త్వరలో చెరువుల భర్తీ పథకం ప్రారంభం
హొసపేటె: చెరువులను నింపే పథకానికి త్వరలో శ్రీకారం చుట్టనున్నామని ఎమ్మెల్యే డాక్టర్ ఎన్‌టీ శ్రీనివాస్ తెలిపారు. శనివారం రామసాగర హట్టి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు రూ.1 కోటి 50 లక్షలతో మౌలిక వసతులు, అదనపు గదుల నిర్మాణానికి భూమి పూజ చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తాలూకాలోని హుడెం గ్రామంలో చెరువుల పూడికతీత, తైకాన గ్రామం నుంచి హుడెం గ్రామం వరకు రూ.8.07 కోట్లు, లోకికెరె గ్రామం ఎస్సీ కాలనీలో రూ.35 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైయిన్ల నిర్మాణం చేపడతామన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
జీపీ అధ్యక్షుడిగా సిద్దనగౌడ
హొసపేటె: తాలూకాలోని కానాహొసహళ్లి గ్రామంలో అవిశ్వాస తీర్మానంతో ఖాళీ అయిన అధ్యక్ష పదవికి శనివారం జరిగిన ఎన్నికల్లో కేజీ.సిద్దనగౌడ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. గ్రామ పంచాయతీ అధ్యక్ష పదవికి కేజీ సిద్దనగౌడ, ఏ.నాగరాజు నామినేషన్ పత్రాలు సమర్పించగా మొత్తం 30 మందికి గాను 27 మంది సభ్యులు హాజరయ్యారు. కేజీ సిద్దనగౌడకు 23 ఓట్లు, ఏ.నాగరాజుకు 4 ఓట్లు లభించాయి. తద్వారా అధ్యక్షుడిగా కేజీ సిద్దనగౌడ ఎన్నికై నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, తహసీల్దార్ ఎం.రేణుక ప్రకటించారు. ఎన్నికల సహాయకులు శివకుమారగౌడ, వాసు, పీడీఓ వినయ్‌కుమార్, కార్యదర్శి నాగరాజు, బిల్ కలెక్టర్లు కేజీ నాగరాజు, శశికుమార్ తదితరులు ఉన్నారు. అధ్యక్షుడిగా కేజీ సిద్దనగౌడ ఎన్నిక కావడంతో గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట బాణసంచా పేల్చి నాయకులు, యువకులు మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు.
స్వయం ఉపాధికి
నైపుణ్యత దోహదం
బళ్లారిటౌన్: నిరుద్యోగులు స్వయం ఉద్యోగం ఏర్పాటు చేసుకొనేందుకు సృజనాత్మక నైపుణ్యత దోహదపడుతుందని జెడ్పీ సీఈఓ రాహుల్ శరణప్ప సంకనూరు పేర్కొన్నారు. శనివారం కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉద్యోగుల ట్రైనింగ్ సంస్థ ఆవరణలో ఏర్పాటు చేసిన 30 రోజుల బ్యూటిపార్లర్ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుతం మహిళలు సౌందర్యం కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఇందుకోసం బ్యూటీటిపార్లర్‌కు మంచి డిమాండ్ ఉందన్నారు. నిరుద్యోగ మహిళలు ఇలాంటి శిక్షణా కార్యక్రమాలను సద్వినియోగ పరచుకోవాలన్నారు. దీని వల్ల మహిళలు తమ కుటుంబ జీవితం ఆర్థికంగా పెంపొందేందుకు దోహద పడుతుందన్నారు. ఈ సందర్భంగా 34 మంది శిబిరార్థులకు బ్యూటీపార్లర్ కిట్లను అందజేశారు. జెడ్పీ ఉపకార్యదర్శి గిరిజా శంకర్, వివిధ అధికారులు వినోద్, బసవరాజ్ హిరేమఠ, రాజేంద్ర, రఘువర్మ, ఉపన్యాసకులు జడియప్ప, దినేష్, సిద్దలింగమ్మ పాల్గొన్నారు.
నకిలీ జర్నలిస్టుల
బెడద అరికట్టండి
హొసపేటె: విజయనగర జిల్లాలో నకిలీ జర్నలిస్టుల బెడదను అరికట్టాలని వర్కింగ్ జర్నలిస్టుల సంఘం తాలూకా శాఖ తరపున శనివారం గ్రేడ్– 2 తహసీల్దార్ నేత్రావతి ద్వారా జిల్లాధికారికి వినతిపత్రం అందించారు. వర్కింగ్ జర్నలిస్టుల సంఘం తాలూకా అధ్యక్షుడు మంజు మయూర మాట్లాడుతూ తాలూకాలో వర్కింగ్ జర్నలిస్టుల కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయన్నారు. తమ పేరు మీద ఉన్న గుర్తింపు కార్డు (ఐడీ కార్డు)ను చూపించి ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి ప్రశ్నలు వేసి సమాచారం సేకరిస్తున్నానని బెదరించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. మరి కొందరు తాలూకా స్థాయి కార్యాలయాలు, ఆసుపత్రుల్లో కాంట్రాక్టర్లు చేస్తున్న అభివృద్ధి పనులను వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని తెలిపారు.
త్వరలో చెరువుల భర్తీ పథకం ప్రారంభం
త్వరలో చెరువుల భర్తీ పథకం ప్రారంభం
త్వరలో చెరువుల భర్తీ పథకం ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment