నేడు నీరమాన్వి యల్లమ్మ దేవి జాతర
రాయచూరురూరల్: మాన్వి తాలుకా నీరమాన్విలో కొలువైన యల్లమ్మ దేవి జాతర ఉత్సవాలు సోమవారం ఘనంగా జరగనున్నాయి. ఈమేరకు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. రాయచూరు జిల్లాతోపాటు వివిధ జిల్లాలనుంచి భక్తులు తరలిరానున్నారు.గంగావతి తాలూకాలో కొలువైన హులిగమ్మ, రాయచూరు తాలుకా అరోలిలో కొలువైన హులిగమ్మ, సవదత్తి యల్లమ్మ అమ్మవార్ల తరహాలోనే మాన్వి తాలుకా నీరమాన్వి రే ణుకా యల్లమ్మ భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్నారు. ఊదో ఊదో అని అమ్మవారిని ప్రార్థిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. దాదాపు 200 సంవత్సరాలుగా అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి. సోమవారం సాయంత్రం అమ్మవారి రథోత్సవం జరగనుంది. అంతకుముందు వేకువజాము నుంచి ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహిస్తారు.
అమ్మవారి ఆలయ చరిత్ర
200 సంవత్సరాల క్రితం కొందరు ఎడ్ల వ్యాపారులు మాన్వి నుంచి రాయచూరుకు వెళ్తూ రాత్రి సమయంలో నీరమాన్వి వద్ద బస చేశారు. ఎడ్లను అక్కడే ఉన్న ఒక రాతికి కట్టి వేశారు. మరుసటి రోజ ఉదయం వ్యాపారులు చూపు కోల్పోయారు. ఏమైందో తెలియక ఆందోళనతో ఉండగా తాను యల్లమ్మదేవినని, తాను కొలువైన రాతికి ఎడ్లను కట్టి వేశారని, అందుకే మీకు చూపు పోయిందని ఆకాశం నుంచి ఒక గొంతు వినిపించింది. తమకు తెలియక పొరపాటు చేశామని, కానుకలు సమర్పిస్తాము, కాపాడాలని అమ్మవారిని ప్రార్థించారు. దీంతో అమ్మవారు వారికి చూపును ప్రసాదించింది. అనంతరం వ్యాపారులు అమ్మవారికి ఆలయం నిర్మించారు. అప్పటినుంచి ఏటా అమ్మవారికి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా మారింది. అమ్మవారి మహత్యంతో కోర్కెలు నేరవేరుతుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి దర్శించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment