అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు తగదు
రాయచూరు రూరల్ : కొప్పళ జిల్లాలో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుతో పాటు ఎంఎస్‌పీఎల్ బల్డోటా తదితర 50 కంపెనీలను ఏర్పాటు చేయడం తగదంటూ ప్రజలు ఆందోళన చేపట్టారు. జిల్లాలోని గంగావతి తాలూకా హిరేబెణకల్, చిక్కబెణకల్ గ్రామాల వద్ద చేపట్టనున్న విద్యుత్ యూనిట్ ఏర్పాటుకు గ్రామస్తులు మూకుమ్మడిగా అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం యూనిట్ల ఏర్పాటును బహిరంగంగా వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మహంతేష్, డీహెచ్ పూజార్, మంజునాథ్, రఘు, హన్మంతప్ప, మూకప్ప, రామణ్ణ, రుద్రప్ప, శివప్పలున్నారు.
బైక్ చోరుని అరెస్ట్
హుబ్లీ: బైక్ చోరీ కేసులో మంటూరు రోడ్డు నివాసి నూర్ అహ్మద్ మిర్జీ (30)ని అరెస్ట్ చేసిన హుబ్లీ టౌన్ పోలీసులు బైక్‌ను జప్తు చేశారు. నిందితుడు దుర్గదబైలు కలాదగి వీధి నివాసి అజయ్ ఇంటి ఎదుట నిలిపిన బైక్‌ను చోరీ చేసి పరారయ్యాడు. ఘటనపై టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడిని జేసీ నగర్ రోడ్డులో అరెస్ట్ చేశారు. కాగా మరో ఘటనలో బంకాపుర చౌక్ దగ్గర బస్టాండ్‌లో బస్సు ఎక్కే వేళలో యల్లాపుర వీధి నివాసి లలిత కుసుగల్ అనే మహిళ బ్యాగ్‌లో పెట్టిన రూ.1.45 లక్షల విలువ చేసే బంగారు చైన్ చోరీపై గంటికేరి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. లలిత సవణూరులో బంధువుల ఇంటికి వెళ్లడానికి బస్టాండ్‌కు వచ్చారు. ఈ క్రమంలో బస్సు ఎక్కి బ్యాగ్ చూసుకోగా అందులో ఉన్న బంగారు చైన్ చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా మరో ఘటనలో పాత హుబ్లీ తిమ్మసాగర రోడ్డులో మారణాయుధాలను పట్టుకొని తిరుగుతున్న ధార్వాడ రోడ్డు శివశంకర కాలనీ నివాసి సాగర్ బిలానను పాత హుబ్లీ పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేసుకున్నారు.
సిలిండర్ల విక్రయం..
ఐదుగురిపై కేసు
హుబ్లీ: తాలూకాలోని చెన్నాపుర గ్రామంలో ఓ షెడ్‌లో అనుమతి లేకుండా ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకుండా నియమాలను ఉల్లంఘిస్తూ వంట గ్యాస్ సిలిండర్లను విక్రయిస్తున్న ఐదుగురిపై హుబ్లీ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పాత హుబ్లీ ఈశ్వర్ నగర్ రఫీక్, ప్రకాష్, జాఫర్, శంషుద్దీన్, రవి బంకాపురలపై ఆహార పౌర సరఫరాల శాఖ అధికారులు ఈ ఫిర్యాదు చేశారు. అక్రమంగా సిలిండర్లను విక్రయిస్తున్నారని అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఆహార పౌర సరఫరాల శాఖ అధికారులు పోలీసులతో కలిసి దాడి చేసి నిందితులపై చర్యలు తీసుకున్నారు.
గుర్తు తెలియని మహిళ మృతదేహం
రాయచూరు రూరల్: తాలూకాలోని యాపలదిన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభించింది. కత్తితో గొంతు కోసి హత్య చేసి సంచిలో చుట్టి వాహనంలో తెచ్చి శుక్రవారం రాత్రి చంద్రబండ వద్ద పొలంలో పడేసినట్లు తెలిసింది. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఉపాధ్యాయ డిప్యుటేషన్ల రద్దుకు వినతి
రాయచూరు రూరల్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహించే ఉపాధ్యాయులను బదిలీ చేస్తూ జారీ చేసిన డిప్యుటేషన్ ఆదేశాలను రద్దు చేయాలని జయ కర్ణాటక సంఘం డిమాండ్ చేసింది. శనివారం కళ్యాణ కర్ణాటక ప్రాంత అభివృద్ధి మండలి అధ్యక్షుడు అజయ్‌సింగ్‌కు జిల్లాధ్యక్షుడు శివకుమార్ యాదవ్ వినతిపత్రం సమర్పించి మాట్లాడారు. హైస్కూలులో విధులు నిర్వహించే ఉపాధ్యాయులను కార్యాలయాల్లో పనులకు వినియోగించుకోవడం తగదన్నారు. 10వ తరగతి విద్యార్థులకు గణితం, ఇంగ్లిష్, సాంఘీక, సామాన్య శాస్త్రం పాఠాలు బోధించే వారికి ఇలాంటి విధులు ఇవ్వడంతో ఉత్తీర్ణత శాతం తగ్గుతుందన్నారు. డిప్యుటేషన్ల నుంచి విడుదల చేసి పాఠశాలల్లో విధులకు హాజరయ్యేలా ఆదేశాలను జిల్లా విద్యాశాఖాధికారి బడిగేరకు జారీ చేయాలని కోరారు.
నిందితులనుకఠినంగా
శిక్షించాలని ధర్నా
రాయచూరు రూరల్ : మహిళలు, విద్యార్థినులపై లైంగిక దాడులకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని అఖిల భారత జనవాది మహిళా సంఘం, సీపీఐ(ఎం) డిమాండ్ చేశాయి. శనివారం తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంఘం కార్యకర్తలు పద్మ, వీరేష్ మాట్లాడారు. రెండో తరగతి బాలికపై అత్యాచారం జరిగిన పోత్నాళలోని ప్రైవేట్ పాఠశాల లైసెన్సును రద్దు చేయాలని కోరారు. బాధితులకు సత్వరం పరిహారం అందించాలని తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఆదర్శ పాఠశాలలో ప్రవేశానికి
దరఖాస్తుల ఆహ్వానం
హుబ్లీ: ధార్వాడలోని ఆదర్శ విద్యాలయంలో 2025–26వ సంవత్సరంలో 6వ తరగతిలో 120 మంది విద్యార్థుల దాఖలు కోసం ప్రవేశ పరీక్షలకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానించారు. ప్రవేశ పరీక్ష దరఖాస్తుల దాఖలుకు ఈ నెల 23 చివరి తేదీ అని, మరిన్ని వివరాలకు బెబ్‌సైట్ లేదా 9741779832లో సంప్రదించాలని ఆ విద్యాలయ ప్రధానోపాధ్యాయులు ఓ ప్రకటనలో తెలిపారు.
అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు తగదు
Comments
Please login to add a commentAdd a comment