హుబ్లీ: గర్భిణులు, బాలింతలతో పాటు అంగన్‌వాడీ చిన్నారులకు పంపిణీ చేసే పౌష్టికాహార పదార్థాలను అక్రమంగా నిల్వ చేసి రవాణా చేస్తున్న ఆరోపణల కేసులో 18 మంది అంగన్‌వాడీ కార్యకర్తలతో పాటు 26 మందిని అరెస్ట్ చేశారు. అంతేగాక వాహనాలతో పాటు సదరు ఆహార పదార్థాలను జప్తు చేశారు. ఇద్దరు కీలక నిందితులు పరారయ్యారని, వారి అరెస్ట్ కోసం తీవ్రంగా గాలింపు చేపట్టినట్లు జంట నగరాల పోలీస్ కమిషనర్ ఎన్.శశికుమార్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాకు నిందితుల ఫోటోలతో పాటు వివరాలను వెల్లడించారు. ధార్వాడ తాలూకా నరేంద్ర గ్రామ బొలెరో వాహన యజమాని మంజునాథ్ దేశాయి, డ్రైవర్ లకమాపుర బసవరాజ్ భద్రశెట్టి, గోదాం యజమానికి పాత హుబ్లీ నేకార నగర మహమ్మద్ గౌస్ ఖలిఫా, అద్దెదారుడు గౌతం సింగ్ ఠాగూర్, హుబ్లీ తాలూకా కురిడికేరి మంజునాథ మాదర, కుందగోళ తాలూకా యరగుప్పి ఫక్కీరేష అలగి, కృష్ణ మాదర, రవి హరిజనతో పాటు 18 మంది అంగన్‌వాడీ కార్యకర్తలను అరెస్ట్ చేశామన్నారు.
రూ.4 లక్షల సరుకులు స్వాధీనం
నిందితుల నుంచి రూ.4 లక్షల విలువ చేసే 329 బస్తాల్లోని 8 టన్నుల 84 కేజీల ఆహార పదార్థాలైన గోధుమ రవ్వ, మిల్లెట్ లడ్డు, బియ్యం, పాలపొడి, సాంబార్ మసాలా పొడి, బెల్లం, ఉప్మా రవ్వ, చక్కెర, శెనగపప్పుతో పాటు మసాలా పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం పాత గబ్బూరు శివారు గోదాంపై దాడి చేయగా అక్కడ అంగన్‌వాడీ పిల్లలు, గర్భిణులు, బాలింతలకు ఉచితంగా పంపిణీ చేసే ఆహార పదార్థాలను అక్రమంగా నిలువ చేసి వాటిని బ్లాక్ మార్కెట్‌లో విక్రయించే వారు ఈ దందాపై సీ్త్ర శిశు సంక్షేమ శాఖ జిల్లా నిర్వహణాధికారి కసబాపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు 18 మంది అంగన్‌వాడీ కార్యకర్తలతో కలిపి 26 మందిని అరెస్ట్ చేశారు.
కేసుపై సమగ్ర దర్యాప్తు
పెద్ద ఎత్తున ఆహార ధాన్యాలు పట్టుబడటంతో ఈ కేసును అధికారులు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఈ కేసులో పాలు పంచుకున్నవారు ఎవరెవరో ఆరా తీస్తున్నారు. బ్లాక్ మార్కెట్‌లో వీటిని ఎలా విక్రయించే వారు? దీనికి సంబంధించిన ముఠా ఎంత పెద్దగా వ్యాపించిందో దర్యాప్తులో నిగ్గు తేలుస్తారు. ఇది తీవ్రమైన కేసు అని, నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీస్ కమిషనర్ శశికుమార్ వివరించారు.
18 మంది కార్యకర్తలతో పాటు
మొత్తం 26 మంది అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment