మార్చి 29 నుంచి ఎన్నికల కోడ్, ఏప్రిల్ 10 నుంచి నామినేషన్ల పర్వం, మే 10వ తేదీన పోలింగ్, ఈ తేదీల మధ్యలో దేశంలో హేమాహేమీల ప్రచార యుద్ధం. ఇక అందరూ ఎదురుచూసిన మే 13న విస్ఫోటనం వంటి ప్రజా తీర్పు వెలువడింది. ఎవరూ ఊహించనంతగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. రెండు ప్రధాన పార్టీలు మెజారిటీ దరిదాపులకు రావడం, మధ్యలో జేడీఎస్ దయతో సంకీర్ణ సర్కారు ఏర్పడడం తరచూ చూసినదే. సంకీర్ణ సర్కార్లలో నిత్యం ఎమ్మెల్యేల బేరసారాల గొడవలతో విసిగిపోయిన ఓటరు ఈసారి ఒకే పార్టీకి పూర్తి మెజారిటీ ఇచ్చినట్లు భావించాలి.
బనశంకరి: రాష్ట్ర విధానసభ ఎన్నికల ఫలితాలలో ఓటర్లు అనూహ్యమైన తీర్పునిచ్చారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి పట్టం గట్టారు. అధికార బీజేపీ, అలాగే మరో విపక్షం జేడీఎస్‌లకు తిరస్కారమే ఎదురైంది. ఈ ఎన్నికల్లో 136 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించగా, బీజేపీ 65 సీట్లతో సరిపెట్టుకుంది. జేడీఎస్‌కు 19 స్థానాలు దక్కాయి ఇతరులు నాలుగుచోట్ల ఎన్నికయ్యారు. హంగ్ వస్తుందనుకున్న అంచనాలు బద్ధలయ్యాయి.
బీజేపీ పరివారం రాక
డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ అగ్రనేతలు ఎంతగా ప్రచారం చేసినప్పటికీ ఓటర్లు విశ్వసించినట్లు లేదు. ప్రధాని మోదీ రికార్డుస్థాయిలో 10 రోజులపాటు రాష్ట్రంలో మూలమూలలా చెమటోడ్చి ప్రచారం చేశారు. ఎన్నికల చాణక్యునిగా పేరుపొందిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా కన్నడనాటే మకాం వేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డా, యోగి ఆదిత్యనాథ్, మరెంతోమంది కాషాయవాదులు కాలికి బలపం కట్టుకుని ప్రచారంలో పాల్గొన్నారు. నటులు సుదీప్, దర్శన్ తో పాటు అనేకమంది బీజేపీకి మద్దతుగా ప్రచారంలోకి దిగారు. కానీ ఫలితం మాత్రం తిరగబడింది.
ప్రతిపక్షాల పోరు
కాంగ్రెస్ తరఫున ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ ముమ్మరంగా సభలు, రోడ్‌షోలలో పాల్గొన్నారు. సోనియాగాందీ సైతం ఒక బహిరంగ సభకు హాజరయ్యారు. రాష్ట్ర నాయకులు సరేసరి. జేడీయస్ పార్టీలో కుమారస్వామి, హెచ్‌డీ దేవేగౌడ తదితరులు ప్రచారం చేపట్టారు. కాంగ్రెస్ ధరలు పెంపు, బీజేపీ ప్రభుత్వ అవినీతి, కుంభకోణాలను ప్రధానంగా ప్రస్తావించారు. బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం విజయాలపై ప్రచారం చేసింది. జేడీయస్ పంచరత్న పథకాలను ప్రచారం చేసింది.
ప్రముఖుల గెలుపు
చివరకు శనివారం సాగిన ఓట్ల లెక్కింపులో అనుకోని ఫలితం వెలువడింది. బెంగళూరుతో సహా రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్ కేంద్రాల వద్ద జాతరను మించిన జనసందోహం కనిపించింది. కేపీసీసీ అధ్యక్షుడు డీకే.శివకుమార్, సీఎల్పీ నేత సిద్దరామయ్య, సీఎం బసవరాజ బొమ్మై, పద్మనాభనగరలో మంత్రి ఆర్.అశోక్, మల్లేశ్వరంలో మంత్రి అశ్వత్‌నారాయణ, శికారిపురలో యడియూరప్ప తనయుడు, బీజేపీ అభ్యర్థి బీవై.విజయేంద్ర, చెన్నపట్టణలో హెచ్‌డీ.కుమారస్వామి గెలుపొందారు. అనేకచోట్ల ఊహించని రీతిలో ఓటర్ల తీర్పు వెలువడడం విశేషం.
కాంగ్రెస్‌కు కలిసొచ్చిన కాలం
బొమ్మై సర్కారు అన్ని కాంట్రాక్టులు, ప్రాజెక్టుల్లో 40 శాతం కమీషన్లు తీసుకుంటోందని కాంగ్రెస్ పార్టీ విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది. ఇదే సమయంలో మంత్రి కేఎస్ ఈశ్వరప్పపై ఆరోపణలు చేస్తూ కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకోవడం కాంగ్రెస్ పార్టీ ఆరోపణలకు బలం చేకూర్చింది. మరోవైపు ఎమ్మెల్యే మాడాల్ విరూపాక్ష కుమారుడిపై లోకాయుక్తా దాడిలో కట్టల కొద్ది నగదు పట్టుబడడంతో బీజేపీ మరింత ఇరకాటంలో పడింది.
ఐదు ప్రధాన హామీలను కాంగ్రెస్ ప్రకటించింది. ప్రతి నెల బీపీఎల్ కుటుంబానికి 10 కేజీల ఉచిత బియ్యం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, నిరుద్యోగ యువతకు రూ. 30 వేల భృతి, ప్రతి గృహిణికి రూ. 2 వేల ఆర్థిక సాయం, బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వంటి హామీలు ఓటర్లను ఆకట్టుకున్నాయి.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత జోడో యాత్రతో పాటు రాష్ట్ర నాయకులు చేసిన మేకెదాటు పాదయాత్ర, ఫ్రీడమ్ మార్చ్ వంటి యాత్రలు కాంగ్రెస్ పార్టీకి మంచి మైలేజ్‌ను తీసుకొచ్చాయి.
సీఎం ఎంపిక అంశంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య గట్టి పోటీ ఉంది. అయినా ఆ విషయాన్ని పక్కన పెట్టి ఎన్నికల్లో పార్టీ విజయమే పరమావధిగా ఈ ఇద్దరు నేతలు తీవ్రంగా శ్రమించారు.
Comments
Please login to add a commentAdd a comment