కాబోయే వైద్యురాలు కాటికి
పీజీ మెడికోకు డెంగీ జ్వరం
అదే కాలేజీలో అరకొర వైద్యం
పరిస్థితి విషమించి కన్నుమూత
సుళ్యలో వైఎస్సార్ జిల్లా యువతి విషాదాంతం
బనశంకరి: మంగళూరులో మెడిసిన్ పీజీ చదువుతున్న వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్ల కు చెందిన వైద్య విద్యార్థిని డెంగీ జ్వరంతో మరణించింది. ఎర్రగుంట్ల మాజీ జడ్పీటీసీ సభ్యురాలు పీ.మాధురి, వెంకట రమణారెడ్డి కుమార్తె పడిగపాటి సజని (27) మంగళూరు వద్ద సుళ్యలో కేవీజీ మెడికల్ కాలేజీలో గైనకాలజీలో పీజీ విద్యార్థిని. 18న సజనికి జ్వరం రావడంతో అదే మెడికల్ కాలేజీలోనే వైద్యం చేయించుకుంది. డెంగీ అని నిర్ధారణ కాగా ప్లేట్‌లేట్స్ తగ్గిపోయాయి.
సరైన వైద్యం అందించకపోవడంతో ప్లేట్‌లేట్స్ బాగా తగ్గి సజని ఆరోగ్యం విషమించింది. కాలేజీ సిబ్బంది ఆలస్యంగా తల్లిదండ్రులకు చెప్పడంతో హైదరాబాద్ నుంచి మంగళూరుకు బయలుదేరారు. కానీ సజని ఆరోగ్య విషయంలో కాలేజీ డాక్టర్లు చేతులెత్తేసి మెరుగైన వైద్యం కోసం మంగళూరుకు వెళ్లాలని సూచించారు. దీంతో వైద్యసిబ్బంది ఆమెను మంగళూరుకు తరలిస్తుండగా మార్గమధ్యలో కోమాలోకి చేరుకుంది. తల్లిదండ్రులు మంగళూరుకు వెళ్లి కోమాలో కొన ఊపిరితో ఉన్న కుమార్తె ను చూసి తల్లడిల్లిపోయారు. చివరి మాటలకు కూడా నోచుకోలేదని విలపించారు. 21 తేదీ మధ్యాహ్నం 2 గంటలకు కన్నుమూసిందని తల్లిదండ్రులు తెలిపారు.
స్పందన లేని వైద్యులు
తమ బిడ్డకు సరిగా వైద్యం చేయలేదని తల్లిదండ్రులు మంగళూరు నార్త్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కాలేజీకి వెళ్లి విచారణ జరిపారు. సజనికి ట్రీట్‌మెంట్ గురించి వైద్యులు సరైన సమాధానం చెప్పలేదని తల్లిదండ్రులు ఆరోపించారు. అదివారం తెల్లవారుజామున స్వగ్రామం పోట్లదుర్తికి మృతదేహాన్ని తీసుకువచ్చి మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించారు.
త్వరలో కోర్సు పూర్తి..
సజని చదువులో మంచి ప్రతిభాశాలి. ఇంటర్ పూర్తయిన తరువాత మొదటి ప్రయత్నంలోనే ఎంబీబీఎస్ సీటును హైదరాబాదులోని గాంధీ మెడికల్ కాలేజీలో సంపాదించింది. తరువాత సుళ్యలో పీజీ కోర్సు చివరి ఏడాది చేస్తోంది. ఆమె మరణంతో తల్లిదండ్రులు, గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. త్వరలో ఎంఎస్ పూర్తి చేసుకుని వస్తుందని కోటి ఆశలతో ఉన్న తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ వైద్య విద్యార్థినికే కనీస వైద్యం అందించకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment