కోలారు: వరకట్న దాహానికి ఓ వివాహిత బలైన ఘటన మంగళవారం కోలారు నగరంలోని ఖాద్రిపురలో చోటు చేసుకుంది. వివరాలు.... బంగారుపేట తాలూకా దొడ్డూరు గ్రామానికి చెందిన అంబిక (25)కు కోలారులోని ఖాద్రిపురకు చెందిన మధు అనే యువకుడితో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. మధు ప్లంబర్, వాటర్ ఫిల్టర్ రిపేరీ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. వీరికి ఇద్దరు సంతానం.
మద్యానికి బానిసై వేధింపులు
వివాహమైన కొత్తలో వీరి కాపురం సజావుగానే సాగినా అనంతరం మధు తాగుడుకు బానిసయ్యాడు. నిత్యం తాగి వచ్చి భార్య అంబికను డబ్బు కోసం వేధించేవాడు. తరచుగా కట్నం తేవాలని పుట్టినింటికి తరిమేసేవాడు. దీనిపై పలుమార్లు భార్యాభర్తల మధ్య పెద్దలు పంచాయితీ చేసి రాజీ కుదిర్చారు. అయినా మధు తీరులో మాత్రం మార్పు కనిపించలేదు. 9 నెలల క్రితం అంబిక రెండవ బిడ్డ పుట్టింది. పుట్టినింటి నుంచి తిరిగి భర్త ఇంటికి వచ్చిన భార్యను మధు యథావిధిగా డబ్బు కోసం వేధించడం మొదలు పెట్టాడు. సోమవారం రాత్రి పీకలదాకా తాగి వచ్చిన మధు భార్యతో గొడవ పడి తీవ్రంగా కొట్టి ఇంట్లోనే ఉరి వేసి చంపాడని మృతురాలి బంధువులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
భర్తే ఉరివేసి చంపాడు
అయితే మధు తరఫు వారు మాత్రం అంబిక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని అంటున్నారు. అంబిక ఆత్మహత్య చేసుకోలేదు, భర్తే అంబికను ఉరి వేసి చంపాడని ఆమె చిన్నాన్న వెంకటరామప్ప, బంధువు రాజేంద్ర ఆరోపించారు. అంబిక బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కోలారు రూరల్ పోలీసులు మధును అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment