అభివృద్ధి బాధ్యత ప్రతి ఒక్కరిదీ
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటక భాగంలో విద్య, ఆరోగ్యం విషయాలకు తోడు అభివృద్ధి విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతతో నడుచుకోవాలని కళ్యాణ కర్ణాటక ప్రాంత అభివృద్ధి మండలి అధ్యక్షుడు అజయ్ సింగ్ పిలుపునిచ్చారు. శనివారం రాయచూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం జగజ్యోతి బసవేశ్వర, అంబేడ్కర్ భవనంలో విద్యాభ్యాసం–పాలకుల భాగస్వామ్యం అనే అంశంపై జరిగిన ముగింపు సదస్సులో విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు విద్యారంగంలో మార్పులకు పరిశోధనలు, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి పరుచుకోవాలన్నారు. విద్యారంగం కోసం రూ.30 కోట్లతో 1008 పాఠశాలల్లో నర్సరీ తరగతుల్లో 42 వేల మంది విద్యార్థులు చేరారన్నారు. వంద పబ్లిక్ పాఠశాలను ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో శాసన సభ్యుడు బసనగౌడ, విద్యాశాఖ డైరెక్టర్ మమత, విద్యా కమిటీ అధ్యక్షురాలు చాయ దేవగాంవకర్, సభ్యులు పాటిల్, ఖదీర్, మల్లికార్జున, బాష్యుం, రుద్రేష్, యశవంత్, నాగబాయి, బుళ్లా, కలబుర్గి డివిజన్ విద్యా శాఖ కమిషనర్ ఆకాష్, వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ హనుమంతప్ప, జిల్లాధికారి నితీష్, జెడ్పీ సీఈఓ రాహుల్ తుకారం పాండే, విద్యా శాఖాధికారులు బడిగేర, ఇందిర, చంద్రశేఖర్, రంగస్వామిలున్నారు.
ఆరోగ్య కమిషనరేట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు
కళ్యాణ కర్ణాటక అభివృద్ధిలో భాగంగా రాయచూరులో ఆరోగ్య కమిషనరేట్ కార్యాలయం ఏర్పాటుకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపినట్లు కళ్యాణ కర్ణాటక ప్రాంత అభివృద్ధి మండలి అధ్యక్షుడు అజయ్‌సింగ్ వెల్లడించారు. శనివారం రాయచూరు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కళ్యాణ కర్ణాటక అభివృద్ధికి ప్రభుత్వం రూ.5 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్య ఆవిష్కార పథకంలో రూ.857 కోట్ల నిధులు సేకరించినట్లు తెలిపారు. 18 నూతన తాలూకా కేంద్రాలకు మినీ విధానసౌధలను నిర్మిస్తున్నట్లు వివరించారు.
ప్రాంతీయ పత్రికలకు ప్రకటనలివ్వరూ.!
కళ్యాణ కర్ణాటకలోని జిల్లాల్లోని ప్రాంతీయ పత్రికలకు ప్రకటనలివ్వాలని పత్రికా సంపాదకుల సంఘం డిమాండ్ చేసింది. శనివారం వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కళ్యాణ కర్ణాటక అభివృద్ధి మండలి అధ్యక్షుడు అజయ్‌సింగ్‌కు జిల్లాధ్యక్షుడు చెన్నబసవ వినతిపత్రం సమర్పించి మాట్లాడారు. వార్త ప్రచార శాఖ ఆధీనంలో పని చేసే అధికారులకు కేకేఆర్‌డీబీ నుంచి రాజ్యాంగంలోని అర్టికల్–371(జె) ప్రకారం ప్రకటనలు ఇవ్వడానికి ఆదేశాలు జారీ చేయాలన్నారు. ఆందోళనలో లక్ష్మణరావ్, బసన గౌడ, ప్రభాకర్, ఖాన్ సాబ్ మోమిన్, ఖాజా హుసేన్‌లున్నారు.
Comments
Please login to add a commentAdd a comment