జిల్లా అభివృద్ధిపై పూర్తి నిర్లక్ష్యం
సాక్షి,బళ్లారి: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బళ్లారి జిల్లా అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని మాజీ మంత్రి శ్రీరాములు మండిపడ్డారు. ఆయన శనివారం తన నివాస గృహంలో విలేకరులతో మాట్లాడారు. పేరుకు మాత్రమే నాలుగు లక్షల కోట్లు బడ్జెట్ అని చెప్పుకుంటున్నా, ఏ వర్గానికి కూడా మేలు చేయలేదన్నారు. బడ్జెట్‌లో ముస్లింలకు పెద్దపీట వేసి నిధులు కేటాయించినందుకు తనకు వ్యక్తిగతంగా ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అయితే మిగిలిన వర్గాలను కూడా పట్టించుకుని ఉంటే బాగుండేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బడ్జెట్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. ఎస్‌సీ, ఎస్‌టీలకు కేటాయించిన నిధులు గ్యారెంటీలకు మళ్లించారని ఆక్రోశించారు. రూ.51 వేల కోట్లు గ్యారెంటీలకు ఖర్చు చేస్తున్నారన్నారు. అయితే శక్తియోజన కింద కేఎస్‌ఆర్‌టీసీ బస్సుల తీరు ఎలా ఉందో కూడా తెలుసుకోవడం లేదన్నారు. డొక్కు బస్సులతో జనం ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం స్వార్థపూరితమైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారన్నారు.
జిల్లా వైపు కన్నెత్తి చూడని
ఇన్‌ఛార్జి మంత్రి
స్వార్థపూరితమైన బడ్జెట్‌ను
ప్రవేశపెట్టిన సీఎం
బడ్జెట్‌పై మాజీ మంత్రి శ్రీరాములు మండిపాటు
మళ్లీ మంత్రి అయ్యేదాకా నియోజకవర్గానికి రారేమో?
మాజీ మంత్రి, బళ్లారి గ్రామీణ ఎమ్మెల్యే బీ.నాగేంద్ర మంత్రి పదవి నుంచి వైదొలిగినప్పటి నుంచి నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదనే విమర్శలు ఉన్నాయన్నారు. జిల్లా అభివృద్ధి గురించి పట్టించుకునే నాథుడే లేకుండా పోయారన్నారు. మళ్లీ మంత్రి అయిన తర్వాతే నియోజకవర్గానికి, జిల్లాకు నాగేంద్ర వస్తారేమోనని ఎద్దేవా చేశారు. వ్యక్తిగతంగా చేసిన తప్పులకు మంత్రి పదవిని కోల్పోయి మళ్లీ మంత్రి పదవి కోసం ఆరాట పడుతున్నారని విమర్శించారు. జిల్లాలో ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నా బడ్జెట్‌లో నిధుల కేటాయింపులో మాత్రం మొండిచేయి చూపారన్నారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి జిల్లా వైపు కన్నెత్తి చూడటం లేదన్నారు. హంపీ ఉత్సవాలకు కూడా ఇలా వచ్చి అలా వెళ్లిపోయారన్నారు. బళ్లారి జిల్లాకు రాని వ్యక్తికి ఎందుకు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పదవి ఇచ్చారని సీఎంను ప్రశ్నించారు. ఈసందర్భంగా మాజీ బుడా అధ్యక్షుడు పాలన్న, కార్పొరేటర్ గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment