కేపీఎస్‌సీపై నిరసన
శివాజీనగర: కేపీఎస్‌సీ పరీక్షల్లో కన్నడిగులకు అన్యాయం జరిగిందని కరవే కార్యకర్తలు సోమవారం నగరంలో ఆ విభాగం ఆఫీసు ముందు ధర్నా చేశారు. పోలీసులు వచ్చి వారిని లాక్కెళ్లేందుకు యత్నించడంతో గలాటా జరిగింది. కమిషన్ గత డిసెంబర్‌లో జరిపిన 384 గెజిటెడ్ పోస్టులకు పరీక్షలు జరిపింది. కన్నడ ప్రశ్నాపత్రాల్లో తప్పులు వచ్చాయని, దాంతో కన్నడ అభ్యర్థులు పరీక్ష రాయడంలో ఇబ్బందులు పడి అన్యాయం జరిగిందని నిరసనకారులు ఆరోపించారు. కన్నడ విద్యార్థులకు మరోసారి పరీక్ష పెట్టాలని ప్రభుత్వానికి విన్నవించాం. పునః పరీక్షలో కూడా తప్పులు చేశారు, ఇదేం పద్ధతని మండిపడ్డారు. ధర్నాతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది.
లింగాయత్ నేతలతో సీఎం భేటీ
శివాజీనగర: బసవ తత్వ, వచన సంస్కృతి, శరణుల పోరాటంపై తమ ప్రభుత్వానికి ఆసక్తి ఉందని, స్వామీజీల డిమాండ్లలో సాధ్యమైనవాటిని దశలవారీగా నెరవేరుస్తామని సీఎం సిద్దరామయ్య భరోసానిచ్చారు. నగరంలో కావేరి నివాసంలో సోమవారం లింగాయత్ స్వామీజీలు, మంత్రులు, నేతలతో సీఎం భేటీ అయ్యారు. బసవణ్ణ ఫోటోను ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పని చేసినది తమ ప్రభుత్వమేనని అన్నారు. బసవణ్ణ తత్వ సారాంశాలను ఎవరూ బహిరంగంగా వ్యతిరేకించలేరన్నారు. అందుకే అంతర్గతంగా వ్యతిరేకిస్తున్నారని పరోక్షంగా ప్రతిపక్షాలను విమర్శించారు. ఈ సందర్భంగా వారు సీఎంను బసవణ్ణ చిత్రపటం ఇచ్చి సన్మానించారు.
100 స్కూలు బస్సుల సీజ్
దొడ్డబళ్లాపురం: బెంగళూరులో సోమవారంనాడు ఆర్టీఓ అధికారులు స్కూల్, కాలేజీ బస్సుల తనిఖీలు చేశారు. సుమారు 100పైగా వాహనాలను సీజ్ చేశారు. ఎఫ్‌సీ, పర్మిట్, ట్యాక్స్ బకాయిలు, అధికంగా రవాణా తదితరాలను పరిశీలించారు. నిబంధనలను ఉల్లంఘించిన కొన్ని బస్సులను సీజ్ చేశారు. స్కూల్, కాలేజీ వాహనాల్లో సీసీ కెమెరాలు, ప్యానిక్ బటన్, ప్రథమ చికిత్స పెట్టె, మంటలనార్పే సాధనాలు లేని వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఓట్ల కోసం ఉపేక్షిస్తారా: కుమారస్వామి
మైసూరు: మైసూరు నగరంలోని ఉదయగిరి పోలీసుస్టేషన్‌ను వందలాది మంది ముట్టడించి రాళ్ల దాడి చేసి పోలీసులను గాయపరిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదని కేంద్రమంత్రి హెచ్‌డి కుమారస్వామి మండిపడ్డారు. సోమవారం మైసూరుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంతటి దారుణ చర్యలకు పాల్పడినవారిని అరెస్టు చేసి ఎందుకు జైలుకు పంపించడం లేదని ధ్వజమెత్తారు. ఒక మతం వారి ఓట్ల కోసం ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉందని, పైగా వారిని కాపాడుతోందని అన్నారు.
పాలికె ఆర్‌ఓ ప్లాంట్లు జలమండలికి
శివాజీనగర: బెంగళూరు నగరంలోని శుద్ధ జల కేంద్రాలు (ఆర్‌ఓ ప్లాంట్లు) నిర్వహణను బీబీఎంపీ నుంచి జలమండలికి అప్పగించాలని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అధికారులకు సూచించారు. తక్షణమే ఈ పనిని పూర్తి చేయాలని ఆదేశించారు. ఆర్‌ఓ ప్లాంట్ల నిర్వహణను బీబీఎంపీ చూస్తోంది. అయితే మంచినీటి సరఫరాను పర్యవేక్షించే జలమండలి చేతిలో ఉంటే ఉత్తమమని డీసీఎం తెలిపారు. నీటి సరఫరాలో రెండు విభాగాల మధ్య సమన్వయ కొరత నెలకొని ప్రజలకు ఇబ్బంది కలుగుతోంది, దీనిని తప్పించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment