అనాథ బిడ్డకు అమ్మానాన్నగా..
సాక్షి,బళ్లారి: ఎవరి కన్న బిడ్డో చెత్తబుట్టలో పారవేశారు. తల్లి ఒడిలో సేదతీరాల్సిన నవజాత శిశువు చెత్తబుట్ట(కసువు)లో రోదిస్తున్న దృశ్యం కనిపించింది. దీంతో గమనించిన చుట్టు పక్కల ప్రజలు పోలీసులకు తెలియజేయడంతో అనాథ బాల శరణాలయంలో చేర్పించిన ఘటన జరిగింది. నవజాత శిశువు అందులోను దివ్యాంగుడైన రెండున్నరేళ్ల బాలుడు ప్రస్తుతం ఇటలీకి పయనం అవుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. బెళగావి జిల్లాలో రెండున్నరేళ్ల క్రితం చోటు చేసుకున్న ఈ ఘటన అప్పట్లో జిల్లా వాసులను కలిచివేసింది. ఏడు నెలలకే జన్మించిన నవజాత శిశువును ఏ తల్లి కన్నదో తెలియదుకానీ కనికరం లేకుండా ఊరి శివార్లలో చెత్తకుప్పలో పారవేసి తనకేమీ తెలియనట్లు వెళ్లిపోయింది. అయితే ఆ శిశువును గమనించిన వారు పోలీసులకు సమాచారం చేరవేయడంతో బెళగావిలోని స్వామి వివేకానంద సేవా ట్రస్ట్‌కు చెందిన గంగమ్మ చిక్కంబిమఠ బాలకళ్యాణ కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న దివ్యాంగుడు ప్రస్తుతం ఎల్లలు దాటుతున్నాడు.
ఆదర్శంగా నిలిచిన వైనం
కన్నడ కందమ్మను ఇటలీకి చెందిన బుజార్ డెడె, వైద్యురాలు కోస్టాంజా దంపతులు భారత దేశానికి చెందిన ఈ దివ్యాంగుడిని దత్తత తీసుకొని ఆదర్శంగా నిలిచారు. మంగళవారం బెళగావిలోని గంగమ్మ చిక్కంబిమఠ బాలకళ్యాణ కేంద్రంలో దత్త స్వీకరణ కార్యక్రమం సాదాసీదాగా ముగించారు. ఇటలీలోని ఫ్లారెన్స్ నగరానికి చెందిన కోస్టాంజా, బుజార్ డెడె దంపతులు దివ్యాంగ చిన్నారిని దత్తత స్వీకరణ కార్యక్రమం చట్టబద్ధంగా పూర్తి చేశారు. ఫ్లారెన్స్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఫిజియోథెరపీ వైద్యురాలైన ఈమె తన ఆస్పత్రిలో ఎంతో మందికి సేవ చేస్తోంది. 2015లో దివ్యాంగుడైన బుజార్‌ను పెళ్లి కూడా చేసుకుంది. స్వతహాగా దివ్యాంగులైన దంపతులు మరొక్క దివ్యాంగుడికి జీవితం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆ దిశగా అడుగులు వేస్తూ భారత దేశానికి చెందిన బెళగావిలోని చిన్నారుల అనాథ శరణాలయాన్ని సంప్రదించారు. ఈ నేపథ్యంలో దరఖాస్తు చేసుకున్న ఈ దంపతులకు చట్టం ప్రకారం దత్తత స్వీకరణ పూర్తి చేశారు.
చట్టప్రకారం దత్తత పూర్తి
ఈ సందర్భంగా బెళగావి చిక్కంబిమఠ బాలకళ్యాణ కేంద్రం అధ్యక్షురాలు మనీష బాండనకర్ మాట్లాడుతూ తమ కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న ఈ బాలుడు ఏడు నెలలకే జన్మించడంతో పాటు తూకం ఒక కేజీ 300 గ్రాములు మాత్రమే ఉండటంతో ఆరోగ్యంలో చాలా సమస్యలు ఉన్నాయి. అంతేగాకుండా దృష్టి లోపం కూడా ఉండటంతో చెత్తబుట్టలో దొరికిన ఈ బాలుడిని ఎంతో శ్రద్ధతో పెంచామని ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ ఇవ్వడంతో ప్రస్తుతం మాట్లాడుతూ, నడుస్తున్నాడన్నారు. అయితే ఎవరి కన్న బిడ్డో ఈ బాలుడిని, ఎవరి రుణం కోసమో పెంచుకోవాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో చట్ట ప్రకారం సెంట్రల్ అడాప్షన్ డెసోస్ అథారిటీ( ఖరా) నియమానుసారం దత్తత ఇస్తున్నామన్నారు. జిల్లాధికారి సమక్షంలో దత్తత ప్రక్రియ పూర్తయింది. బాలుడికి పాస్‌పోర్ట్ కూడా సిద్ధం అయింది. ఇక్కడి నుంచి బెంగళూరుకు వెళ్లి వీసా తీసుకొని ఇటలీ దేశానికి త్వరలో బయలుదేరుతున్నామన్నారు.
120 మంది పిల్లల దత్తత
అంతేగాకుండా 2011 నుంచి ఇప్పటి వరకు తమ కేంద్రంలో దాదాపు 120 మంది చిన్నారులను దత్తత ఇచ్చామన్నారు. విదేశాలకు కూడా దాదాపు 15 మందిని అందజేశామని గుర్తు చేశారు. ఇటలీకి కూడా ఈ బాలుడితో కలిపి ఇద్దరిని పంపామన్నారు. తమ దగ్గర ఉన్న చిన్నారుల చిత్రాలను వైబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తామని, కావాల్సిన వారు ఆయా దేశాల నుంచి తమను సంప్రదిస్తారన్నారు. వైబ్‌సైట్ ద్వారా సంప్రదించిన ఈ దంపతులు నేరుగా వచ్చి చట్ట ప్రకారం దత్తత తీసుకున్నారన్నారు. దత్తత తీసుకొన్న ఇటలీ దంపతులు మాట్లాడుతూ భారత దేశ సంస్కృతి, వారసత్వాలు తమకెంతో నచ్చాయన్నారు. దివ్యాంగుడిని దత్తత తీసుకోవాలని సంకల్పం మేరకు తాము ఇక్కడికి వచ్చి దత్తత తీసుకున్నామన్నారు. ఈ బాలుడిని ఎంతో శక్తి వంతుడిగా తయారు చేస్తామన్నారు. తమ దేశానికి పిలుచుకెళ్లి బాలుడిని తమతో పెంచుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు.
నవజాత శిశువును పెంచిన బెళగావి అనాథాశ్రమం
దివ్యాంగుడిని దత్తత తీసుకున్న ఇటలీ దంపతులు
చెత్తబుట్టలో దొరికిన శిశువు త్వరలో ఇటలీకి పయనం
అనాథ బిడ్డకు అమ్మానాన్నగా..
Comments
Please login to add a commentAdd a comment