అంగన్‌వాడీ కేంద్రంలో బాలిక మృతి
సాక్షి,బళ్లారి: అంగన్‌వాడీ కేంద్రంలో ఆటలాడుతూ ఓ చిన్నారి మృతి చెందిన ఘటన కొప్పళ జిల్లా కుష్టిగి తాలూకా బళూటగిలో జరిగింది. గ్రామానికి చెందిన అలియా మహమ్మద్ రియాజ్(5) అనే బాలిక అంగన్‌వాడీ కేంద్రంలో ఆటలాడుతున్న సమయంలో కుప్పకూలి పోయింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లే లోపు బాలిక మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. బాలిక మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నేడు వెట్టిచాకిరీ
నిషేధంపై సదస్సు
హుబ్లీ: జిల్లా యంత్రాంగం, జెడ్పీ, జిల్లా న్యాయసేవా ప్రాధికార, వివిధ శాఖల సంస్థల ఆధ్వర్యంలో వెట్టిచాకిరీ నిర్మూలన దినం సందర్భంగా వెట్టిచాకిరీ నిషేధ సదస్సును బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు జెడ్పీ సభాంగణంలో ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని జిల్లా న్యాయసేవా ప్రాధికార సభ్యత్వ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి పరశురామ దొడ్డమని ప్రారంభిస్తారు. కార్యక్రమంలో జిల్లాధికారిణి దివ్య ప్రభు, జెడ్పీ సీఈఓ భునేష్ పాటిల్, పోలీస్ కమిషనర్ శశికుమార్, ఎస్పీ డాక్టర్ గోపాల్ బ్యాకోడ, ఏడీసీ గీతా సీడీ తదితరులు పాల్గొంటారు. ముక్తి అలయన్స్ కర్ణాటక సర్లిన్ య్యాథోని, ధార్వాడ కిడ్స్ సేవా సంస్థ డైరెక్టర్ అశోక్ యరగట్టి మానవ సంపన్మూల వ్యక్తిగా పాల్గొని శిక్షణ ఇవ్వనున్నట్లు సంబంధిత అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
పౌష్టికాహార కిట్లలో
అక్రమాలు తగదు
హుబ్లీ: అంగన్‌వాడీ పిల్లలకు ఇవ్వాల్సిన పౌష్టికాహారం కిట్లను కాంగ్రెస్ నేత అక్రమంగా నిల్వ చేయడం తగదని, ఈ ఘటనపై పోలీసులు సమగ్ర దర్యాప్తు జరిపి దీని వెనుక ఉన్న వారిని గుర్తించి దోషులను శిక్షించాలని వీఐకే ఫౌండేషన్ వ్యవస్థాపకులు, బీజేపీ యువ నేత వెంకటేష్ కాట్వే డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ అంగన్‌వాడీ చిన్నారుల ఆహార పదార్థాలను నల్లబజారుకు తరలించడం సిగ్గుచేటు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కాంతరాజ్ నివేదిక అమలుకు డిమాండ్
రాయచూరు రూరల్: రాష్ట్రంలో వెనుక బడిన వర్గాలకు రిజర్వేషన్ల పెంపుదల విషయంలో జస్టిస్ కాంతరాజ్ నివేదికను అమలు చేయాలని వెనుక బడిన వర్గాల కమిటీ అధ్యక్షుడు శాంతప్ప పేర్కొన్నారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 2023లో అధికారం చేపడితే కాంతరాజ్ కమిషన్ నివేదికను అమలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇంతవరకు ఆ దిశగా స్పందించ లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పలు అభివృద్ధి మండళ్లను ఏర్పాటు చేసినా నిధులు మంజూరు చేయడంలో నిర్లక్ష్యం వహించడాన్ని ఖండించారు.
స్వసహాయ సంఘాలకు లాభాలు పంపిణీ
బళ్లారిఅర్బన్: ధర్మస్థల గ్రామీణ అభివృద్ధి పథకం స్వసహాయ సంఘాలకు లాభాల వాటా పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా డైరెక్టర్ రోహితాక్ష ప్రారంభించారు. నగరంలోని గాంధీనగర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లాభాల వాటాను ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. గ్రామీణ బ్యాంకుల్లో స్వసహాయ సంఘాల సీసీ ఖాతాలను ప్రారంభించి ప్రతివారం చెల్లించిన పొదుపుపై లాభాలను కల్పించే కీలక పాత్ర పోషిస్తున్న శ్రీక్షేత్రధర్మస్థల గ్రామాభివృద్ధి పథకం దేశానికే ఆదర్శం అన్నారు. ఆ మేరకు జిల్లా పరిధిలో మొత్తం 8409 స్వసహాయ సంఘాలకు రూ.12 కోట్ల 36 లక్షల లాభాల వాటా పంపిణీ చేశామన్నారు. బళ్లారి తాలూకా పరిధిలో 1345 సంఘాలకు మొత్తం రూ.2 కోట్ల 8 లక్షల లాభాల వాటా మంజూరైందన్నారు. బళ్లారి నగర జోన్‌లో 165 సంఘాలకు రూ.31.16 లక్షల లాభాల వాటా పంపిణీ చేశామన్నారు. కర్ణాటక గ్రామీణ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంకుల్లో స్వసహాయ సంఘాల సభ్యుల నుంచి మొత్తం రూ.12.81 కోట్లను పొదుపు చేశారన్నారు. బళ్లారి–1, బళ్లారి–2, సిరుగుప్ప, సింధనూరు, కంప్లి, సండూరు ఇలా ఆరు పథకాల కార్యాలయాల పరిధిలో స్వసహాయ సంఘాలకు ఆ బ్యాంకుల ద్వారా అతి తక్కువ 14 శాతం వడ్డీ ధరతో ప్రగతి నిధి రుణాలను ఇచ్చామన్నారు. దీని వల్ల ఆ సంఘా సభ్యులు ఆర్థిక స్వావలంబన సాధించి మెరుగైన జీవితం గడుపుతున్నారన్నారు. ఆ సంఘం ప్రముఖులు వెంకటేష్ పటగార్, సంజీవ్‌కుమార్, వనిత, దుర్గమ్మ పాల్గొన్నారు.
సేంద్రియంపై పరిశోధనలేవీ?
రాయచూరు రూరల్: నేటి ఆధునిక యుగంలో విద్యార్థులు సేంద్రియ వ్యవసాయంపై పరిశోధనలు జరపాలని వైస్ చాన్సలర్ హనుమంతప్ప పేర్కొన్నారు. మంగళవారం రాయచూరు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చీ, భూసేన మాదిరి నమూనా సమ్మేళనాన్ని ప్రారంభించి విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా నూతన సాంకేతిక రంగాలను అభివృద్ధి పరచుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పరుస్తున్న వ్యవసాయ అంశాలను రైతులకు వివరించాలన్నారు. సమావేశంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ గురునాథ్, వీరనగౌడ, దేశాయి, ప్రమోద్ కట్టిమని, అధికారులు పాల్గొన్నారు.
అంగన్‌వాడీ కేంద్రంలో బాలిక మృతి
అంగన్‌వాడీ కేంద్రంలో బాలిక మృతి
Comments
Please login to add a commentAdd a comment