ఆస్పత్రుల్లో వసతులు కల్పించాలని ధర్నా
బళ్లారిఅర్బన్: జిల్లా కేంద్రంలోని బీఎంసీఆర్‌సీ, జిల్లా ఆస్పత్రి, జిల్లాలోని అన్ని ప్రాథమిక, ఉప ఆరోగ్య కేంద్రాల్లో కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎస్‌యూసీఐ ఆధ్వర్యంలో జిల్లాధికారి కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఎస్‌యూసీఐ నేత రాధాకృష్ణ ఉపాధ్య మాట్లాడుతూ రోగులు ప్రభుత్వ ఆస్పత్రులకు వెళితే కనీస సౌకర్యాలు అందడం లేదన్నారు. నాణ్యమైన మందులు కరువయ్యాయన్నారు. బాలింతల మరణాలు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలన్నారు. లేకుంటే తీవ్ర పోరాటం చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. సంఘం ప్రముఖులు దేవదాస్, సోమశేఖర్‌గౌడ, మంజుల, డాక్టర్ ప్రమోద్, గోవింద్ ఈశ్వరి, జగదీశ్, రవికుమార్, సురేష్, ఈరణ్ణ తదితరులు పాల్గొన్నారు.
పరీక్షల భయంతో
విద్యార్థి ఆత్మహత్య
సాక్షి,బళ్లారి: వచ్చే నెల 21వ తేదీన జరగనున్న 10వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమోననే భయంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదం నింపింది. గురువారం రాత్రి చిత్రదుర్గ నగరంలోని తమటెకల్లు రోడ్డులో నివాసం ఉంటున్న రాకేష్(15) పరీక్షల భయంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా విద్యార్థి ఆత్మహత్యతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమోననే భయం ఉండటంతో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఈ ఘటనపై చిత్రదుర్గం కోట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాలూకా కసాప సమ్మేళన అధ్యక్షుడిగా అయ్యప్పయ్య
రాయచూరు రూరల్: తాలూకా కన్నడ సాహిత్య పరిషత్(కసాప) 6వ సమ్మేళన అధ్యక్షుడిగా అయ్యప్పయ్య హుడా ఎన్నికై నట్లు తాలూకా కసాప అధ్యక్షుడు వెంకటేష్ బేవినబెంచి తెలిపారు. శుక్రవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్చి 6న నగరంలోని పండిత సిద్దరామ జంబలదిన్ని రంగ మందిరంలో కార్యక్రమాలను నాడోజ చెన్నబసప్ప ప్రారంభిస్తారన్నారు. విలేఖర్ల సమావేశంలో అశోక్ కుమార్ జైన్, రేఖ, దేవేంద్రమ్మ, ప్రతిభ, అన్వర్‌లున్నారు.
ఉద్యోగుల తొలగింపుపై చర్యకు సూచన
బనశంకరి: మైసూరు ఇన్ఫోసిస్ సంస్థ నుంచి 400 మంది ట్రైనీ ఉద్యోగులను ఈనెల 7న తొలగించిన వైనంపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర కార్మిక శాఖకు సూచించింది. ఐటీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇన్ఫోసిన్ మైసూరు క్యాంపస్‌లో జరుగుతున్న ఉద్యోగుల తొలగింపుపై కేంద్రప్రభుత్వం స్పందించింది. కేంద్ర కార్మిక ఉద్యోగ మంత్రిత్వ శాఖ ఈ విషయం పరిష్కారానికి అత్యవసర చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖకు సూచించింది. కేంద్ర కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి వచ్చిన లేఖతో రాష్ట్ర కార్మిక శాఖ జోక్యం చేసుకుని ఈ వివాదాన్ని పరిష్కరించాలని ప్రభుత్వానికి సూచించింది.
తాగునీటి సమస్య తలెత్తనీయొద్దు
హొసపేటె: నియోజకవర్గంలో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే హెచ్‌ఆర్ గవియప్ప సూచించారు. శుక్రవారం తాలూకా పంచాయతీ సభాంగణంలో జరిగిన త్రైమాసిక కేడీపీ ప్రగతి సమీక్ష సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. విజయనగర నియోజకవర్గ ప్రగతి పనులను సమీక్షించి సలహాలు ఇచ్చారు. వార్డులు, గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అభివృద్ధిపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. రానున్న బడ్జెట్‌లో నిత్యావసర పనుల మంజూరుకు వినతిపత్రం అందజేస్తామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి దశలో ఉన్నందున రాష్ట్రం నుంచి వచ్చే గ్రాంట్ పక్కదారి పట్టకుండా చూసుకోవాలన్నారు. ఉద్యానవన శాఖ ద్వారా ఉచితంగా కూరగాయల విత్తనాలు, ఎరువులు పంపిణీ చేశారు. తాలూకా పంచాయతీ ద్వారా మహిళా సంఘాల ప్రతినిధులకు ఏకరూప దుస్తులు, గుర్తింపు కార్డులు అందజేశారు. నగర అసిస్టెంట్ కమిషనర్ వివేకానంద, తహసీల్దార్ శృతి, టీపీ ఈఓ లక్ష్మికాంత్ పాల్గొన్నారు.
ఆస్పత్రుల్లో వసతులు కల్పించాలని ధర్నా
ఆస్పత్రుల్లో వసతులు కల్పించాలని ధర్నా
Comments
Please login to add a commentAdd a comment