పనికి వెళ్లాడు. శశిరేఖ ఒంటరిగా ఉన్నది. మంగళవారం వెలుబడిన ఇంటర్ ఫలితాల్లో కామర్స్ సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయిన శశిరేఖ.. మనస్థాపంతో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు సాయంత్రం ఇంటికి వచ్చిచూసేసరికి శశిరేఖ విగతజీవిగా కనిపించడంతో బోరున విలపించారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒకకుమార్తె కాగా ఇద్దరు కుమారులలో ఒకరు ప్రస్తుతం బాసర ట్రిపుల్ ఐటీలో చదువుచున్నాడు. మరో కుమారుడికి ఇటీవలనే నేవీలో ఉద్యోగం రాగా శిక్షణ నిమిత్తం కేరళలో ఉంటున్నాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు అర్ధంతరంగా తనువు చాలించడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై స్వామి తెలిపారు.

కారు ఢీకొని యువకుడి మృతి