కుర్చీ కలహం
సాక్షి, బెంగళూరు: ముఖ్యమంత్రి కుర్చీ కోసం కొన్ని నెలలుగా రాష్ట్ర కాంగ్రెస్‌లో లోలోపల కుమ్ములాటలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నో ఆటుపోట్ల మధ్య, అసాధ్యమనుకున్న సమయంలో 2023 విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారాన్ని సాధించింది. మాజీ సీఎం సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కృషి కాదనలేని నిజం. ఆ తర్వాత ఢిల్లీలో రెండురోజుల ఉత్కంఠభరిత చర్చల తరువాత సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి పీఠం వరించింది. డీకే శివకుమార్ డిప్యూటీ సీఎం పదవితో సంతృప్తి చెందాల్సి వచ్చింది. తలా రెండున్నరేళ్లు సీఎం పదవిని పంచుకోవాలనే ఒప్పందం కుదిరిందని అప్పట్లో ప్రచారం సాగింది. అప్పటి నుంచి సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వర్గాలు నేతలు విడిపోయి అంతర్గతంగా ముఖ్యమంత్రి పదవి కోసం లాబీయింగ్‌లు, పోరాటాలు చేస్తూనే ఉన్నారు.
ఎవరి వర్గానిది పైచేయి
ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు తీవ్ర రూపాన్ని దాల్చింది. బహిరంగ విమర్శలు చేసుకుంటున్నారు. డీకే శివకుమార్ బలం తగ్గుతోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. సీఎం స్థానంపై గంపెడాశలతో ఉన్న డీకే శివకుమార్ ఆశలపై ఈ వ్యతిరేక వర్గం ఎప్పటికప్పుడు నీళ్లు చదువుతోంది. అధికార పంపిణీ అంశం చర్చకు తెరలేసినప్పుడు డీకే శివకుమార్ తరపున ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే మద్దతుగా మాట్లాడుతున్నారు. అయితే సీఎం సిద్ధరామయ్య తరపున హేమాహేమీ నాయకులు, సీనియర్లు గళమెత్తడం గమనార్హం. 50–50 సూత్రం లేదు, తమ నాయకుడు సిద్ధరామయ్యనే అని, ఐదేళ్లు అయనే సీఎంగా కొనసాగుతారని మంత్రులు రాజణ్ణ, జమీర్ అహ్మద్, మహదేవప్ప వంటివారు మాట్లాడడం డీకే శిబిరానికి మింగుడు పడడం లేదు. మంత్రులు ఎంబీ పాటిల్, సతీశ్ జార్కిహోళి, జి.పరమేశ్వర్ వంటి సీనియర్లు సిద్దుకు మద్దతుగా నిలిచారు. ఒకవేళ సీఎంను మారిస్తే, ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలకు అవకాశం ఇవ్వాలని డీకే శివకుమార్‌కు చెక్ పెడుతున్నారు.
సీఎం సిద్దరామయ్య వర్గం పైచేయి
డిప్యూటీ సీఎం డీకే నిరీక్షణ
ఫిఫ్టీ– ఫిఫ్టీ సూత్రంపైనే ఆశలు
హైకమాండ్‌పై ఆశలు
డీకే శివకుమార్ తరపున మాట్లాడేవారే కరువయ్యారు. మాగడి బాలకృష్ణ వంటి ఒకరిద్దరు నేతలు మినహా మిగిలిన నేతలెవ్వరూ శివకుమార్‌కు జై కొట్టడం లేదు. కేబినెట్ మొత్తం దాదాపుగా సీఎం సిద్ధరామయ్య పక్షమే.. ఇటీవల మంత్రులు కేఎన్ రాజణ్ణ, సతీశ్‌లు హైకమాండ్‌తో చర్చలు జరిపారు. తమ అభిప్రాయాలు, ఆరోపణలను హైకమాండ్ దృష్టికి తీసుకొచ్చారు. కానీ ముడా స్థలాల కేసులో సీఎం సిద్దరామయ్య చిక్కుకోవడంతో బలం తగ్గినట్లయింది. ఇక డీకే హైకమాండ్ మీదనే ఆశలు పెట్టుకుని పావులు కదిలిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనకు అన్యాయం చేయదని భావిస్తున్నారు.
కుర్చీ కలహం
Comments
Please login to add a commentAdd a comment