పెట్టుబడి.. రూ. 5 కోట్ల బురిడీ
వృద్ధురాలి డిజిటల్ అరెస్టు, రూ. 42 లక్షలకు పైగా లూటీ
బనశంకరి: సిలికాన్ సిటీలో సైబర్ నేరాల గురించి పోలీసులు ఎంత జాగృతం చేసినప్పటికీ ప్రజలు మోసపోతూనే ఉన్నారు. దుండగులు సోషల్ మీడియాలో చురుకుగా ఉన్న వారికి గాలంవేసి నగదు దోచేస్తున్నారు. హొసకెరెహళ్లి రంజిత్ అనే వ్యక్తి పెట్టుబడి డబుల్ అని ఆశపడి రూ.5 కోట్లు పోగొట్టుకున్నారు. బ్యాటరాయనపుర రెడ్డి లేఔట్‌లో అధ్యాపకురాలి నుంచి రూ.7.76 లక్షలు దోచేశారు. మరొక వృద్ధురాలిని డిజిటల్ అరెస్టు చేసి రూ. 43 లక్షల వరకూ టోపీ వేశారు.
1 కోటికి రూ.2 కోట్లు ఇస్తామని
హొసకెరెహళ్లి రింగ్‌రోడ్డు నివాసి రంజిత్ సోషల్ మీడియాలో షేర్‌మార్కెట్ ఔత్సాహికుల కోసం గాలించాడు, అతడికి ఫైనాన్స్ సర్వీస్ వెబ్‌సైట్‌లో మోసగాళ్లున జి.తుషీత్, మంగుకియా, జుహి వీ.పాటిల్, డీ.జడేజా అనేవారు పరిచయమయ్యారు. రంజిత్‌ను సీ–606 అనే వాట్సాప్ గ్రూప్‌లో వంచకులు చేర్చారు. గ్రూప్‌లో జడేజా అనే వ్యక్తి పెట్టుబడి సమాచారం పోస్టు చేసేవాడు. కోటి రూపాయలు పెట్టుబడిపెడితే కొద్దిరోజుల్లో రూ.2 కోట్లు ఇస్తామని ఆశచూపించేవారు. వంచకుల మాటలు నమ్మిన రంజిత్ డిసెంబరు 28 నుంచి ఫిబ్రవరి 8వ తేదీ వరకు తన బ్యాంక్ అకౌంట్ల నుంచి రూ.5.2 కోట్లు జమచేశాడు. ప్రతిఫలంగా రూ.12.93 కోట్లు ఇస్తామని వంచకులు హామీ ఇచ్చారు. రంజిత్ నగదు వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నించగా కొన్ని కోట్ల రూపాయల సేవా పన్ను చెల్లించాలని సూచించారు. ఎంత అభ్యర్థించినా వారు పట్టించుకోలేదు. దీంతో ఇది స్కాం అని గుర్తించి బెంగళూరు దక్షిణ విభాగం సీఈఎన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. విచారించిన పోలీసులు బాధితుడు ఏయే ఖాతాలకు నగదు పంపిందీ ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
అధ్యాపకురాలికి
రూ.7.76 లక్షలు
బ్యాటరాయనపుర రెడ్డి లేఔట్‌లో నివసించే అధ్యాపకురాలు ఎంసీ లక్ష్మీప్రియాకు షేర్లు– పెట్టుబడి పేరుతో సైబర్ నేరగాళ్లు రూ.7.76 లక్షలు మోసగించారు. ఆమెను స్నేహ అగర్వాల్ అనే యువతి ఓ వాట్సాప్ గ్రూపులో చేర్చింది. తరువాత సిద్దార్థ్ అనే వ్యక్తి ఫోన్ చేసి ఏఐ పాలసీ ఉందని, పెట్టుబడిపెడితే కొద్దిరోజుల్లో రెట్టింపు డబ్బు వస్తుందని నమ్మించాడు. ప్రారంభంలో కొద్దిగా నగదు పెట్టుబడి పెట్టింది, హెచ్‌ఈం యాప్ ద్వారా లాభం వచ్చినట్లు చూపించారు. వేర్వేరు షేర్లలో నగదు పెట్టుబడి పెట్టాలని చెప్పగా ఆమె జనవరి 24 తేదీ నుంచి ఫిబ్రవరి 7 వరకు ఐఎంపీఎస్ ఆర్‌టీజీఎస్ , నెఫ్ట్ ద్వారా రూ.7.76 లక్షలు నగదు జమచేసింది. ఆ తరువాత స్పందన లేకపోవడంతో పశ్చిమ విభాగం సైబర్ ఠాణాలో ఫిర్యాదు చేసింది.
సిలికాన్ సిటీలో బడా సైబర్ మోసం
మరో ఇద్దరు మహిళలకు
రూ.50 లక్షకు పైగా టోపీ
సీబీఐ ముసుగులో విశ్రాంత ప్రభుత్వ ఉద్యోనికి రూ.42.85 లక్షలు వంచన చేశారు. బాధితురాలు హుడి సర్కిల్ నివాసి కేఎన్.సావిత్రి (77), ఆమెకి దుండగులు కాల్ చేసి మీపై అక్రమ నగదు బదిలీ కేసు నమోదైందని, బ్యాంక్ అకౌంట్ పరిశీలించాలని డిజిటల్ అరెస్టు అని బెదిరించారు. ఆమె ఖాతా వివరాలను చెప్పడంతో రూ.42.85 లక్షలు నగదు లాగేసుకున్నారు. బాధితురాలు వైట్‌ఫీల్డ్ సైబర్‌క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మొదట ఆమెకు ఫోన్ చేసి ట్రాయ్ అధికారినని దుండగుడు చెప్పాడు, మీ పేరుతో అక్రమ మార్కెటింగ్ మెసేజ్‌లు పలువురికి వెళ్లాయని, ఫిర్యాదులు రాగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని తెలిపాడు. ఈ కేసులో మీకు సహాయం చేస్తానని, ముంబై పోలీసులకు కనెక్షన్ కలుపుతానని చెప్పాడు. తరువాత గుర్తుతెలియని వ్యక్తులు ఆమెకు ఫోన్ చేసి తాము సీబీఐ అధికారులమని, మీ వాంగ్మూలం నమోదు చేయాలని చెప్పారు. ఈ తతంగంతో వృద్ధురాలు హడలిపోయి వారు చెప్పినట్టల్లా చేసింది, చివరకు బ్యాంకు ఖాతాల నుంచి రూ.42.85 లక్షలు దోచుకుని ఫోన్లు బంద్ చేసుకున్నారు. సైబర్ ఠాణా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment