కట్న పిశాచికి బలి
దొడ్డబళ్లాపురం: ఎన్నో ఆశలతో మెట్టినింటికి వస్తే, వరకట్నం వేధింపులకు వివాహిత బలైన సంఘటన దొడ్డ తాలూకా గుమ్మనహళ్లిలో చోటుచేసుకుంది. రూప (29) మృతురాలు. ఆమెకు రెండేళ్ల క్రితం గుమ్మనహళ్లికి చెందిన సురేశ్ అనే వ్యక్తితో పెళ్లయింది. తగినంత కట్న కానుకలు ఇచ్చారు. సురేశ్ దొడ్డ తాలూకా సాసలు గ్రామ పంచాయతీ కార్యాలయంలో డాటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. కొన్నినెలలుగా మరింత డబ్బు తీసుకురావాలని రూపను సురేశ్, అతని కుటుంబ సభ్యులు వేధిస్తున్నారు. ఆవేదన చెందిన రూప డెత్‌నోట్ రాసి ఉరి వేసుకుంది. తన చావుకు భర్త సరేశ్, అత్త దేవమ్మ, మామ నరసింహమూర్తి కారణమని పేర్కొంది. దొడ్డ బెళవంగల పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
స్టార్టప్‌లకు పెద్దపీట
● టెక్ సమ్మిట్‌లో మంత్రి ప్రియాంక్ ఖర్గే
సాక్షి, బెంగళూరు: విద్యార్థుల్లో వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో ఆసక్తి రేకెత్తించేందుకు 100 కళాశాలలను నగరంలోని 100 పారిశ్రామిక సంస్థలు దత్తత తీసుకుంటాయని ఐటీ బీటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే తెలిపారు. మూడు రోజుల బెంగళూరు టెక్ సమ్మిట్ ముగింపు సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. కర్ణాటకలో కావాల్సినంత మానవ వనరులు ఉన్నాయని, విద్యార్థుల్లో వ్యాపార దక్షత, పారిశ్రామిక రంగంపై మక్కువ పెంచాలని తెలిపారు. ఇందుకు కాలేజీలను 100 పారిశ్రామిక సంస్థలు దత్తత తీసుకుని వారిలో నిర్వహణ, వ్యాపార దక్షతలను వృద్ధి చేస్తాయని చెప్పారు. టెక్ సమ్మిట్‌లో 51 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. 521 మంది వక్తలు ప్రసంగించారు. 21,372 మంది పాల్గొన్నారని మంత్రి తెలిపారు. బెంగళూరు బయట జిల్లాల్లో సుమారు 10 వేల స్టార్టప్‌లను ప్రారంభించేలా ఆలోచన చేస్తున్నట్లు, రానున్న ఐదేళ్లలో స్టార్టప్‌లకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. డిసెంబర్ 9–12 తేదీల మధ్య ఇండస్ ఎంటర్‌ప్రెన్యూర్ సదస్సులను బెంగళూరు, మైసూరులో నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
రెండు ఉద్యోగాల చీటర్‌పై కేసు
మైసూరు: నిబంధనలకు విరుద్ధంగా రెండు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న మోసగానిపై కేసు నమోదైంది. గత 20 ఏళ్లుగా ముడా, నగర పాలికెల్లో రెండు చోట్ల షిఫ్టుల వారీగా పని చేసి రెండు చోట్ల వేతనాలు పొందిన బీకే కుమార్‌పై మైసూరు వీవీపురం పోలీసు స్టేషన్‌లో నీటి సరఫరా మండలి ఈఈ చీటింగ్ కేసు పెట్టారు. రెండు ఉద్యోగాల బాగోతం తెలియగానే ఇటీవల ఉద్యోగం నుంచి తీసేశారు. ఎలా రెండుచోట్ల ఉద్యోగాలు పొందాడు, దీని వెనుక ఎవరున్నారు అనేది దర్యాప్తు చేయనున్నారు.
తుంగభద్రకు కొత్త గేట్లు?
● నేడు బోర్డు సమావేశం
హొసపేటె: కర్ణాటక, తెలుగు రాష్ట్రాలకు వరదాయిని అయిన తుంగభద్ర రిజర్వాయర్‌కు కొత్త గేట్ల ఏర్పాటుపై నేడు గురువారం జరిగే టీబీ డ్యాం బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశముంది. భేటీ హోస్పేట్‌లో చైర్మన్ ఎస్.ఎన్.పాండే నేతృత్వంలో జరగనుంది. మూడు రాష్ట్రాల నీటిపారుదల అధికారులు పాల్గొంటారు. రిజర్వాయర్ క్రస్ట్‌గేట్ల పటిష్టత అధ్యయనానికి నిపుణుల సంఘాన్ని నియమించేందుకు తుంగభద్ర బోర్డు సమావేశం ఆమోదం తెలిపింది. ఈ సంఘం ఇచ్చే నివేదిక ఆధారంగా గేట్ల మార్పుపై నిర్ణయం తీసుకోవచ్చు. ఇటీవల డ్యాం 19వ గేటు కొట్టుకుపోవడం తెలిసిందే. దీంతో వారంరోజులకు పైగా శ్రమించి స్టాప్‌లాగ్ గేటును అమర్చారు. ఢిల్లీ నుంచి సాంకేతిక బృందం వచ్చి పరిశీలించి గేట్లను మార్చాల్సిందేనని సూచించారు. 70 ఏళ్ల కిందట డ్యాం నిర్మించినప్పుడు ఉన్న గేట్లు అలాగే కొనసాగుతున్నాయి.
కట్న పిశాచికి బలి
Comments
Please login to add a commentAdd a comment