పోలీస్‌స్టేషన్‌లో ఇన్స్‌పెక్టర్ దుస్తుల్లో బాలుడు అజాన్‌ఖాన్
కర్ణాటక: బాలుడు సీఐగా అవతారమెత్తాడు. పోలీస్ స్టేషన్‌లో సిబ్బందిని ఆజమాయిషీ చేశాడు. భేష్.. చిన్న వయసులోనే మంచి ఉద్యోగం సంపాదించాడు అనుకుంటే పొరపాటే. గుండెజబ్బుతో బాధపడుతున్న బాలుని ఆశను తీర్చేందుకు శివమొగ్గ ఎస్పీ అతనికి ఈ అవకాశం కల్పించారు.
ఇన్‌స్పెక్టర్ అజాన్‌ఖాన్
వివరాలు.. శివమొగ్గ నగరానికి చెందిన, ప్రస్తుతం బాలెహొన్నూరులో నివాసం ఉంటున్న తబ్రేజ్ ఖాన్ అనే వ్యక్తి కుమారుడు అజాన్‌ఖాన్ (8) గుండెజబ్బుతో బాధపడుతున్నాడు. పెద్దయ్యాక పోలీస్ అవుతానని అందరితో చెప్పేవాడు. కానీ అతని ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆ కోరిక నెరవేరుతుందో, లేదో చెప్పలేని పరిస్థితి. ఇది జిల్లా ఎస్పీ జీకే మిథున్‌కుమార్‌కు తెలిసింది. ఆయన సూచనతో బాలున్ని ఒక్కరోజు ఇన్స్‌పెక్టర్‌ని చేశారు.
గురువారం ఉదయం చక్కగా కుట్టించిన పోలీస్ డ్రెస్ వేసుకుని బాలుడు శివమొగ్గ నగరంలోని దొడ్డపేట పోలీసు స్టేషన్‌కు రాగానే పోలీసులు గౌరవ వందనం ప్రకటించారు. సీఐ సీట్లో కూర్చుని సరదాగా గడిపాడు. ఈ కార్యక్రమంలో ఎస్పీ జీకే మిథున్ కుమార్, ఏఎస్పి అనిల్ కుమార్ భూమారెడ్డి, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు. తరువాత బాలునికి మిఠాయిలు ఇచ్చి ఇంటికి సాగనంపారు. కల తీరడంతో చిన్నారి ఆనందానికి అవధులు లేవు. స్థానికులు, బాలుని బంధుమిత్రులు ఈ తతంగాన్ని ఉత్సాహంగా తిలకించారు.
తండ్రి అడిగాడు: ఎస్పీ
ఎస్పీ మిథున్ మాట్లాడుతూ కుమారుని కోరిక గురించి తండ్రి మాకు చెప్పడంతో సంతోషంగా అంగీకరించాం, బాలుడు చాలా ఉత్సాహంగా డ్యూటీ చేశాడు, ఒక సిబ్బందికి సెలవు మంజూరు చేశాడని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment