సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో హెచ్‌ఐవీ బాధితుల సంఖ్య క్రమంగా విస్తరిస్తున్న దాఖలాలున్నాయి. ప్రతిఏటా రెండు వేల కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర ఎయిడ్స్ ప్రివెన్షన్ సొసైటీ హెచ్‌ఐవీ పరీక్షలను పెంచడం ద్వారా బాధితులను గుర్తింపునకు ప్రయత్నిస్తోంది. హెచ్‌ఐవీ/ ఎయిడ్స్ మహమ్మారిని అరికట్టేందుకు పలు కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కేసుల సంఖ్య అదుపులోకి రావడం లేదు.
హెచ్‌ఐవీ బాధితుల్లో దేశంలో కర్ణాటక 17వ స్థానంలో ఉండడం కొంచెం మంచి విషయమే. కాగా, గతేడాది ఏకంగా రాష్ట్రవ్యాప్తంగా 13,338 మంది హెచ్‌ఐవీ బారిన పడ్డారు. 2020–21లో మొత్తం 10,095 మందికి, 2021–22లో 11,178 మందికి హెచ్‌ఐవీ సోకింది. కాగా, అసురక్షిత శృంగారం వల్లే హెచ్‌ఐవీ కేసులు ఎక్కువగా ప్రబలుతున్నట్లు ప్రభుత్వ సర్వేలో తేలింది.
లక్షిత వర్గాలకు టెస్టులు
ఈ నేపథ్యంలో ఎయిడ్స్ ప్రివెన్షన్ సొసైటీ హెచ్‌ఐవీ గురించి ముందస్తు జాగ్రత్తగా కొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. హెచ్‌ఐవీ కేసులను తగ్గించేందుకు సొసైటీ కొత్త కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ కార్యక్రమంలో భాగంగా లైంగిక కార్యకర్తలు (సెక్స్ వర్కర్స్), ట్రక్ డ్రైవర్లు, డ్రగ్స్ వాడేవారు, హిజ్రాలు, రోజువారీ కూలీలు ఎక్కువగా అసురక్షిత శృంగారంలో పాల్గొంటున్నారని సమీక్షలో సొసైటీ గుర్తించింది. వీరినే లక్షిత వర్గాలు అని పిలుస్తారు. వారి జాబితాను తయారు చేసి అందరికీ హెచ్‌ఐవీ టెస్టులను చేస్తోంది. వీరిలో పాజిటివ్ వచ్చిన వారికి వైద్య సేవలను, ఉచిత ఔషధాలను అందిస్తోంది. ఇప్పటికే 86 శాతం మేర ఈ కార్యక్రమం కార్యరూపం దాల్చింది.
ఏఆర్‌టీ కేంద్రాల్లో ఔషధాలు
రాష్ట్రంలో మొత్తం 71 ఏఆర్‌టీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో హెచ్‌ఐవీ బాధితులకు ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ కేంద్రాల్లో అపరిశుభ్రత, నర్సులు, మందుల కొరత ఎక్కువగా వేధిస్తోంది. దీంతో బాధితులు ఇక్కడికి రావాలంటే భయపడాల్సి వస్తోంది. రాజీవ్‌గాంధీ వసతి యోజన కింద వసతి, చికిత్స, ఉచిత ప్రయాణానికి డబ్బులు చెల్లిస్తున్నారు. హెచ్‌ఐవీ బాధిత విద్యార్థులకు ఉచిత కాలేజీ విద్య, ఉపకార వేతనాలు, ధనశ్రీ యోజన కింద రూ. 40 వేల రుణం, ఉచిత రైల్వే ప్రయాణం, ఉచిత రక్తసేవలు వంటి అనేక సౌకర్యాలను ప్రభుత్వాలు బాధితులకు కల్పిస్తున్నాయి. అయితే ఇందులో 40 శాతం హెచ్‌ఐవీ బాధితులకు ఈ సౌలభ్యాలు చేరడం లేదు. 30 శాతం మందికి ఈ పథకాల సమాచారమే తెలియకపోవడం గమనార్హం.
క్షయ, క్యాన్సర్ తదితర జబ్బులు సోకితే నిర్ణీత కాలం చికిత్స తీసుకుంటే నయమై మామూలు మనిషి కావచ్చు. కానీ ఒక్కసారి హెచ్‌ఐవీ వైరస్ సోకితే నయం కాదు, అది ముదిరిపోకుండా చూసుకుంటూ జీవించాల్సి ఉంటుంది. ఇంత భయంకరమైన హెచ్‌ఐవీపై అనేక వర్గాల్లో అవగాహన కరువై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సులభంగా హెచ్‌ఐవీ/ ఎయిడ్స్‌కు గురై జీవితాన్ని నరకప్రాయం చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment