సాక్షి,బళ్లారి: విధానసభ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగియడంతో బరిలో ఉన్నదెవరో తేలిపోయింది. ఇక ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. పోలింగ్‌కు మరో 12 రోజులే గడువు ఉంది. దీంతో అన్ని ప్రాంతాల్లోనూ బహిరంగ సభలు నిర్వహించి ప్రముఖులతో ప్రచారం చేయిస్తున్నారు. రాష్ట్రంలోని 224 నియోజకవర్గాల్లో పర్యటించేందుకు బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ అగ్రనాయకులు హెలికాప్టర్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో వాటికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
గతానికంటే ఈ సారి ఎన్నికలు విభిన్నంగా జరగనున్నాయి. అనేక మంది సీనియర్‌నేతలు పార్టీలు మారారు. దీంతో ఏ పార్టీకి కూడా గెలుపు అంత ఈజీ కాదనే పరిస్థితులు నెలకొన్నాయి. ఈక్రమంలో బీజేపీ తరఫున ప్రధానమంత్రి మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌షాతో పాటు కేంద్ర మంత్రివర్గం మొత్తం రాష్ట్రంలో తిష్టవేసి ప్రచారాన్ని తారాస్థాయికి తీసుకెళ్లనున్నారు. యూసీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో పాటు ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా పాల్గొంటున్నారు. కాంగ్రెస్ తరఫున రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే, సిద్ధరామయ్య, డీకేశి, జేడీఎస్ తరఫున దేవెగౌడ, కుమారస్వామి కూడా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.
వీరందరూ కూడా దాదాపు హెలికాప్టర్లు వాడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి రెట్టింపు సంఖ్యలో హెలికాప్టర్లు రాష్ట్రంలో చక్కర్లు కొడుతున్నాయని హెలిప్యాడ్ సంస్థ సంబంధిత అధికారి తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల అతిరథ మహారథులు దాదాపు 100 హెలికాప్టర్లను వినియోగిస్తున్నట్లు అంచనా. రాష్ట్రంలో తగినన్ని హెలికాప్టర్లు లేనందున ముంబై, పుణే, పనాజి, హైదరాబాద్ తదితర ప్రముఖ నగరాల్లో ప్రైవేటు వ్యక్తుల నుంచి బాడుగకు తీసుకు వచ్చి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.
భారీగా పెరిగిన హెలికాప్టర్ బాడుగ
బెంగళూరు, మంగళూరు, హుబ్లీ, బెళగావి, మైసూరు తదితర ప్రాంతాల్లో హెలిప్యాడ్‌లో ప్రముఖులు హెలికాప్టర్లను ఉంచి చుట్టుపక్కల నియోజకవర్గాలకు కార్లలో వెళ్లి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు వెళ్లేటప్పుడు హెలికాప్టర్‌ను బయటకు తీస్తారు. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈ సంవత్సరం హెలికాప్టర్ బాడుగ కూడా భారీగా పెరిగినట్లు తెలుస్తోంది.
రెండు సీట్ల కెపాసిటీ ఉన్న హెలికాప్టర్ బాడుగ గంటకు రూ. లక్ష ఉండేది. ప్రస్తుతం రూ.2 లక్షలకు చేరింది. నాలుగు సీట్ల హెలికాప్టర్ బాడుగ రూ.2.5 లక్షలు, 8 సీట్ల హెలికాప్టర్ బాడుగ రూ.3.5 లక్షలు, 15 సీట్ల హెలికాప్టర్ బాడుగ రూ.5 లక్షల అద్దె వసూలు చేస్తున్నారు. హెలిప్యాడ్ వద్ద హెలికాప్టర్లను ఉంచేందుకు 8 గంటలకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు బాడుగ తీసుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment