వాహనదారుకు సంకటం
సాక్షి,బళ్లారి: ఎవరూ అడిగే వారు లేకపోతే ఏ రంగంలోనైనా మోసాలు షరా మామూలే. ఇటీవల పెట్రోలు బంకు యజమానులు లేదా పెట్రోలు సరఫరా చేసే కంపెనీలో తెలియదు కాని, పవర్ పెట్రోలు బంకు పేరుతో అధిక ధరలు ప్రకటించి మరీ వినియోగదారుల నుంచి గుంజుతున్నారు. ప్రతి నిత్యం, ప్రతి ఇంటా పెట్రోలు లేకపోతే ఏ పని గడవని నేటి రోజుల్లో పెట్రోలు బంకుల్లో పవర్ పెట్రోలు పేరుతో లీటరుకు రూ.7లకు పైగా పెంచుతూ వినియోగదారులను ముంచుతున్నారు. నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న వందలాది పెట్రోలు బంకుల్లో నెలలో కనీసం రెండు రోజులు లేదా మూడు రోజులు పవర్ పెట్రోలు వేస్తున్నట్లు బోర్డులు పెట్టి మరీ వసూలు చేస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వం నిర్ణయించిన లీటరు పెట్రోలు ధర రూ.104 అయితే పవర్ పెట్రోలు వేస్తున్నామని వినియోగదారుల నుంచి ఏకంగా రూ.111లకు పైగా వసూలు చేస్తున్నారు. దీంతో గత్యంతరం లేక ద్విచక్ర వాహనాల్లో వెళ్లేవారు, కార్లలో వెళ్లేవారు పవర్ పెట్రోలు వేయించుకుంటున్నారు. అసలే కొన్ని పెట్రోలు బంకుల్లో ప్రతి లీటరులో కూడా కనీసం 100 ఎంఎల్ తక్కువ వేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీనికి తోడు ప్రస్తుతం పవర్ పెట్రోలును తెరపైకి తెస్తూ మోసాలు చేస్తున్నారు.
ధర ఎడాపెడా పెంచుతున్న ప్రభుత్వాలు
ప్రభుత్వాలు జీఎస్‌టీ పేరుతో విపరీతంగా పెట్రోలు ధరను పెంచుతూ వినియోగదారుల నడ్డి విరుస్తున్నాయి. కర్ణాటకలో రూ.100లు లీటరు పెట్రోలు ధర ఉండగా, ఏడాది క్రితం లీటరకు రూ.4లు పెంచడంతో ప్రభుత్వం నిర్ణయించిన పెట్రోలు ధర లీటరు రూ.104కు చేరుకుంది. పెట్రోలు ధరలు పెంచడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో పెట్రోలు బంకు యజమానులు పవర్ పెట్రోలు వేస్తున్నామని చెబుతూ లీటరుకు రూ.7ల ధరను అధికంగా పెంచడంతో వినియోగదారులు ఎవరికి చెప్పుకోవాలో దిక్కు తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఇక బంకు యజమానులు ఆడిందే ఆట పాడిందే పాటగా పెట్రోలు ధరలను ఎడాపెడా పెంచుకుంటూ పెద్ద ఎత్తున, గుట్టు చప్పుడు కాకుండా అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పవర్ పెట్రోలు నిరంతరంగా వేయించుకుంటేనే వాహన ఇంజన్లకు బాగుంటుందని, ఎప్పుడో ఒకసారి వేయించుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదని పెట్రోలు బంకుల్లో పనిచేసే నిపుణులు కూడా చెబుతున్నారు. ఈనేపథ్యంలో ఎవరి స్వప్రయోజనాల కోసం పవర్ పెట్రోలును నెలలో మూడు రోజులు పెట్రోలు బంకులు సరఫరా చేస్తున్నాయని వినియోగదారులు ఽమండిపడుతున్నారు.
ఏ పెట్రోలో ఎలా తెలుస్తుంది?
పవర్ పెట్రోలు బోర్డులు పెట్టిన వారు అసలు పవర్ పెట్రోలు వేస్తున్నారా లేక మామూలు పెట్రోలు వేస్తున్నారో వినియోగదారులకు ఎలా తెలుస్తుందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెలలో మూడు రోజుల పాటు పవర్ పెట్రోలు పేరుతో పెద్ద ఎత్తున వినియోగదారుల జేబులకు చిల్లులు పడేలా చేస్తున్నారని, ఇది పెద్ద ఎత్తున మోసం అంటూ వినియోగదారులు బాహాటంగా పెట్రోలు బంకుల వద్ద గొడవలు పడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మీ ఇష్టమైతే వేయించుకోండి, లేకపోతే వెళ్లిపోండి అని కూడా పెట్రోలు వేసే వారు చెబుతుంటారు. దీనికి ఒకటే కారణమని, పెట్రోలు అయిపోయిన తర్వాత వాహనం బంకు వద్దకు వస్తే ఎంత ధర అయినా పెట్రోలు పోసుకుని వెళతారని వారికి తెలుసు కాబట్టి తమ మోసాలను ఎవరూ అడగరని ధీమాతో ధర పెంచేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సంబంధిత అధికారులకు మామూళ్లు ఇస్తూ పవర్ పెట్రోలు పేరుతో వినియోగదారులకు మోసం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు తనిఖీ చేసి వినియోగదారులకు మేలు చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఆ పెట్రోలు పేరుతో బంకుల్లో
మోసాలకు పాల్పడుతున్న వైనం
ఎప్పుడో ఒకసారి వేయించుకుంటే
వృథా అంటున్న నిపుణులు
బంకు యజమానుల తీరుపై
వినియోగదారుల మండిపాటు
వాహనదారుకు సంకటం
Comments
Please login to add a commentAdd a comment