నగరంలో ఏ రోడ్డు చూసినా రద్దీనే
సాక్షి బెంగళూరు: పద్మవ్యూహంలో చిక్కుకుని బయటపడొచ్చు, కానీ బెంగళూరు ట్రాఫిక్ రద్దీలో చిక్కుకుంటే బయటపడడం అంత సులభం కాదని ఐటీ నగర వాసులు చెప్పుకుంటారు. నిదానంగా సాగే వాహనాలు ఒకపక్క, రోడ్డు దాటేందుకు శ్రమించే సామాన్య ప్రజలు, అలాగే కిలోమీటర్ల కొద్ధీ నిలిచిపోయే వాహనాలు.. ఇది గత సంవత్సర కాలంలో బెంగళూరు ఔటర్ రింగ్‌రోడ్డులోని పరిస్థితి. వందలాది ఐటీబీటీ కంపెనీలు ఈ ఔటర్ రింగ్‌రోడ్డుకు సమీపంగా ఉండడంతో ఆయా కంపెనీల్లో పని చేసే ఉద్యోగులు నిత్యం నగర రోడ్లపై ట్రాఫిక్‌లో చిక్కుకుని నరకయాతన పడుతున్నారు. మరోవైపు మెట్రో రైల్వే నిర్మాణ పనులు కూడా జరుగుతుండడం ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తోంది.
సోమవారం కాగానే షురూ
సోమవారం ఉదయం 8 గంటలకు వాహనాల రద్దీ మొదలవుతుంది. మధ్యాహ్నం వరకు ఈ ట్రాఫిక్ ఒత్తిడి కొనసాగుతోంది. మంగళవారం, బుధవారం, గురువారాల్లో లక్షలాది వాహనాలతో కూడిన వాహన గజిబిజిని నియంత్రించడం ట్రాఫిక్ పోలీసులకు కష్టంగా మారుతోంది. వీకెండ్ మొదలయ్యే శుక్ర, శని, ఆదివారాల్లో కొంత రద్దీ తగ్గి ఉపశమనం కలుగుతుంది.
మెట్రో బ్లూ మార్గం రావాలి
2025 నాటికి మెట్రో బ్లూ మార్గం పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మెట్రో రైల్వే ఈ మార్గంలో ప్రారంభం అయితే 50 శాతం ట్రాఫిక్ తగ్గుముఖం పట్టొచ్చని అధికారులు భావిస్తున్నారు. మారతహళ్లి వంతెన వద్ద ఎదురయ్యే ట్రాఫిక్ రద్దీ వల్ల చుట్టుపక్కల రోడ్లపై వాహనాలు బారులు తీరుతున్నాయి. ఈ వంతెనకు ఒకవైపు మాత్రమే ఫుట్‌ఓవర్ బ్రిడ్జి ఉంది. మరోవైపు లేకపోవడంతో బారులు తీరిన ఆ వాహనాల మధ్య ప్రజలు రోడ్డు దాటేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
బస్టాపుల వద్ద ఇబ్బంది
అలాగే సిటీ బస్సులు ఆయా బస్టాప్‌ల వద్ద ప్రయాణికులను ఎక్కించుకుని, దించుకునే కొద్ది సమయం వల్ల కూడా వెనుక వచ్చే వాహనాలు రద్దీలో చిక్కుకుంటున్నాయి. టిన్ ఫ్యాక్టరీ వద్ద బీఎంటీసీ బస్సులు రోడ్డు నుంచి కొంచెం ఎడంగా వచ్చి నిలిచేలా బస్‌బేలను నిర్మించారు. అదేవిధంగా మారతహళ్లితో ఇతర ఔటర్ రింగ్‌రోడ్డు మార్గంపై కూడా బస్‌బేలను నిర్మిస్తే రద్దీ గొడవ తగ్గుతుందని డిమాండ్లు ఉన్నాయి. బెంగళూరు నగరం లోపలకి ట్రాక్టర్లకు అనుమతి లేదు, అయితే కొన్ని ప్రభుత్వ శాఖల ట్రాక్టర్లు బయట నుంచి నగరంలోకి వస్తుండడం కూడా ట్రాఫిక్ సమస్యకు కారణమవుతోంది. అలాగే నిషేధం ఉన్నా పగటి వేళ లారీలు తిరగడం గమనార్హం.
ట్రాఫిక్ రద్దీకి కొన్ని కారణాలు
ఐటీబీటీ కంపెనీల ఉద్యోగులు వర్క్‌ఫ్రం హోంను వదిలేసి ఆఫీసులకు రాకపోకలు సాగిస్తున్నారు.
నమ్మ మెట్రో రైల్వే నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో నిర్మాణ పనులు జరిగే రోడ్లను అక్కడక్కడ మూసివేయడం లేదా పాక్షికంగా కొద్ది భాగం మూసివేశారు.
నగర రోడ్లపై అక్కడక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ సరిగ్గా పని చేయడం లేదు. దీంతో వాహనదారులు ఇష్టానురీతిగా వాహనాలను నడుపుతుంటారు
పార్కింగ్ వసతి లేదని పలు రద్దీ రోడ్లలో వాహనాలను రోడ్లపైనే పార్క్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment